సాఫ్ట్‌వేర్‌ ప్రేమ.. సాధిస్తా మావా!

ఆమధ్య నాలుగురోడ్ల కూడలిలో సంధ్యా సమయాన నిన్ను చూసినప్పట్నుంచి.. నా మనసు అయస్కాంతంలా నీవైపే లాగుతోంది. అడపాదడపా నావైపు చూపులు విసురుతూ నాలో ప్రేమకు ఆయువు పోశావు. నువ్వు లేక నేను లేను అని ఫీలై..

Updated : 01 Oct 2022 13:01 IST

అనకాపల్లి అనితకి...

ఆమధ్య నాలుగురోడ్ల కూడలిలో సంధ్యా సమయాన నిన్ను చూసినప్పట్నుంచి.. నా మనసు అయస్కాంతంలా నీవైపే లాగుతోంది. అడపాదడపా నావైపు చూపులు విసురుతూ నాలో ప్రేమకు ఆయువు పోశావు. నువ్వు లేక నేను లేను అని ఫీలై.. నిన్నెలా ఒప్పించాలని కనుక్కుంటే.. ఐటీ జాబ్‌ అయితేనే నీకు సమ్మతమని తెలిశాక సొమ్మసిల్లినంత పనైంది. హార్డ్‌వేర్‌ మరమ్మతులు చేసుకునే నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడమెలా? అని బెంగ పట్టుకుంది. సలహా కోసం బావ దగ్గరికి వెళ్తే జావా నేర్చుకొమ్మన్నాడు. ఒరాకిల్‌తో మిరకిల్‌ చేయమని ఫ్రెండ్‌ సలహా ఇచ్చాడు. గ్రామర్‌ రాకపోయినా నీకోసం అర్జెంటుగా ప్రోగ్రామర్‌ అయిపోవాలని అప్పుడే అనుకున్నా. నా ప్రేమ సొల్యూషన్‌ కోసం పొల్యూషన్‌ని సైతం లెక్క చేయకుండా ఊరు బయట ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో చేరిపోయా. చదువుకునేటప్పుడు బుక్కే చూడని నేను రోజూ ఫేస్‌బుక్‌ తెరిచి స్నేహితుల నుంచి జాబ్‌ వివరాలు ఆరా తీస్తున్నా. ఎలాగోలా జీవితం నెట్టుకొచ్చే నేను.. ఉద్యోగ దరఖాస్తు కోసం రోజూ నెట్‌లో వెతుకుతున్నా. షాపింగ్‌ ఆఫర్లు తప్ప మరేం తెలియని నేను ఆఫర్‌ లెటర్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా. అన్నీ కుదిరి కొలువు దక్కగానే నీముందు వాలిపోతా. నా ప్రేమ, పెళ్లికి ఆమోదం తెలుపుతూ లవ్‌లెటర్‌తో సిద్ధంగా ఉండు.

- టేకి మురళీకృష్ణ, శ్రీకాకుళం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని