మనసు గెలిచారు..

ఒక గొప్ప విజయంతో విజేతలు వెలుగులోకి రావచ్చు. ప్రపంచమంతా గుర్తించొచ్చు. కానీ ఆ స్థాయికి చేరడం వెనక ఎంతో కష్టం దాగుంటుంది. ఆ వెతల్ని దాటి విజయాల వెలుగులీనిన ఈ యేటి మేటి విజేతలు వీళ్లే.

Published : 30 Dec 2023 01:09 IST

ఒక గొప్ప విజయంతో విజేతలు వెలుగులోకి రావచ్చు. ప్రపంచమంతా గుర్తించొచ్చు. కానీ ఆ స్థాయికి చేరడం వెనక ఎంతో కష్టం దాగుంటుంది. ఆ వెతల్ని దాటి విజయాల వెలుగులీనిన ఈ యేటి మేటి విజేతలు వీళ్లే.


ఖేల్‌రత్నం సాయిసాత్విక్‌

 క్రీడాకారులకిచ్చే అత్యుత్తమ అవార్డు ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’కి ఎంపికయ్యాడు రంకిరెడ్డి సాయిసాత్విక్‌. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడానికి ముందు అతడి ఖాతాలో ఎన్నో మరపురాని విజయాలున్నాయి. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం, థామస్‌ కప్‌ స్వర్ణం, ఆసియన్‌ గేమ్స్‌ స్వర్ణం.. ఇలాంటివి. గంటకి 565కిలోమీటర్ల వేగంతో స్మాష్‌ కొట్టి గిన్నిస్‌ రికార్డూ సాధించాడీ అమలాపురం కుర్రాడు.


ఆస్కార్‌ ముత్యాలు రాహుల్‌, కాలభైరవ

సినీ ప్రపంచంలో శిఖరంగా భావించే పురస్కారం ఆస్కార్‌. ‘నాటు నాటు’ పాటతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు తెలుగు గడ్డ సొంతమైంది. ఈ పాటకి ఎం.ఎం.కీరవాణి బాణీలు సమకూర్చగా.. చంద్రబోస్‌ రాశారు. కుర్రకారుని ఉర్రూతలూగించేలా పాడింది రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు. ఆస్కార్‌ గెలవడంలో వారి పాత్ర కీలకం.


పేస్‌ దళపతి షమీ

శుభ్‌మన్‌ గిల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లి.. ఈ ఏడాది క్రికెట్‌లో మన మెరుపు వీరులు. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పారు. కానీ వీరిని మించి చెలరేగిన ఆటగాడు మహ్మద్‌ షమీ. ఈ ఏడాది కచ్చితంగా షమీదే. లేటు వయసులోనూ రాటుదేలిన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ముఖ్యంగా ఈ వరల్డ్‌కప్‌లో తన మీడియం పేస్‌తో సెమీస్‌లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.


నటనా సౌందర్యం కియారా

తెరంగేట్రం చేసింది మొదలు అందం, నటనతో కుర్రకారుని మాయ చేస్తూనే ఉంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ. ఈ ఏడాది ఇండియాలో గూగుల్‌లో అత్యధికంగా గాలించిన సెలెబ్రిటీ తనే. తన సినిమాలు.. ప్రేమ ముచ్చట్లు..పెళ్లి సంగతి.. ఏదైతేనేం.. యువత తన గురించి బాగా వెతికారు. అదేసమయంలో తను గ్లోబల్‌ ట్రెండింగ్‌ పీపుల్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించుకుంది కియారా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు