‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!

కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్‌ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు.

Published : 06 May 2024 08:10 IST

ఇంజినీర్లు, నిర్మాణదారుల వివరణ కోరే అవకాశం
నేటి నుంచి జ్యుడిషియల్‌ కమిషన్‌ పర్యటన.. రేపు మేడిగడ్డకు

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్‌ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. సోమవారం నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ రెండో దఫా విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఏడో తేదీన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండలంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. దీని పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. వాతావరణ పరిస్థితులను బట్టి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా సందర్శించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అదేరోజు రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ వసతిగృహంలో బస చేసి.. మరుసటి రోజు హైదరాబాద్‌ చేరుకుంటారు. తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని కాళేశ్వరం విచారణ కమిషన్‌ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు. 10, 11 తేదీలకు సంబంధించిన షెడ్యూలు ఖరారు కాలేదు. ఈ దఫా పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. బ్యారేజీల వైఫల్యాలకు సంబంధించి ఇంజినీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఆ మూడు ఆదేశాలకు సమాధానాలపైనా: మొదటి దఫా విచారణ సందర్భంగా ప్రభుత్వానికి కమిషన్‌ మూడు ఆదేశాలు జారీ చేసింది. 2015లో ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీకి సంబంధించిన నివేదిక సమర్పించాలని కోరింది. ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌ల నుంచి సమాచారం తెప్పించాలనీ ఆదేశించింది. ఆరుగురు సభ్యుల కమిటీ నివేదికకు సంబంధించి ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీ నివేదిక, చర్యలకు సంబంధించి వివరణ పంపాలని రామగుండం సీఈకి నీటిపారుదల శాఖ లేఖ రాసినట్లు తెలిసింది. బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్డీఎస్‌ఏకు ప్రభుత్వం లేఖ రాయగా.. ఇంకా ప్రత్యుత్తరం అందలేదని సమాచారం. అలాగే, విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలను అప్పగించాలంటూ విజిలెన్స్‌కు నీటిపారుదల శాఖ లేఖ రాసినప్పటికీ సమాధానం అందలేదని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని