Ukraine Crisis: వంటనూనె.. సలసల

  విజయవాడలోని ఒక కార్పొరేట్‌ మాల్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు లీటరు పామాయిల్‌ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ.149 అయింది. అంటే రెండు గంటల్లోనే  లీటరుకు రూ.21 చొప్పున పెరిగింది. 

Updated : 27 Feb 2022 06:31 IST

 రెండు రోజుల్లోనే లీటరుకు రూ.20కి పైగా పెరుగుదల
ఉక్రెయిన్‌లో యుద్ధం పేరిట స్థానికంగా దోపిడీ

  విజయవాడలోని ఒక కార్పొరేట్‌ మాల్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు లీటరు పామాయిల్‌ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ.149 అయింది. అంటే రెండు గంటల్లోనే  లీటరుకు రూ.21 చొప్పున పెరిగింది.
ఈనాడు, అమరావతి: వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటరుపై రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగాయి. అదేమంటే అక్కడెక్కడో యుద్ధం అంటగా? అందుకే పెరిగాయనే సమాధానం వస్తోంది. ఈ పెరుగుదల ఎంతవరకో తెలియడం లేదని, కరోనా సమయంలో ధరలకు మించి పెరిగే అవకాశం ఉందంటున్నారని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల కారణంగా పేద, మధ్యతరగతి వర్గాల ఇంటి ఖర్చు మరింత పెరుగుతోంది. రోడ్డు పక్క తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల ఆదాయానికి చిల్లు పడుతోంది. యుద్ధం మొదలై రెండు రోజుల్లోనే నూనె ధరలు పెరగడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గోదాముల్లో ఉన్న సరకుకే ధరలు పెంచేసి అమ్ముతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా ధరల పెంపు
శనివారం సాయంత్రానికి వంట నూనెల ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నాయి. సగటున వేరుసెనగ నూనె రూ.170, పొద్దుతిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌) రూ.160, పామాయిల్‌ రూ.150 వరకు పలుకుతోంది. రైస్‌రిచ్‌, రైస్‌బ్రాన్‌ నూనెల ధరలూ లీటరుకు రూ.20 వరకు పెరిగాయి. విజయవాడ చిల్లర మార్కెట్లో లీటరు పామాయిల్‌ రూ.158, పొద్దుతిరుగుడు నూనె రూ.175, వేరుసెనగ రూ.175 చొప్పున విక్రయిస్తున్నామని వ్యాపారులు వివరించారు. కొన్నిచోట్ల వేరుసెనగనూనె లీటరు రూ.182, పొద్దుతిరుగుడు నూనె రూ.180 అని బోర్డులు పెట్టారు. హోల్‌సేల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో తామూ పెంచక తప్పలేదని వివరించారు.

* కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లోని సమాచారం మేరకు శనివారం దేశవ్యాప్త సగటు ధరలు పరిశీలిస్తే.. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.152.30, పామోలిన్‌ రూ.135.78, వేరుసెనగ నూనె రూ.173.40 చొప్పున ఉంది. క్షేత్రస్థాయి ధరలకు వీటికీ పోలికే లేదు.
* గత నెల ఇదే సమయంలో ప్రధాన నౌకాశ్రయాల్లో దిగుమతి అయిన పామోలిన్‌ ధర లీటరు రూ.119- 120 మాత్రమే ఉంది. ఇప్పుడు లీటరుకు రూ.25 నుంచి రూ.30 పైనే పెరుగుదల నమోదైంది.
* వేరుసెనగ నూనెపై దిగుమతుల ప్రభావం అంతగా లేకున్నా.. దాని ధరలూ లీటరుకు రూ.10 నుంచి రూ.20 పైనే పెంచేయడం గమనార్హం. లీటరు ధర గరిష్ఠంగా రూ.165 నుంచి రూ.175 మధ్యకు చేరింది.

రోజుకు రూ.150 అదనపు భారం
శుక్రవారంతో పోలిస్తే శనివారం లీటరుకు రూ.30 వరకు పెరిగింది. రోజుకు 5 లీటర్ల పామోలిన్‌ వినియోగిస్తే రూ.150 వరకు అదనంగా ఖర్చవుతోందని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. నూనె ధరలు పెరిగాయని వెంటనే తినుబండారాల ధరల్ని పెంచలేం కదా? అని కృష్ణవేణి పాఠశాల రోడ్డులో వ్యాపారం చేసే కృష్ణ వాపోయారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. మేమూ అల్పాహార ధరలు పెంచాల్సి వస్తుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు