అంబరమంత విజయం

అంబరాన్ని చుంబిస్తూ ఎగిరే లోహ విహంగాలను అబ్బురంగా చూసేవాడు. చిన్నప్పట్నుంచీ విమానం బొమ్మలే కావాలని మారాం చేసేవాడు.

Published : 08 Jul 2023 00:51 IST

అంబరాన్ని చుంబిస్తూ ఎగిరే లోహ విహంగాలను అబ్బురంగా చూసేవాడు. చిన్నప్పట్నుంచీ విమానం బొమ్మలే కావాలని మారాం చేసేవాడు. పసితనంలో ఏర్పడిన ఆ ఉత్సుకతే.. ఆకాశాన్ని ముద్దాడాలనే ఆశయాన్ని అతడిలో ప్రోది చేసింది... 22 ఏళ్ల అతిచిన్న వయసులోనే ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యే  ఘనతను సాధించేలా చేసింది. ఆ కుర్రాడే సూగూరు  నిఖిల్‌సాయి.

తోటి పిల్లలంతా ఇసుకలో గుజ్జనగూళ్లు కడుతుంటే వనపర్తి కుర్రాడు నిఖిల్‌సాయి ఆకాశంలో ఎగిరే విమానాలను ఆసక్తిగా గమనించేవాడు. అంతా ఆటపాటల్లో ఉంటే.. తనేమో విమానం ఎగరడంలోని సైన్స్‌ మర్మమేంటో తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. ఊహ తెలియడం మొదలయ్యాక.. యుద్ధ విమానాల ఛేజింగ్‌ సన్నివేశాలు.. జేమ్స్‌బాండ్‌ సినిమాలతో ఇంట్లోని టీవీ దద్దరిల్లిపోయేది. మొత్తానికి అతడి ఆట, చదువు.. అన్నీ విమానాలతోనే ముడిపడి ఉండేవి.
నిఖిల్‌ చదువులోనూ చురుకే. ఏడు పూర్తయ్యేసరికే పైలట్‌ కావాలనే లక్ష్యం స్థిరపడింది. అమ్మానాన్నలూ ‘గో.. ఎహెడ్‌’ అన్నారు. సైనిక్‌ స్కూల్‌లో శిక్షణనిప్పించారు. ఆసక్తితోపాటు అర్హత సాధించడంతో కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విజయనగరం కోరుకొండ సైనిక్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందాడు. ఇంటర్‌ పూర్తయ్యేసరికి ఒక సైనికుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నాడు.

ఎన్‌డీఏలో ప్రవేశం

భారత సైన్యానికి చెందిన త్రివిధ దళాల అధికారులను తయారు చేసే సంస్థ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ). దీని ప్రవేశ పరీక్ష, శిక్షణ అత్యంత కఠినంగా ఉంటాయి. 2019లో ఈ ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించాడు నిఖిల్‌. దిల్లీలో నిర్వహించిన వైద్య పరీక్షలో, దెహ్రాదూన్‌లోని సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ముఖాముఖిలో ఉత్తీర్ణుడై ఎన్‌డీఏ శిక్షణకు ఎంపికయ్యాడు. తర్వాత మూడేళ్లపాటు పుణెలో సైన్యం, నావికాదళం, వాయుసేన విభాగాల్లో తర్ఫీదు తీసుకున్నాడు. మానసిక, శారీరక దృఢత్వంపై శిక్షణ పూర్తి చేశాడు. చివరికి మూడింట్లో తనకిష్టమైన వైమానిక దళాన్ని ఎంచుకున్నాడు. హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నాడు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నిఖిల్‌కి రూ.2లక్షల ఆర్థిక సాయం అందజేసింది.  

రాష్ట్రపతి చేతుల మీదుగా..

2023 జూన్‌ 17న దుండిగల్‌లో నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె చేతుల మీదుగా నిఖిల్‌సాయి ‘ఫ్లయింగ్‌ ఆఫీసర్‌’గా వింగ్‌ అందుకున్నాడు. రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన వ్యక్తి నిఖిల్‌ ఒక్కడే కావడం విశేషం. ఈమధ్యే హైదరాబాద్‌లోని హకీంపేటలో విధుల్లో చేరాడు. వాయుసేనలో అత్యున్నత హోదా ఎయిర్‌ చీఫ్‌ కావడమే తన థ్యేయమంటున్నాడు.

బుడత చంద్రశేఖర్‌, ఈజేఎస్‌


విద్యార్థి దశ నుంచే

యువతే మన దేశానికి వెన్నెముక. ఉత్తర భారతదేశంతో పోలిస్తే మన దక్షిణాది వారు సైన్యంలో చేరడం తక్కువే. ఆర్మీలో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలున్నాయి. వేతనాలు బాగానే ఉంటాయి. సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది. అన్నింటికీ మించి దేశభక్తిని చాటుకోవడానికి ఇదొక చక్కటి మార్గం. విద్యార్థి దశ నుంచి ప్రయత్నిస్తే రక్షణరంగంలో అధికారిగా కెరియర్‌ ప్రారంభించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని