Yuvagalam: ఘనంగా.. ముందడుగు

వందల మంది నాయకులు.. వేల మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు వెంట రాగా.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది.

Updated : 28 Jan 2023 06:22 IST

‘యువగళం’ కార్యక్రమానికి పోటెత్తిన ప్రజలు, తెలుగు తమ్ముళ్లు
జనసంద్రమైన కుప్పం పట్టణం
ఉదయం 11.03 గంటలకు తొలి అడుగు వేసిన నారా లోకేశ్‌
జనాల తాకిడితో 2 కి.మీ. పాదయాత్రకు గంట సమయం

వందల మంది నాయకులు.. వేల మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు వెంట రాగా.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. తెదేపా నేతలతో కలిసి లోకేశ్‌ శుక్రవారం ఉదయం 11.03కు తొలి అడుగు వేశారు. మామ బాలకృష్ణ భుజం తట్టి వెంట నడవగా.. లోకేశ్‌ పిడికిలి బిగించి విజయకేతనం చూపుతూ ముందుకు సాగారు. తొలిరోజు 8.5 కిలోమీటర్లు నడిచి.. గుడుపల్లె చేరుకున్నారు. 

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం: నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలమూలల నుంచి తరలివచ్చిన వేల మంది తెదేపా కార్యకర్తలు, యువత.. చిత్తూరు జిల్లా కుప్పంలో కదం తొక్కారు. యువనేతకు తోడుగా తెలుగు తమ్ముళ్లు పోటెత్తారు.. వీరికి ప్రజలూ తోడవడంతో పట్టణ వీధులన్నీ జనజాతరను తలపించాయి. వందల మంది నాయకులు, వేల మంది కార్యకర్తల నినాదాల మధ్య లోకేశ్‌ తన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నిర్ణీత షెడ్యూల్‌ కన్నా కార్యక్రమాలు ఆలస్యమైనప్పటికీ మహిళలు, వృద్ధులు, చిన్నారులు తెదేపా యువనేత రాక కోసం ఓపికగా నిరీక్షించారు. పాదయాత్ర ఆయా ప్రాంతాలను సమీపించే సమయంలో వారంతా నీరాజనాలు పలికారు. లోకేశ్‌ వారందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. మార్గమధ్యలో మహిళలు మంగళహారతులు పట్టారు. కుప్పం పట్టణంలోని బాబునగర్‌ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో బస్టాండ్‌ దగ్గర ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని చేరుకోవడానికి గంట సమయం పట్టిందంటే తెదేపా కార్యకర్తలు, యువత తాకిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్లన్నీ నిండిపోవడంతో మరికొందరు మేడలు, భవంతులపైకి ఎక్కి లోకేశ్‌ పాదయాత్రను ఆసక్తిగా తిలకించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కమతమూరు రోడ్డులో నిర్వహించిన సభకు సుమారు 50 వేల మంది తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి లోకేశ్‌ కార్యకర్తల సందడి నడుమ బయలుదేరారు. యువత ఆయన వాహనాన్ని అనుసరించింది. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 11.03 గంటలకు ఆలయం వద్ద తొలి అడుగు వేసి పాదయాత్రను ప్రారంభించారు.అనంతరం సమీపంలోని మసీదుకు కాలినడకన పయనమయ్యారు. అక్కడ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మతపెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బాబునగర్‌లోని హెబ్రోన్‌ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసి, రెండు కిలోమీటర్ల దూరంలోని కుప్పం బస్టాండ్‌కు పాదయాత్రగా బయల్దేరారు. కుప్పం పట్టణంలోని పార్టీ కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు లోకేశ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అందుకే యువగళం

యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ ఈ ప్రభుత్వంలో బాధితులే. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, ఉద్యమిస్తే జైలు. అందుకే యువగళం పాదయాత్ర ప్రారంభించా. ఇది పాదయాత్ర మాత్రమే కాదు. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు యువతకు ఓ అద్భుత అవకాశం.

లోకేశ్‌


* పాదయాత్రలో నిరుద్యోగ ఐకాస సభ్యులు లోకేశ్‌ను కలిశారు. ఎన్నికలకు ముందు జగన్‌ 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, డీఎస్సీ, ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీలన్నీ నీటిమూటలయ్యాయని వాపోయారు.

* ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా తెదేపా హయాంలో నిర్మించిన ఇంటిని చెరువులో కట్టుకున్నారంటూ అధికారులు అన్యాయంగా కూల్చేయించారని దళిత మహిళ శ్యామల లోకేశ్‌కు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లోని వస్తువులు బయటపడేశారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడే ఇల్లు కట్టించి గృహప్రవేశం చేయిస్తానని యువనేత ఆమెకు హామీ ఇచ్చారు.

* 17 సెంట్లలో సాగు చేసిన జొన్న పంటను ధ్వంసం చేయడంతోపాటు ఇంటిని కూల్చారంటూ ధనమ్మ అనే బాధితురాలు చెప్పగా లోకేశ్‌ ఓదార్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని