AP High Court: పంచ్‌ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్టు చేయాల్సిందే

న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్‌ ప్రభాకర్‌ను పదిరోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి హైకోర్టు తుది గడువు ఇచ్చింది.

Updated : 03 Nov 2021 11:35 IST

మీకు చేతకాకపోతే చెప్పండి.. సిట్‌ను ఏర్పాటు చేస్తాం

సుప్రీంకోర్టుకు నివేదిస్తాం.. సీబీఐకి తేల్చిచెప్పిన హైకోర్టు

దర్యాప్తు పురోగతిపై సీబీఐ డైరెక్టర్‌ నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: న్యాయవ్యవస్థ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుడు పంచ్‌ ప్రభాకర్‌ను పదిరోజుల్లో అరెస్టు చేయాలని సీబీఐకి హైకోర్టు తుది గడువు ఇచ్చింది. దర్యాప్తు సరైన రీతిలో సాగుతోందని సదుద్దేశాన్ని రుజువు చేసుకోవాలని, అందులో విఫలమైతే మీకు దర్యాప్తు చేతకావడం లేదని భావించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ నివేదిస్తామని వెల్లడించింది. దర్యాప్తుపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అసభ్యకర పోస్టులపై అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) దాఖలుచేసిన వ్యాజ్యంపై మంగళవారం నాటి విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ఆయన వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయస్థానాన్ని అపకీర్తిపాలు చేసే పోస్టులపై పోలీసులు కేసు నమోదుచేశాక.. సామాజిక మాధ్యమాలు చేయాల్సిన మొదటి పని ఆ పోస్టులను తొలగించడం కాదా? అని ప్రశ్నించింది. పోస్టులు పెట్టిన వ్యక్తి ఉద్దేశం నెరవేరాక ఒకటి, రెండేళ్ల తర్వాత వాటిని తొలగించి ఉపయోగం ఏముంటుందని వ్యాఖ్యానించింది.

మిమ్మల్ని ఎవరు బతిమాలమన్నారు?

సీబీఐ తరఫున పి.సుభాష్‌ వాదనలు వినిపిస్తూ.. వీడియోలు తొలగించాలని గూగుల్‌కు లేఖలు రాయగా.. ఆ పోస్టులు పెట్టిన నిందితులనే తొలగించాలని బతిమాలుకోవాలంటూ సమాధానం వచ్చిందన్నారు. పంచ్‌ ప్రభాకర్‌ విషయంలో రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేశామన్నారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. దీంతో సీబీఐపై ఆగ్రహం వ్యక్తంచేసిన ధర్మాసనం.. ‘మిమ్మల్ని ఎవరు బతిమాలమన్నారు? చేతకాకపోతే చెప్పండి.. సిట్‌ను ఏర్పాటుచేస్తాం’ అని సీబీఐని హెచ్చరించింది. 4 వారాల సమయం ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ విమలాదిత్య కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రభాకర్‌ను పట్టుకోవడానికి మూడు రోజులే ఇస్తామని, లేనిపక్షంలో సీడీఐ డైరెక్టర్‌ హాజరుకావాలని హెచ్చరించింది. మరికొంత సమయమివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది, ఎస్పీ వేడుకొనగా.. పది రోజుల సమయం ఇచ్చింది.


న్యాయవ్యవస్థ హుందాతనాన్ని న్యాయవాదులే కాపాడాలి: ధర్మాసనం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను అపకీర్తిపాలు చేసేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి, చర్చలు జరిపిన 93 మందిపై నమోదుచేసిన సుమోటో కోర్టుధిక్కరణ వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.పలువురు నోటీసులు అందుకున్నా వ్యక్తిగతంగా రాకపోవడం, లేదా న్యాయవాదిని నియమించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి సందర్భాల్లో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేస్తామని పేర్కొంది. మరో అవకాశం ఇస్తున్నామంటూ విచారణను నవంబరు 23కి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని