జీవితం గుణపాఠమై.. తనే పాఠమై..

కాలం కొందరిని ఓడిస్తుంది. కష్టం ఇంకొందరిని నలిపేస్తుంది. ప్రమాదం మరికొందరిని చంపేస్తుంది. ఈ మూడు చుట్టుముట్టినా ఓ కుర్రాడ్ని ఏం చేయలేకపోయాయి. అతని ధైర్యం ముందు కాలం వెనుకడగువేసింది. అతని స్ఫూర్తికి కష్టం తలవంచింది.

Updated : 09 Dec 2022 12:38 IST

భ‌ద్రం నేస్తమా

కాలం కొందరిని ఓడిస్తుంది. కష్టం ఇంకొందరిని నలిపేస్తుంది. ప్రమాదం మరికొందరిని చంపేస్తుంది. ఈ మూడు చుట్టుముట్టినా ఓ కుర్రాడ్ని ఏం చేయలేకపోయాయి. అతని ధైర్యం ముందు కాలం వెనుకడగువేసింది. అతని స్ఫూర్తికి కష్టం తలవంచింది. అతని తెగువకు ప్రమాదమే ప్రమాదంలో పడింది. బతుకుతో పోరాడుతున్న ఆ యోధుడెవరు?ఎందరినో బతికించడానికి పరిగెడుతున్న ఆ యువకుడెవరు?

శివశంకర్‌... అందరిలాంటి కుర్రాడే... సొంతూరు కడప జిల్లా పోరుమామిళ్ల. తండ్రి వెంకటయ్య కడప 11వ బెటాలియన్‌లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌. తల్లి గృహిణి. అన్న కానిస్టేబులే. అప్పుడు ఇంటర్‌ మీడియట్‌ చదువుతుండేవాడు... 2010 ఆగస్టు 3వ తేదీ మధ్యాహ్నం... మరో ఇద్దరు మిత్రులతో కలిసి ద్విచక్రవాహనంపై సరదాగా వెళుతున్నారు. కడప రిమ్స్‌రోడ్డులో అండర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ప్రమాదం.. వెనుకవైపు నుంచి ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ముగ్గురూ కింద పడిపోయారు. మధ్యలో ఉన్న యువకుడి నడుముకు లారీ బంపర్‌ తగిలింది.. హాహాకారాలు.. అంతా అయోమయం.. అటుగా వెళుతున్న కొందరు గమనించి రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు..రెండు రోజులు చికిత్స జరిగింది.. ఆ యువకుడికి మాత్రం స్పృహరాలేదు..వైద్యులు చేతులెత్తేశారు. వెల్లూరు సీఎంసీకి హుటాహుటిన తీసుకెళ్లారు. గండం గడిచింది... నెలరోజుల తర్వాత కోలుకున్నాడు. పరిగెడుతున్న జీవితం ఆగిపోయింది. అతను నడిచే శక్తిని కోల్పోయాడు. వెన్నెముక విరిగిపోవడంతో నిల్చోవడం అటుంచి మంచంపై కూర్చోవడం కూడా కష్టమైంది. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవ్వాలని వైద్యులు తేల్చి చెప్పేశారు. అప్పటి వరకు ఉన్న మిత్రులు దూరమయ్యారు. అయినవాళ్లు దూరం పెట్టారు. అంతా చీకటి.. భవిష్యత్తును తలచుకుంటే అంతులేని భయం..

రెండేళ్ల పాటు నాలుగు గోడలే ప్రపంచం. నరకయాతన వెంటాడింది. ఆ యాతనలో నుంచే ఓ ఆశయం పుట్టింది. అది సంకల్పంగా మారింది. శరీరం సహకరించకున్నా పట్టుదల ప్రజ్వలించింది. తన పరిస్థితి వేరొకరికి రాకూడదనే ఆకాంక్ష. తన కుటుంబానికి వచ్చిన కష్టం మరే కుటుంబానికీ రాకూడదన్న తపన.. వెరసి జీవితం శివశంకర్‌ను కొత్తదారిలో నడిపించింది. తన జీవితాన్నే గుణపాఠంగా అందరికీ చెబుతూ యువతను ప్రమాదాలకు దూరంగా ఉండమని బోధిస్తున్నాడతను. ఆ ఆలోచన ఇప్పుడు అనేక మందిని అప్రమత్తం చేస్తుండగా, రోడ్డు భద్రతపై  ప్రభుత్వ సంకల్పానికి బాసటగా మారుతోంది. ఇప్పటికి పదివేల మందికి అవగాహన కల్పించిన ఆయన వెనుదిరగకుండా ముందుకెళుతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కల్పించాలన్న ఉత్సుకతతో చక్రాల కుర్చీనే ప్రచార రథంగా మార్చుకున్నాడు. చక్రాల కుర్చీలో ఉంటూనే రవాణా, పోలీసుశాఖల సహకారం కోరుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కడప జిల్లాలోనే చాలా వరకూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తన సందేశాన్ని అందించాడు. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపుతో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరులో సదస్సులు జరిపారు. ప్రకాశం, కర్నూలులోనే సదస్సులు జరిపేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు. ఆ సదస్సుల్లో శివశంకర్‌ తన జీవితాన్నే ప్రత్యక్ష ఉదాహరణగా చూపుతూ ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. తాను సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించి, తన తండ్రి కంటే ఓ ర్యాంకు ఎక్కువగా ఉండాలని కలలుగన్నాడు. అయితే రోడ్డుప్రమాదం తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసేయడంతో కలలు కల్లలయ్యాయి. అయితే తాను పోలీసు ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోయినా.. అదే పోలీసులతో కలసి రోడ్డుభద్రత కోసం పోరాడుతూ ప్రత్యేకత చాటుతున్నాడు. శివశంకర్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ ఏర్పాటు చేసి తన తండ్రి, అన్న జీతం సొమ్ములో కొంత సొసైటీ ద్వారా వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడమే తన ధ్యేయంగా చెబుతున్నాడు శివశంకర్‌. ‘ఈనాడు-ఈటీవీ’తో ఆయన మాట్లాడుతూ.. జీవితం చాలా విలువైనదన్నారు. వేగం వద్దని జీవితమే ముద్దని వివరిస్తున్నాడా కుర్రాడు.

- గాలి సురేష్‌, ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని