Prawn: రొయ్యకు ఉక్కపోత

విద్యుత్తు కోతలతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఊపిరాడక రొయ్య ఉక్కిరిబిక్కిరవుతోంది. వాటిని కాపాడుకునేందుకు రైతులు జనరేటర్లు వేసి ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అదనపు భారం పడుతోంది.

Updated : 25 Apr 2022 03:40 IST

విద్యుత్తు కోతలతో రైతుల అవస్థలు
జనరేటర్లతో ఆక్సిజన్‌ సరఫరా
ప్రాసెసింగ్‌ ప్లాంట్లలోనూ తగ్గిన శుద్ధి ప్రక్రియ

ఈనాడు, అమరావతి: విద్యుత్తు కోతలతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఊపిరాడక రొయ్య ఉక్కిరిబిక్కిరవుతోంది. వాటిని కాపాడుకునేందుకు రైతులు జనరేటర్లు వేసి ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అదనపు భారం పడుతోంది. రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లకూ విద్యుత్తు కష్టాలు తీవ్రంగానే ఉన్నాయి. 50% విద్యుత్తు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధనతో.. రొయ్యల కొనుగోలు తగ్గించేశారు. ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో పనిచేసే కార్మికులకు ఉపాధి పోయింది. సాగు ఖర్చు పెరిగినా, రొయ్యలకు కిలోకు రూ.30 వరకు ధర తగ్గింది. రూ.లక్షల్లో నష్టాలొస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనరేటర్‌ లేకుంటే.. రొయ్య గల్లంతే

ఆక్వాసాగులో విద్యుత్తు సరఫరా కీలకం. ఏరియేటర్లను ఆడించి రొయ్యలకు ఆక్సిజన్‌ అందిస్తారు. గంట పాటు సరఫరా నిలిచినా.. రొయ్యలు ఉక్కిరిబిక్కిరవుతాయి. రూ.లక్షల్లో పెట్టుబడి నష్టపోవాల్సిందే. కాకినాడ జిల్లా పరిధిలో అచ్యుతాపురంలో శుక్రవారం పగలు, రాత్రి నాలుగేసి గంటలు విద్యుత్తు సరఫరా నిలిచింది. దీంతో రైతులు జనరేటర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. 15 ఎకరాల చెరువుకు రోజుకు రూ.20వేల వరకు ఖర్చవుతోందని  రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ లెక్కన నెలకు రూ.6 లక్షల ఖర్చు అదనంగా అవుతోందని చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాంతంలో రోజుకు మూడు గంటల చొప్పున విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది.

ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో కష్టాలు

రాష్ట్రంలో 70కి పైగా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో దానిలో సగటున 50 టన్నుల రొయ్యలను శుద్ధి చేస్తారు. విద్యుత్తుకోతలతో ఇక్కడ పరిస్థితి తారుమారైంది. గతంలో వినియోగించే విద్యుత్తులో 50% మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికితోడు వారానికోరోజు సెలవు ఇస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు కొనుగోలు తగ్గించేశారు. జనరేటర్‌కు గంటకు 130 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. దీంతో సేకరణ తగ్గించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రోజుకు 50 టన్నులు కొనేవాళ్లమని, ఇప్పుడు 27 టన్నులే తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ప్లాంటువారు చెప్పారు. ప్లాంట్లలో గతంలో వెయ్యిమంది పనిచేస్తుండగా.. ఇప్పుడు 400-500 మందే వస్తున్నారని వివరించారు.

12 గంటల్లో ఐస్‌ వచ్చేదెలా?

ఐస్‌ తయారు కావాలంటే 24 గంటలు నిరతరాయంగా సరఫరా ఇవ్వాలి. ఇప్పుడు 12 గంటలే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే మిగిలిన 12 గంటలు జనరేటర్‌ వేయాలి. ఇలాగైతే మూసేసుకోవడమే మేలని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఐస్‌ప్లాంట్‌ యజమాని వివరించారు. ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీలకు మినహాయింపు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. ఫ్యాక్టరీలో క్రీమ్‌ లేదంటూ 12 గంటలే వినియోగించుకోమంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. విద్యుత్తు కోతలతో ఇప్పటికే పలు ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. రొయ్యలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసే చేపలకూ ఐస్‌ అవసరం. మొత్తంగా చూస్తే ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని రైతులు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు వాపోతున్నారు.


* సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చెరువుల్లోని రొయ్యలకు ఆక్సిజన్‌ తగ్గకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తగ్గినా రొయ్య నీటిపై తేలుతుంది. అందుకే రైతులు ఏరియేటర్ల ద్వారా వాటికి ప్రాణవాయువు అందిస్తుంటారు. ఎడాపెడా కోతలతో జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు. 15 ఎకరాల రొయ్యల చెరువు ఉంటే.. రోజుకు రూ.20వేలు అదనంగా ఖర్చవుతోంది.


* చెరువు నుంచి పట్టిన తర్వాత నుంచి ప్రాసెసింగ్‌ వరకు కిలో రొయ్యలకు 5 కిలోల ఐస్‌ అవసరం అవుతుంది. విద్యుత్తు కోతలతో ఐస్‌ కొరత తీవ్రమైంది. మొన్నటివరకు క్యాన్‌ ధర రూ.150 ఉండగా.. ఇప్పుడు రూ.300-400 పెట్టినా దొరకడం లేదు. దీంతో ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు రొయ్యల కొనుగోలు తగ్గించేశారు.


రొయ్యల చెరువుల వద్ద జాగారం!

నెల్లూరు, న్యూస్‌టుడే: సమయపాలన లేకుండా విద్యుత్తు సరఫరా నిలిపేస్తుండటంతో ఆక్వా రైతులు చెరువు కట్టలపై జాగారం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో దాదాపు 700 ఎకరాల్లో ఆక్వా సాగు చేపట్టారు. రెండేళ్లు కరోనా ప్రభావంతో ఇబ్బందులుపడి, నవంబరులో సాగుకు ఉపక్రమించినా వరదలకు చెరువులన్నీ కొట్టుకుపోయాయి. ఇన్ని కష్టాలుపడి ఈ ఏడాది మార్చిలో సాగు ప్రారంభిస్తే విద్యుత్తు కోతలు శాపంలా మారాయి. గంగపట్నంకు చెందిన భాస్కర్‌రెడ్డి మూడెకరాల చెరువులో వనామీ రకం రొయ్యల సాగు చేపట్టారు. రూ.1.50 లక్షలు పెట్టి చెరువు బాగు చేసి, సీడ్‌, ఫీడ్‌ కోసం రూ.5 లక్షలు వెచ్చిస్తే.. సీడ్‌ వేసిన 15 రోజుల నుంచే జనరేటర్లు పెట్టి ఏరియేటర్లు వినియోగించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్‌లో 30కేవీ, 40కేవీ జనరేటర్లకు నెలకు రూ.10వేల అద్దె ఉండగా.. 63కేవీ జనరేటర్లకు రూ.12వేలు వెచ్చించాల్సి వస్తోంది. వీటిని రోజులో నాలుగు గంటలు నడిపినా రూ.2వేల దాకా భారం పడుతోందని వాపోతున్నారు.

- ఈనాడు నెల్లూరు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని