Manasulo Mata: పెళ్లి చూపుల ప్రేమకథ..

మెలికలు తిరిగిన తారురోడ్డు.. రోడ్డుకిరువైపులా కళ్లకింపుగా పచ్చని పంట పొలాలు. బస్సు వేగంగా వెళ్తోంది. అంతకన్నా వేగంగా జ్ఞాపకాలు నన్ను రెండేళ్లు వెనక్కి లాక్కెళ్లాయి.

Updated : 10 Jun 2023 08:30 IST

మెలికలు తిరిగిన తారురోడ్డు.. రోడ్డుకిరువైపులా కళ్లకింపుగా పచ్చని పంట పొలాలు. బస్సు వేగంగా వెళ్తోంది. అంతకన్నా వేగంగా జ్ఞాపకాలు నన్ను రెండేళ్లు వెనక్కి లాక్కెళ్లాయి.

మొదటిసారి పెళ్లిచూపుల కోసం ఆ ఊరొచ్చా. అమ్మాయి పేరు జ్యోతి. మేం వెళ్లిన కాసేపటికే.. చిలకపచ్చ రంగు పరికిణీ, ఎరుపు రంగు ఓణీ వేసుకొని.. పొడవాటి జడతో వచ్చింది. టీకప్పు చేతికందిస్తూ.. నావైపు చూసింది. మా చూపులు కలుసుకున్నాయి. పెదాలు విచ్చుకున్నాయి. చామనఛాయగా ఉన్నా.. తన మొహం కళగా ఉంది. కొన్ని రొటీన్‌ ప్రశ్నలు, సందేహాలయ్యాక ఒకరికొకరం నచ్చేశాం అని చెప్పేసుకున్నాం. ఇక పెద్దవాళ్లు అసలు విషయానికొచ్చేశారు. ‘మాకిద్దరూ ఆడపిల్లలే. ఇప్పుడు కొంత కట్నం ఇస్తాం. తర్వాత మాకున్న ఆస్తిలో సగం ఇస్తాం’ అన్నారు జ్యోతి నాన్న. మావాళ్లకి అదేం నచ్చలేదు. కట్నం మరీ తక్కువనిపించింది. ‘ఇది కుదిరేలా లేదు వెళ్లిపోదాం పదా’ అన్నారు వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తి. నాకు చిరాకేసింది. ఏదో పెద్ద తప్పు చేసిన వాడిలా ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు.

నాన్నది చిట్‌ఫండ్‌ వ్యాపారం. డబ్బులకు కొదవ లేదు. పెద్దింటి సంబంధం చేసుకుంటే.. నా లైఫ్‌కి ఢోకా ఉండదని ఆయన ఆశ. మూడేళ్ల కిందటే నా బీటెక్‌ పూర్తైంది. సిటీలో అక్క వాళ్లింట్లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకుంటున్నా. అప్పుడప్పుడూ ప్రయత్నిస్తున్నా ఏ ఉద్యోగమూ వర్కవుట్‌ కావడం లేదు. ఒకరోజు స్నేహితుడి రూంకి వెళ్లి వస్తుంటే.. ఎస్సార్‌నగర్‌లో కనిపించింది జ్యోతి. నా కళ్లను నేనే నమ్మలేకపోయా. బైక్‌ పక్కన ఆపి పలకరించా. కొరకొరా చూసింది. ‘నా గురించి మీకెందుకు? మేం చిన్నవాళ్లం. మీ పక్కన నిల్చునే స్థాయి కాదు. అయినా మనం మళ్లీ మాట్లాడుకోవడం బాగుండదు. ఇంకోసారి ఆ ప్రయత్నం చేయొద్దు ప్లీజ్‌’ అంటూ ఆ పక్కనే ఉన్న ఓ ఐటీ కోచింగ్‌ సెంటర్‌లోకి గబగబా వెళ్లిపోయింది. రెండ్రోజులు కాపు కాస్తే మరోసారి కనిపించింది. అతి కష్టమ్మీద మాట కలిపా. జరిగినదానికి సారీ చెప్పా.

మెల్లగా మా పరిచయం స్నేహం దాకా వచ్చింది. ‘నీతో గంటలకొద్దీ చాట్‌ చేయను.. ఫోన్‌ మాట్లాడను. పార్కులు, సినిమాలకు రాను. షేక్‌హ్యాండ్‌లు, టచ్‌లూ నాకు నచ్చవు. వీటన్నింటికీ ఓకే అంటేనే స్నేహం.. లేదంటే బై’ అంది మొదట్లోనే. అలా అనగానే తన తీరు మరింత నచ్చింది. పైగా పదేపదే కుటుంబంపై తనకున్న ఇష్టం చెబుతుంటే.. ముచ్చటేసింది. అంత మంచి అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు అనుకున్నా.

ఆరోజు క్లాసులో ఉండగా అర్జెంటుగా ఊరు రమ్మని అమ్మ ఫోన్‌ చేసింది. వెంటనే బయల్దేరా. ఇంట్లోకెళ్లగానే నన్ను పట్టుకొని బోరుమని ఏడ్చింది. నాన్న భాగస్వామి ఊరంతా అప్పులు చేసి.. పారిపోయాడట. అతడి అప్పుల్లో కొన్నింటికి నాన్నే పూచీకత్తుగా ఉన్నారు. ‘ఇంత మోసం చేస్తాడనుకోలేదురా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నాన్న. కేసులు, కోర్టులు, అప్పులు తీర్చడం.. వీటికి మా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అదే బెంగతో నాన్న ఆరోగ్యం పాడైంది. జరిగిందంతా విని జ్యోతి చాలా బాధ పడింది. మళ్లీ మంచి రోజులొస్తాయి, గుండెనిబ్బరంతో ఉండమని ధైర్యం చెప్పింది.

నా కోర్సు పూర్తైంది. ఊరొచ్చి మా వ్యాపార పనులు చూసుకొమ్మంది అమ్మ. బంధువుల అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుందామంది. మనసంతా జ్యోతినే ఉంటే.. నేను వేరొకర్ని ఎలా చేసుకోను? జ్యోతికి చెప్పా. ‘నాన్నతో చెప్పి ఈసారి కట్నం ఎక్కువే ఇప్పిస్తాలే.. నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా...’ అంది. నాకు షాక్‌. ఈ మాట తననుంచి అస్సలు ఊహించలేదు. దేవతే వరమిస్తానంటే.. ఎవరైనా కాదంటారా? కన్నవాళ్లని ఒప్పించి పైసా కట్నం తీసుకోకుండా జ్యోతిని నాదాన్ని చేసుకున్నా. తన రాకతో మా ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమ్మానాన్నల్ని చాలా బాగా చూసుకునేది. మా పెళ్లయ్యాక కొద్దిరోజులకు తనో సస్పెన్స్‌ న్యూస్‌ బయట పెట్టింది. అదేంటంటే.. తను అప్పటికే మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగానికి ఎంపికైందట. వర్క్‌ ఫ్రం హోం చేసేది. కొన్నాళ్లయ్యాక సిటీకొచ్చి కాపురం పెట్టాం. జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. ఓ ‘ఏడాదికి మనం అమ్మానాన్నలం కాబోతున్నాం’ అనే శుభవార్త చెప్పింది. అప్పటికీ నా ఉద్యోగ ప్రయత్నాల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ మేలో తను మెటర్నిటీ సెలవు పెట్టి పుట్టింటికి వెళ్లింది. జులైలో మాకో బుల్లి పాపో, బాబో రాబోతున్నారు.

ఇక వర్తమానంలోకి వస్తే.. తొలిసారి తనని చూడటానికి వెళ్లిన దారిలోనే ఇప్పుడు వెళ్తున్నా. అప్పుడు కారు.. ఇప్పుడు బస్సు. వెళ్లగానే తనని అమాంతం నా కౌగిట్లో బంధించాలి. ప్రేమగా ముద్దాడాలి. అన్నట్టు నా బ్యాగులో ఉన్న ఒక లెటర్‌ తీసి తన చేతిలో పెట్టాలి. అదేంటంటే.. ఎట్టకేలకు నేనూ ఓ జాబ్‌ కొట్టా. దాన్ని చూడగానే తనెంత మురిసిపోతుందో! ఆ ఉద్యోగం రావడంలో నాకు మార్గదర్శిలా వ్యవహరించింది నా అర్ధాంగే అని వేరే చెప్పాలా! ప్రతి మగాడి విజయం వెనకాల ఓ ఆడది ఉంటుందో, లేదో తెలియదుగానీ.. నా విజయం, సంతోషంలో ఎక్కువ జ్యోతే ఉంది.
సంతోష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని