ఉన్నది ఉన్నట్టు.. అందం నచ్చేట్టు!

తెర ముందు, వెనకా.. పార్టీలో, ఫంక్షన్‌లో.. సమయం, సందర్భం ఏదైనా సింగారించుకున్న తర్వాతే బయటికొస్తారు తారలు. పప్పీతో కలిసి దిగిన ఫొటో ఇన్‌స్టాలో పెట్టినా..

Updated : 06 Dec 2021 17:37 IST

తెర ముందు, వెనకా.. పార్టీలో, ఫంక్షన్‌లో.. సమయం, సందర్భం ఏదైనా సింగారించుకున్న తర్వాతే బయటికొస్తారు తారలు. పప్పీతో కలిసి దిగిన ఫొటో ఇన్‌స్టాలో పెట్టినా.. చిత్రం జోడించి వదిలే ట్వీట్‌ అయినా గ్లామర్‌ డోసు పడాల్సిందే. వాళ్లున్న తళుకుల ప్రపంచంలో ఆమాత్రం తప్పదు మరి! అలాంటిది ఈ మధ్యకాలంలో సెలెబ్రెటీలు ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. మేకప్‌లతో వయసు కవర్‌ చేయాలనుకోవడం లేదు. సాదాసీదా దుస్తులు, ముడుతలు పడిన చర్మం, నెరిసిన జుత్తు.. ఏదైనా నిర్భయంగా ప్రదర్శిస్తున్నారు. సీనియర్లు ఏ సమీరారెడ్డినో, కరిష్మా కపూర్‌నో కాదు.. మాంచి ఫామ్‌లో ఉన్న దీపికా పదుకొనే, పడుచందాల దిశా పటానీలది సైతం ఇదే బాట. మన అనుష్క, రష్మిక, రాశీఖన్నా, తమన్నా, రకుల్‌లు సైతం ఈ ట్రెండ్‌కి ఎప్పుడో ఓకే చెప్పేశారు.

కాజల్‌ అగర్వాల్‌ అయితే ఓ డీ గ్లామర్‌ ఫొటోకి ‘మన సంతోషాన్ని బాహ్య సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యం నిర్ధారిస్తుంది’ అని ఓ క్యాప్షన్‌ కూడా జోడించింది. వీళ్లతో పోలిస్తే యామీ గౌతమ్‌ ఇంకో అడుగు ముందుకు వేసిందనే చెప్పొచ్చు. తన చర్మంపై ఉన్న కురుపుల్లాంటివి చూపిస్తూ ‘కెరాటోసిస్‌-పిలారిస్‌’ అనే చర్మ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నానని ఓపెన్‌గానే చెప్పేసింది. కృత్రిమ అద్దకాలు లేకుండా ఏ కెమెరా కంట్లో అయినా పడతామేమోనని భయపడ్డ సెలెబ్రెటీలు ఇలా మేకప్‌ తీసి మరీ ఆన్‌లైన్‌కెక్కడం ఏంటీ విడ్డూరం? అని ఆశ్చర్యపోయేవాళ్లు చాలామందే. ఈ తీరుకి అభిమానులు ముందు నివ్వెరపోయినా.. తేరుకొని ‘గ్రేట్‌’, ‘ఆసమ్‌’, ‘నేచురల్‌ బ్యూటీ’, ‘ఫాబ్యులస్‌’ అంటూ పొగుడుతూనే ఉన్నారు. మీమ్స్‌ జత చేస్తున్నారు. ‘మంచి మనసే అసలైన అందం’ అని కామెంటేస్తున్న ఫాలోయర్లూ తక్కువేం కాదు. అందుకే నో మేకప్‌ ట్రెండ్‌ జోరందుకుంటోంది.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని