నేను పడిపోయినా.. పడేస్తాను..!

ఆరోజు ఇంకా గుర్తుంది. కదల్లేక కదల్లేక కదులుతున్న సిటీ బస్సులో ముందు సీటు కోసం కొందరు మగువలు తగువులాడుతున్న వేళ. మెట్రోరైలులా వేగంగా వచ్చి నా పక్కన కూర్చున్నావు

Updated : 13 Jan 2024 04:01 IST

ఆరోజు ఇంకా గుర్తుంది. కదల్లేక కదల్లేక కదులుతున్న సిటీ బస్సులో ముందు సీటు కోసం కొందరు మగువలు తగువులాడుతున్న వేళ. మెట్రోరైలులా వేగంగా వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడే షోరూం నుంచి బయటికొచ్చిన కొత్త కారులా తళతళా మెరిసిపోతున్న నిన్ను చూసి నా మనసు ఎంతో మురిసిపోయింది. అలా మాట కలిపానో లేదో.. రైలు ఇంజిన్‌లా నీపై మెల్లగా ప్రేమ మొదలై, ఫైర్‌ ఇంజిన్‌ నీళ్లలా ఎగిసింది. ఆ ఆత్రుత ఆపుకోలేక అక్కడే ఐలవ్యూ చెప్పేశాను. ‘నాది... ఇంకా ప్లాట్‌ఫాంపైకి రాని రైలులాంటి జీవితం.. నీది గమ్యం చేరబోతున్న వైనం.. నీకూ నాకూ సెట్‌ కాదు.. క్యాబ్‌ బుక్‌ చేసిన కస్టమర్‌లా నాకోసం ఎదురు చూడకు’ అని చిరాకు పడ్డావు. ఆఖరి సర్వీసు కోసం ఎదురుచూసే ప్రయాణికుడిలా నీకోసం ఎంతకాలమైనా ఆగుతానని చెప్పి కన్విన్స్‌ చేయాలనుకున్నాను. నువ్వు మరింత కోపంతో ‘ఎర్రబస్సులో తిరిగే స్థాయి నీదైతే.. ఏరోప్లేన్‌లో తిరగాలనుకునే ఆశ నాద’ంటూ నన్ను అడియాశపాలు చేశావు. అయినా నాలో కోరిక చావక నిన్ను ఫాలో అవుతుంటే.. లారీతో ఎక్కించి.. జేసీబీతో తొక్కించి కొరియర్‌లో మీవాళ్లకు పార్సిల్‌ పంపిస్తానని నిర్దాక్షిణ్యంగా మాట్లాడావు. నువ్వు నా ప్రేమకు ఒప్పుకొని ‘బండెక్కి వస్తావో.. బస్సెక్కి వస్తావో..’ అంటూ పాడుతూ నీ స్కూటీ ఎక్కనిస్తావని కలలు కంటే అన్నింటినీ కల్లలు చేశావు. అయినా పౌరుషం టాప్‌గేర్‌లో పొడుచుకొచ్చిన నాకు.. నీతో ఐలవ్యూ చెప్పించుకోకపోతే.. నేనెంతో ఇష్టపడే ఏ వాహనం లైసెన్సూ తీసుకోనని శపథం చేశాను. టూవీలర్‌ నడపలేక ఎన్నోసార్లు పడిపోయిన నేను.. ఇప్పుడు నిన్ను పడేసే పనిలో నిమగ్నమై ఉన్నాను.

- బి.సృజని, వెంకటాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని