ఓడి.. గెలిచాడు!

తన లక్ష్యం.. జనాలకు దగ్గరగా ఉండటం. సంకల్పం.. జనం జీవితాల్లో మార్పు తెచ్చే స్థానంలో ఉండటం. దానికోసం పదేళ్లు పట్టు వదలకుండా ప్రయత్నించాడు.

Published : 19 Aug 2023 00:55 IST

తన లక్ష్యం.. జనాలకు దగ్గరగా ఉండటం. సంకల్పం.. జనం జీవితాల్లో మార్పు తెచ్చే స్థానంలో ఉండటం. దానికోసం పదేళ్లు పట్టు వదలకుండా ప్రయత్నించాడు. చివరికి అనుకున్నది సాధించాడు కుప్పిరెడ్డి ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి. తాజాగా ఏపీపీఎస్‌సీ ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో నాలుగో ర్యాంక్‌ సాధించిన ఆ విజేతతో మాట కలిపింది ‘ఈతరం’.

రెండుసార్లు సివిల్స్‌ పరీక్షలు రాస్తే, మెయిన్స్‌ కూడా దాటలేదు...

నిరాశతో ప్రయత్నం ఆపలేదు!

గ్రూప్‌-2లో మంచి ఉద్యోగమే వచ్చింది...

 దాంతో సంతృప్తి చెందలేదు!

గ్రూప్‌-1లో 47వ ర్యాంకుతో సర్వీసు సాధించాడు...

ఆశయానికి సరిపోని కొలువని చేరలేదు!

గ్రూప్‌-1 చాలామందికి కలల సర్వీసు. లక్షల మంది పరీక్ష రాస్తే ముందుకెళ్లేది కొందరే. అనేక వడపోతల అనంతరం విజేతలయ్యేది మెరికల్లాంటి అతికొద్ది మందే. చదువు, ప్రతిభ, సమయస్ఫూర్తి, వ్యక్తిత్వం.. అన్నింట్లో మెప్పిస్తేనే ఆ కొలువు. దాన్నే సాధించి చూపించాడు కడప జిల్లా దొమ్మరనంద్యాల యువకుడు ప్రవీణ్‌.  

కార్పొరేట్‌ కొలువు కాదని

బీటెక్‌ పూర్తవగానే ప్రవీణ్‌కి ఒరాకిల్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. మంచి జీతం. జీవితం సాఫీగా సాగిపోతోంది. అయినా అతడిలో ఏదో అసంతృప్తి. తనకి చిన్నప్పట్నుంచీ సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్టులు అంటే ఆసక్తి. పాలిటీ, పబ్లిక్‌ రిలేషన్‌, ఎకానమీ, హిస్టరీ.. ఇష్టంగా చదివేవాడు. ఇవన్నీ జనంతో ముడిపడి ఉన్నవే. అదీగాక.. తమ నిర్ణయాలు, విచక్షణాధికారంతో ఊళ్లు, జిల్లాల ముఖచిత్రాన్నే మార్చేస్తున్న కలెక్టర్ల వార్తలు చదివినప్పుడు స్ఫూర్తి పొందేవాడు. తానూ సివిల్స్‌ సాధించాలనే లక్ష్యం ఏర్పరచుకున్నాడు. 2014, 2015లలో వరుసగా సివిల్స్‌కి ప్రయత్నించాడు. ప్రిలిమ్స్‌ పాసయ్యాడుగానీ మెయిన్స్‌ దాటలేకపోయాడు. ఒకవైపు పని ఒత్తిడి ఉద్యోగం.. మరోవైపు తీవ్రమైన పోటీ ఉండే పరీక్ష. రెండింటికీ సమయం కుదరకపోవడంతో ఉద్యోగం మానేద్దామనే నిర్ణయానికొచ్చాడు. ఇంట్లోవాళ్లు అతడి మాటకు అడ్డు చెప్పలేదు. మళ్లీ సివిల్స్‌కి ప్రయత్నిద్దామనుకుంటే వయసు అర్హత కోల్పోయాడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులైన గ్రూప్స్‌పై దృష్టి పెట్టాడు. పట్టు వదలకుండా ప్రయత్నించి గ్రూప్‌-2లో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా కొలువు సాధించాడు. అదే సమయంలో 2016 గ్రూప్‌-1 టాపర్‌ నిశాంత్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆయన సలహాలు తోడయ్యాయి. మరుసటి ఏడాది గ్రూప్‌-1లో 47 ర్యాంకుతో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కానీ తన లక్ష్యం గ్రూప్‌ వన్‌లో టాప్‌ సర్వీసులైన డిప్యూటీ కలెక్టర్‌ లేదా డీఎస్పీ. లేబర్‌ ఆఫీసర్‌గా కొనసాగుతూ మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి గురి తప్పలేదు. తాజా ఫలితాల్లో నాలుగో ర్యాంకుతో డిప్యూటీ కలెక్టర్‌ కొలువుకు ఎంపికయ్యాడు.

సరదాలు వదిలి

యువతకి చాలా సరదాలుంటాయి. స్నేహితులతో పార్టీలు చేసుకోవడం.. టూర్లకు వెళ్లడం.. సినిమాలు చూడటం.. కానీ రోజుకి పదిగంటలు ప్రిపేరైన ప్రవీణ్‌ ఏళ్లపాటు వీటన్నింటికీ దూరంగా ఉన్నాడు. పైగా ఉద్యోగం చేస్తూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. సాధన చేయడం అంటే మాటలు కాదు. అయినా ప్రవీణ్‌ దృష్టిలో అవన్నీ తాత్కాలిక ఆనందాలు. ‘సరదాలకు దూరంగా ఉన్నానని నేనెప్పుడూ బాధ పడలేదు. కుటుంబం గర్వపడేలా, అందరూ మెచ్చుకునేలా మంచి ఉద్యోగం సాధించినప్పుడు వచ్చే ఆనందమే శాశ్వతం. పైగా మనం చేసే ఉద్యోగం పదిమందికి ఉపయోగపడేదైతే.. ఆ సంతోషమే వేరు. అయితే స్నేహితులతో ఎక్కువ సమయం గడపలేకపోయాననే చిన్న అసంతృప్తి మాత్రం ఉంది’ అంటున్నాడు ప్రవీణ్‌. ఇంతేకాదు.. తను ప్రయత్నం మొదలు పెడతా అన్నప్పుడు చాలామంది వెనక్కి లాగారు. ‘హాయిగా ఏసీలో కూర్చొని చేసే ఉద్యోగం వదిలి, రిస్క్‌ చేయడం ఎందుకు? లక్షల మందితో పోటీ పడాలి’ అన్నారు. కానీ తనెప్పుడూ అలాంటి మాటల్ని పట్టించుకోలేదు. ‘మొదట్లో ఇలాగే సలహా ఇచ్చాడో స్నేహితుడు. వరుస వైఫల్యాలు ఎదురైన ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా ప్రయత్నం చేస్తుండటంతో ముచ్చట పడి.. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సాయం కూడా చేశాడు’ అంటున్నాడు ప్రవీణ్‌. ఏదేమైనా.. నిరాశను దరి చేరనీయకుండా.. లోపాల్ని సవరించు కుంటూ.. కష్టపడుతూ ముందుకెళ్తే విజయం సాధించి తీరవచ్చని నిరూపించాడు ప్రవీణ్‌.

  • విఫలమైన ప్రతిసారీ నాలోని లోపాలన్నీ ఓ కాగితంపై రాసుకున్నా. విజేతలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నా. సాధన ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ ఆత్మస్థైర్యం కోల్పోలేదు.  
  • ఐటీ ఉద్యోగిగా మంచి జీతం అందుకుంటున్నా.. నలుగురిలో ఒకడిగా గొప్ప స్థాయికి చేరుకోలేను. నాకున్న ఆసక్తికి సివిల్స్‌, గ్రూప్స్‌ కొట్టడమే
  • సరైనదని ఈ లక్ష్యం ఎంచుకున్నా.
  • అమ్మానాన్నలు చెప్పారనో.. మరెవరో సాధించారనో ఏదో ఒక ప్రయత్నం చేయొద్దు. ఇష్టమైన రంగం, కెరియర్‌ ఎంచుకుంటేనే రాణిస్తారు.
  • నాణ్యమైన విద్య అందినవాళ్లే మంచి ఉద్యోగాలు, అవకాశాలు చేజిక్కించుకుంటారు. దురదృష్టవశాత్తు పేదలకు అది అందడం లేదు. నా పరిధిలో ముందు దానిపైనే పని చేస్తా.

షేక్‌ మహమ్మద్‌ ఆరీఫ్‌, జమ్మలమడుగు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని