ఆటలో.. గన్‌డర గండడు!

కలలు కంటే విజయాలు సాధ్యం కావు.. కసిగా పరిశ్రమించినప్పుడే ఫలితం దక్కుతుంది. అదే తూచా తప్పకుండా పాటించి ప్రపంచ యవనికపై జయకేతనం ఎగరేస్తున్నాడు మహేశ్‌.

Published : 05 Aug 2023 00:06 IST

రోజూ నలభై కిలోమీటర్లు వెళ్లి సాధన చేశాడు... కన్నతండ్రి ఆశయమే లక్ష్యంగా ముందుకెళ్లాడు... ఆట కోసం సరదాల్నీ వదిలేశాడు... ఆ శ్రమ ఊరికే పోలేదు! ఇరవై ఏళ్లకే జాతీయ స్థాయి పతకాలు కొల్లగొట్టాడు... తాజాగా ప్రపంచ జూనియర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో పతకం గెలిచాడు... తనే విజయవాడ కుర్రాడు ఉమా మహేశ్‌.

లలు కంటే విజయాలు సాధ్యం కావు.. కసిగా పరిశ్రమించినప్పుడే ఫలితం దక్కుతుంది. అదే తూచా తప్పకుండా పాటించి ప్రపంచ యవనికపై జయకేతనం ఎగరేస్తున్నాడు మహేశ్‌. తనకి మొదట్నుంచీ ఆటలంటే ఆసక్తి. స్కూళ్లో నిర్వహించే ప్రతి పోటీలో ముందుండేవాడు. కుమారుడి ప్రతిభను మొదట్లోనే గుర్తించారు మహేశ్‌ తండ్రి. ఆయనకు రైఫిల్‌ షూటింగ్‌ అంటే చెప్పలేనంత ఆసక్తి. అనివార్య కారణాలతో శిక్షణ తీసుకోలేకపోయారు. కనీసం తన వారసుడినైనా ఆటలో మేటి చేయాలనుకున్నాడు. తండ్రి మాటకు ఆ కొడుకూ సరేనన్నాడు.
లక్ష్యం సిద్ధమైంది. సాధించాలనే కసి ఉంది. కానీ తనుండే విజయవాడలో సరైన శిక్షణా కేంద్రాలు లేవు. గుంటూరులో ఆ వసతులున్నాయి. విజయవాడలో చదువుతూ, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరుకి రోజూ శిక్షణకు వెళ్లి రావడం అంటే చాలా కష్టం. అయినా వెనకడుగేయలేదు మహేశ్‌. సరదాలు, సినిమాలు అన్నీ మానుకొని ఆరు నెలల్లో షూటింగ్‌లో పట్టు సాధించాడు. మొదట్లో రైఫిల్‌ షూటింగ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే.. అధిక షాట్‌ స్కోర్‌ను సాధించాలి. అది లేకపోవడంతో చెన్నైలోని ఓ జాతీయస్థాయి శిక్షణ కేంద్రంలో చేరాడు. అక్కడ సీనియర్లతో పోటీ పడుతూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఎక్కువ షాట్‌ స్కోర్‌ సాధించడానికి నిర్విరామంగా ప్రయత్నించాడు. తక్కువ సమయంలోనే రాటు దేలాడు. హరియాణా రాష్ట్రంలో, భోపాల్‌ నగరంలో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాల పంట పండించాడు. తాజాగా కొరియాలోని చాంగ్‌వాన్‌లో జరిగిన జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచాడు.   

పల్లెర్ల సమత, ఈజేఎస్‌


పతకాల పంట

ఆరేళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  17 బంగారు, తొమ్మిది రజత, ఆరు కాంస్య పతకాలు గెలిచాడు మహేశ్‌. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ నిర్వహించిన జూనియర్‌ ప్రపంచకప్‌, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో సత్తా చాటాడు. 65వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌లో మొదటిస్థానం అతడిదే. ఆల్‌ ఇండియన్‌ ఓపెన్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం సాధించాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న మహేశ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఒలిపింక్స్‌లో దేశానికి బంగారు పతకాలు సాధించడమే లక్ష్యమంటున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని