చిత్రం.. మారుతోంది

ఫొటోలంటే.. ఒకప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో దాచుకున్న నెమలీకల్లా అపురూపంగా ఉండేవి. అమ్మ చేతితో స్వయంగా వడ్డించిన ఆవకాయలా కమ్మని భావోద్వేగాలు పంచేవి. బీరువాలోని ఆల్బమ్‌లో.. గోడపై ఫ్రేమ్‌ రూపంలో.. కంప్యూటర్‌ డీవీడీల్లో దాచుకున్న ఆ ఛాయాచిత్రాలను ఓసారి చూడగానే జ్ఞాపకాల దొంతరలు ప్రతి మనసునీ మురిపించేవి.

Published : 24 Jun 2023 00:26 IST

ఫొటోలంటే.. ఒకప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో దాచుకున్న నెమలీకల్లా అపురూపంగా ఉండేవి. అమ్మ చేతితో స్వయంగా వడ్డించిన ఆవకాయలా కమ్మని భావోద్వేగాలు పంచేవి. బీరువాలోని ఆల్బమ్‌లో.. గోడపై ఫ్రేమ్‌ రూపంలో.. కంప్యూటర్‌ డీవీడీల్లో దాచుకున్న ఆ ఛాయాచిత్రాలను ఓసారి చూడగానే జ్ఞాపకాల దొంతరలు ప్రతి మనసునీ మురిపించేవి. వాటిని ముందు వేసుకోగానే.. అప్రయత్నంగా పెదాలు విచ్చుకునేవి. మొహంలో ఓ మెరుపు కనపడేది. సంతోషంతో గుండె నిండిపోయేది. ఫొటో తీయడం అంటే అప్పుడొక పెద్ద టాస్క్‌. మేనికి మెరుపలద్దడం.. చక్కగా ముస్తాబవడం.. సంతోషంగా కెమెరా ముందు నిల్చొవడం.. కెమెరా ఫ్లాష్‌ని మించి నవ్వుల మెరుపులు చిందించడం.. ఎంత కథో! ఈతరం, పాతతరం ఒక్కచోటికి చేరి.. రెడీ.. వన్‌.. టూ.. త్రీ.. అంటూ క్లిక్‌మనిపిస్తుంటే అదొక వేడుకలాగే ఉండేది. ఆ ఛాయాచిత్రాల్ని ఒడిసిపట్టే ఫొటోగ్రాఫర్‌ మనకంటికి ఓ హీరోలాగే కనిపించేవాడు.

మరి ఇప్పుడో...

చేతిలో సెల్‌ఫోన్‌ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లలాగే పోజు కొడుతున్నారు. ఎడాపెడా, ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు క్లిక్‌క్లిక్‌మనిపిస్తూ.. ఆ చిత్రాల్ని ఫేస్‌బుక్‌ గోడలపై.. ఇన్‌స్టా వేదికల్లో.. ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. వ్యక్తిగతంగా మధుర జ్ఞాపకాల్లా ఉండాల్సిన ఫొటోలు కాస్తా.. జనానికి ఫ్రీ షోలుగా మారిపోతున్నాయి. కెమెరా ఫోన్ల రాకతో ఈ ధోరణి ఎక్కువైంది. గుండె లోతుల్లోని భావాల్ని వెలికి తీసి కళ్లలో మెరుపులు పూయించే ఫొటోలు.. సెల్‌ఫోన్‌లో, కంప్యూటర్‌లో నిండిపోయి రీసైకిల్‌బిన్‌ల పాలవుతున్నాయి. ఒక్కోసారి శ్రుతి మించిన ఈ క్లిక్‌క్లిక్‌లు లేనిపోని చిక్కులకూ కారణం అవుతున్నాయి. ఏదేమైనా.. ఫొటోని పొదుపుగా తీసినప్పుడే.. అపురూపంగా భావించినప్పుడే.. అదొక తీపి జ్ఞాపకంగా మారుతుంది.

ఒక్కరోజుకే బోర్‌

అల్మారాలో.. ఆల్బమ్స్‌లో.. డీవీడీల్లో దాచుకున్న నా పాత ఫొటో.. ఏది చూసినా ఇప్పుడు ఎంతో అబ్బురంగా అనిపిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. కానీ అదేంటో వందల పిక్సెల్‌ సెల్‌ఫోన్‌తో కెమెరాతో రోజుకి డజన్లకొద్దీ పిక్స్‌ తీసుకున్నా ఆ ఫీలింగ్‌ రావడం లేదు. నిన్న తీసినవే ఈ రోజుకి బోర్‌ కొడుతున్నాయి. అన్నీ అరచేతిలోకి వచ్చి పడటంతోనే ఫొటో అంటే ఈ తేలిక భావం ఏర్పడిందేమో!

శ్రేయా, బీటెక్‌ మూడో సంవత్సరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని