కష్టాలపై హైజంప్‌!

చిన్నప్పుడే అథ్లెటిక్స్‌పై మనసు పారేసుకున్నాడు... పేదరికం వెనక్కి లాగింది! జిల్లాస్థాయిలో రాణించడం మొదలు పెట్టాడు... నాన్న మరణం కుంగదీసింది!

Updated : 23 Sep 2023 06:27 IST

చిన్నప్పుడే అథ్లెటిక్స్‌పై మనసు పారేసుకున్నాడు... పేదరికం వెనక్కి లాగింది! జిల్లాస్థాయిలో రాణించడం మొదలు పెట్టాడు... నాన్న మరణం కుంగదీసింది! రాష్ట్రస్థాయికి ఎదిగాడు... అక్కల పెళ్లి బాధ్యత మీద పడింది! అడుగడుగునా కష్టాలే ఎదురైనా.. వాటిపై ఒడుపుగా లంఘిస్తూ.. పతకాల పంట పండిస్తున్నాడు మొహిద్దీన్‌.

షేక్‌ మొహిద్దీన్‌ది గుంటూరు జిల్లా రేటూరు. కనీసం బూట్లు కొనుక్కో లేనంత పేదరికం. వెళ్లే ప్రతి పోటీకి ఖర్చుల కోసం వెతుక్కునేంత దైన్యం. అయినా ఏనాడూ ఇక్కట్లు తలచుకొని ఆగిపోలేదు. ముగ్గురు సంతానంలో తనే చిన్నవాడు. చిన్నప్పట్నుంచీ క్రీడలంటే ఆసక్తి. అదే అతడ్ని అథ్లెటిక్స్‌ వైపు చూసేలా చేసింది. ‘నీకు హైజంప్‌ సరిగ్గా సరిపోతుంద’ని ఒకరిచ్చిన సలహాతో సాధన మొదలు పెట్టాడు. తనకు తానే.. గురువుగా మారాడు. సొంతంగా సాధన చేస్తూ.. పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటుండగా.. నాన్నకు కిడ్నీల సమస్య మొదలైంది. మూడేళ్లపాటు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించినా ఫలితం లేక ఆయన చనిపోయారు. తండ్రి మరణం మొహిద్దీన్‌ని బాగా కుంగదీసింది. అయినా మంచి స్థాయికి చేరుకుంటే.. పైనున్న నాన్న సంతోషిస్తారని భావించాడు. యూట్యూబ్‌లో చూస్తూ.. మళ్లీ సాధన మొదలు పెట్టాడు. కొన్ని పోటీల్లో గెలవడంతో కోయంబత్తూరులో జరిగే అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపికయ్యాడు. కానీ స్పైక్‌ బూట్లు లేకపోవడంతో నిర్వాహకులు పోటీలో పాల్గొనడానికి నిరాకరించారు. తర్వాత దాతల సాయంతో ఆ బూట్లు కొనుక్కోగలిగాడు.

మేలి మలుపు

మెరుగైన శిక్షణ కోసం మొహిద్దీన్‌ 2018లో హైదరాబాద్‌ వెళ్లాడు. సీనియర్‌ అథ్లెట్‌ దాము రతినమ్‌ పర్యవేక్షణలో గచ్చిబౌలి స్టేడియంలో ఏడాది సాధన చేశాడు. ఆయన పర్యవేక్షణలో 1.95మీ.ల ఎత్తు దూకగలిగాడు. పలు పతకాలు సొంతం అవుతున్న తరుణంలో కొవిడ్‌తో అతడి విజయాలకు అడ్డుకట్ట పడింది. మళ్లీ ఊరెళ్లి పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈలోపు అక్కల పెళ్లిళ్ల బాధ్యత మీద పడటం, అమ్మ అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందుల పాలు చేసింది. అయినా కుంగిపోకుండా పోటీల్లో పాల్గొనేవాడు. గతేడాది చెన్నైలో జరిగిన అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో అయిదో స్థానంలో నిలిచి, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల లఖ్‌నవూలో జరిగిన ఈ పోటీల్లో 2.06మీ.ల ఎత్తు దూకి జాతీయస్థాయిలో కాంస్య పతకాన్ని గెలిచాడు. అంతకుముందు ఝార్ఖండ్‌లో నిర్వహించిన ఫెడరేషన్‌ కప్‌ సీనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 17 పసిడి, మూడు రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. 2.24మీటర్ల ఎత్తు దూకి భారత జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు మొహిద్దీన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని