సంక్షిప్త వార్తలు (8)
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిర్డీకి ప్రతి రోజూ విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది.
నేటి నుంచి విజయవాడ-శిర్డీ విమాన సర్వీసు
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిర్డీకి ప్రతి రోజూ విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఆదివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు శనివారం వెల్లడించారు. సుమారు 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఈ విమానం.. రోజూ మధ్యాహ్నం 12:25 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3 గంటలకు శిర్డీ చేరుకుంటుంది. మరో సర్వీసు శిర్డీ నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి.. 04:26 గంటలకు విజయవాడ వస్తుంది. టిక్కెట్ ధరను రూ.4,639 గా నిర్ణయించారు.
విశాఖలో తాత్కాలిక రెడ్‌జోన్
జీ-20 సదస్సు నేపథ్యంలో నిర్ణయం
విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: జీ-20 సన్నాహక సదస్సు జరగనున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని కొన్ని ప్రాంతాలను తాత్కాలిక రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్, ముడసర్లోవ పార్కు, కైలాసగిరి, ఆర్కేబీచ్, కాపులుప్పాడ జిందాల్ ఎనర్జీ ప్లాంట్, మాధవధారలతో పాటు సదస్సుకు హాజరైన ప్రతినిధులు ప్రయాణించే వివిధ మార్గాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి. ఈనెల 27 రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఆయా ప్రాంతాలకు 2 కి.మీ. పరిధిలో డ్రోన్లతో ఎలాంటి చిత్రీకరణ చేపట్టకూడదని కమిషనర్ వివరించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి డ్రోన్లతో సహా ఏమైనా సంప్రదాయేతర వస్తువులను ఎగురవేస్తే వాటిని నాశనం చేయటం లేదా జప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
దుర్గిలో కాకతీయుల నాటి విగ్రహాలు
వెల్దుర్తి, దుర్గి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా దుర్గిలోని శివాలయంలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా రెండు రోజులుగా తవ్వకాలు చేపట్టగా విగ్రహాలు వెలుగుచూశాయి. వాటిని శనివారం చరిత్రకారుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. విగ్రహాలు కాకతీయుల కాలం నాటివన్నారు. మహిషాసురమర్దిని, చతుర్ముఖ బ్రహ్మ, చెన్నకేశవస్వామి, చాముండి, సరస్వతి విగ్రహాలుగా గుర్తించారు.
విద్యా హక్కు చట్టం పరిధిలోకి మరిన్ని విద్యా సంస్థలు
ఈనాడు-అమరావతి: విద్యాహక్కు చట్టం పరిధిలోకి మరికొన్ని విద్యా సంస్థలను తీసుకొస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు సొసైటీలు, సంస్థల పరిధిలో ఉన్న సంస్థలకూ ఇక నుంచి విద్యా హక్కు చట్టం వర్తిస్తుంది.
మంగళగిరి ప్లాట్లకు దరఖాస్తులు చేసుకోండి: సీఆర్‌డీఏ కమిషనర్
ఈనాడు-అమరావతి: మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని నవులూరులో అభివృద్ధి చేస్తున్న జగనన్న ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లో ప్లాట్ల కోసం రాష్ట్రంలో ఎక్కడి ప్రభుత్వ ఉద్యోగులైనా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన రాయితీ ఉపయోగించుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ సూచించారు. లేఅవుట్‌లో 200 చదరపు గజాల ప్లాట్లు 58, 240 చదరపు గజాల ప్లాట్లు 188 అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చదరపు గజానికి రూ.17,499 ధరగా నిర్ణయించామని తెలిపారు. వచ్చే నెల 30 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర సందేహాల నివృత్తి కోసం 0866 2527124 ఫోన్ నంబరులో సంప్రదించాలని కమిషనర్ సూచించారు.
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలోని బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మొదట ప్రకటించిన దాని ప్రకారం ఈ నెల 24తో గడువు ముగిసిందన్నారు.
ప్రభుత్వోద్యోగులు ఎక్కడి ఎంఐజీ ప్లాట్లకయినా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈనాడు, అమరావతి: పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో ఇళ్ల స్థలాల (ప్లాట్ల) కోసం ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పని చేసిన చోట అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలోనే ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధనేమీ లేదని పేర్కొంది. లేఅవుట్లలోని మొత్తం ప్లాట్లలో 10% ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించడంతోపాటు ప్లాట్ విలువలో 20% రాయితీ ఇస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వెల్లడించింది.
క్షయ నివారణలో ఏపీకి 8 జాతీయ పురస్కారాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: క్షయ నివారణకు సంబంధించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది పురస్కారాలు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వారణాసిలో శుక్రవారం జరిగిన ప్రపంచ క్షయ నివారణ సదస్సులో ప్రధాని మోదీ చేతుల మీదుగా పురస్కారాలను ఏపీ అధికారులు అందుకున్నట్లు పేర్కొంది. ఏపీ నుంచి ఏలూరు జిల్లాకు స్వర్ణం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాలకు రజతం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు కాంస్యం అందుకున్నాయి. 2015-2022 మధ్య క్షయ నివారణ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం పనితీరుకు ఈ పురస్కారాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్