అరుదైన కళ.. అంతా మెచ్చేలా!

బొమ్మలేయడం చాలామంది చేస్తారు... ఈ యువతరంగాలిద్దరిదీ భిన్నమైన శైలి... ఒకరు సూర్యరశ్మితో చెక్కపై చిత్రాలు చెక్కుతుంటే.. మరొకరు వ్యర్థాలతో అర్థవంతమైన ప్రతిమల్ని మలుస్తున్నారు. ఈ అరుదైన ప్రతిభని పలు అవార్డులు వరించాయి.

Updated : 21 Oct 2023 03:35 IST

బొమ్మలేయడం చాలామంది చేస్తారు... ఈ యువతరంగాలిద్దరిదీ భిన్నమైన శైలి... ఒకరు సూర్యరశ్మితో చెక్కపై చిత్రాలు చెక్కుతుంటే.. మరొకరు వ్యర్థాలతో అర్థవంతమైన ప్రతిమల్ని మలుస్తున్నారు. ఈ అరుదైన ప్రతిభని పలు అవార్డులు వరించాయి. ఆ సృజనాత్మక కళాకారుల  పరిచయం ఈవారం.

చేతిలో భూతద్దం పట్టుకొని.. ఓ ఐదునిమిషాలైనా ఎండలో నిల్చుంటేగానీ ఓ కాగితాన్ని మండించలేం. మరి చెక్క పలకల్నికాల్చాలంటే ఎంత సమయం పడుతుంది? అలా కాలుస్తూనే అందమైన చిత్రాలు రూపొందించాలంటే ఎంత ఓపిక, ఎంత సృజనాత్మకత ఉండాలి? ఆ అరుదైన ప్రతిభ ఉంది గనకే.. సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌ ఆర్ట్‌లో ఆసియాలోనే మొదటివాడయ్యాడు విఘ్నేష్‌.

సూర్యరశ్మి కుంచెగా..

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లమో పూర్తి చేసిన విఘ్నేష్‌ చెన్నైలో చిన్నాచితకా పనులు చేస్తుండేవాడు. చదువుకు తగ్గ ఉద్యోగం చేయట్లేదనే అసంతృప్తి అతన్ని వెంటాడేది. ఈ బాధకు తోడు తల్లి అకాల మరణం మరింత కుంగదీసింది. దీంతో సొంతూరికి తిరిగొచ్చి కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తుండేవాడు. కొన్నాళ్లకి తీవ్ర అనారోగ్యం పాలవడంతో.. రెండునెలలు మంచంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు చిత్రలేఖనంవైపు మళ్లాడు. మెళకువల కోసం అంతర్జాలంలో వెతుకుతున్న క్రమంలో అమెరికా కళాకారుడు మైఖేల్‌ పపాడాకిస్‌ గురించి తెలిసింది. భూతద్దాన్ని సూర్యకాంతిలో పెట్టి, నిప్పు పుట్టించి.. చెక్క పలకపై బొమ్మలు వేయడంలో అతడు దిట్ట. అతడి వీడియోలు చూసే.. సొంతంగా సాధన ప్రారంభించాడు. ‘గంటలకొద్దీ ఎండలో నిల్చోవడం.. తదేక దీక్షతో చూడటం.. మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ నేను అనుకున్న రూపం వస్తున్నకొద్దీ మరింత ఉత్సాహంగా పని చేయాలనిపించేది’ అంటూ తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటాడు విఘ్నేష్‌. ఇలా ఏళ్లకొద్దీ సాధన చేసి ఈ సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌ ఆర్ట్‌పై పట్టు సాధించాడు. వందలమంది ప్రముఖులు, సినిమా తారలు, క్రికెటర్లు చారిత్రక కట్టడాలు, చిత్రాలు చెక్కాడు. ఆసియాలోనే అరుదైన కళాకారుడిగా గుర్తింపు పొంది.. రికార్డు పుస్తకాల్లో స్థానంలో దక్కించుకున్నాడు. తిరుక్కురల్‌ని చెక్క పలకపై రాసి ఐన్‌స్టీన్‌ వరల్డ్‌ రికార్డు సాధించాడు.


నా కళాకృతి పూర్తిగా సహజ సూర్యకాంతితోనే రూపొందిస్తాను. కొంతమంది లేజర్‌ కిరణాలతో కలపను కాల్చి వుడ్‌ బర్నింగ్‌ ఆర్ట్‌ రూపొందిస్తున్నారు. అది కృత్రిమం. దేవుడు, సూర్యుడి మీదే నేను ఆధారపడతాను. ఈ కళకి కావాల్సింది ఓర్పు, అంకితభావం. దీంతో ఒక పెయింటింగ్‌ వేయాలంటే రెండు నుంచి మూడు రోజులు అవుతుంది. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువే. ఎండలో నిలబడాలి, వేడి భరించడం.. గంటలకొద్దీ చేయిని ఆడించడం.. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే ఎవరైనా సన్‌లైట్‌ ఆర్టిస్ట్‌ కావొచ్చు.


ఎగతాళి చేసినా..

ఈ ఆర్ట్‌ వేస్తున్న తొలిరోజుల్లో ‘ఇదేం పని?.. ఇదొక కళనా? దీనికి గుర్తింపు ఉంటుందా?’ అని కొందరు ఎగతాళిగా మాట్లాడారు. అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లేవాడు విఘ్నేష్‌. అతడి కళాకృతులను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆ చిత్రాలు వైరల్‌గా మారి పేరొచ్చింది. దాంతో తనూ సొంతంగా అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించారు. ఈ అరుదైన కళని నేర్పమంటూ చాలామంది వచ్చేవారు. పదేళ్లలో 60 మందికి సన్‌లైట్‌ వుడ్‌ బర్నింగ్‌ ఆర్ట్‌లో శిక్షణ ఇచ్చాడు. 200 మందికి చిత్రలేఖనం నేర్పించాడు.

బలభద్ర కీర్తి, చెన్నై


శ్రీకాకుళం జిల్లా పలాస కుర్రాడు అవినాశ్‌ సానాకి చిన్నప్పట్నుంచే బొమ్మలేయడం అంటే ఆసక్తి. బాగా సాధన చేసేవాడు. పేపర్‌, పెన్సిల్‌ చేతికందితే ఏ చిత్రమైనా అచ్చంగా దిగిపోవాల్సిందే. పోటీలకెళ్తే.. పతకాలతో తిరిగి రావాల్సిందే. ఇలా పదులకొద్దీ గెల్చుకున్న అవినాశ్‌ ఈసారి ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనుకున్నాడు. ఐస్‌క్రీమ్‌ పుల్లలతో జటాయు ఎర్త్‌సెంటర్‌ క్రాఫ్ట్‌ చేశాడు. అది రికార్డులు సృష్టించింది.

నలుగురిలో ఒకడిలా కాకుండా.. నలుగురికంటే భిన్నంగా ఉండాలన్నదే అవినాశ్‌ తపన. చిన్ననాటి ఇష్టంతో చిత్రలేఖనం సాధన చేశాడు. వాటిపై పట్టు సాధించాక.. పనికిరాని వస్తువులతో ప్రతిమలు రూపొందించడం ప్రారంభించాడు. ఎంబీఏ చదువుతూనే.. ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేసేవాడు. టూత్‌ పిక్స్‌, ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌, చాక్‌పీస్‌లే ముడిసరుకు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా, యూట్యూబ్‌లో చూసి సాధన చేసేవాడు. ఫొటో చూసి క్రాఫ్ట్స్‌ రూపొందించేవాడు. కొన్నాళ్ల కిందట కేరళ చడాయమంగళలోని ప్రముఖ రాతి కట్టడం జటాయూ ఎర్త్‌సెంటర్‌ ఫొటోలను గూగూల్‌లో చూశాడు. ఆ నమూనాను పెద్దఎత్తున తయారు చేయాలనుకున్నాడు. ఖరీదైన ఐస్‌క్రీమ్‌ స్టిక్స్‌ కొనుగోలు చేశాడు. 25 రోజుల పాటు శ్రమించి ఆ నమూనా తయారు చేశాడు. అంతకుముందుకు కేదార్‌నాథ్‌ ఆలయ నమూనానూ చేశాడు. వీటన్నింటినీ తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేస్తున్నాడు. ఈ అరుదైన ప్రతిభతో ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

సుమంత్‌ సకలాభక్తుల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని