ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!

‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి.  కానీ జగన్‌.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు.

Published : 10 May 2024 05:27 IST

దళితులు, గిరిజనులకు జగన్‌ ద్రోహం
ఉపప్రణాళిక నిధులు యథేచ్ఛగా మళ్లింపు
నాలుగేళ్లలో రూ.29 వేల కోట్ల కోత
వారి ప్రత్యేక పథకాలన్నీ రద్దు
ఈనాడు, అమరావతి

‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి.  కానీ జగన్‌.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. వారికి చట్టబద్ధంగా అందాల్సిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులకు కోతవేసి.. కేటాయించిన వాటినీ పక్కదారి పట్టించి.. తీరని ద్రోహం చేశారు!

‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అని చెబుతూనే.. చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా దళిత, గిరిజనుల అభివృద్ధిని ఘోరంగా దెబ్బతీశారు సీఎం జగన్‌. బలహీనవర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాల ద్వారా సంపాదించుకున్న ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక(కంపొనెంట్‌) చట్టాన్ని నిర్వీర్యం చేశారు. జనాభా దామాషా ప్రకారం వారికి నిధులు కేటాయించాలని చట్టం చెబుతున్నా... దాన్ని తుంగలో తొక్కారు. దళిత, ఆదివాసీ వ్యక్తులు, కుటుంబాలకు, వారు నివసిస్తున్న దళితవాడలు, తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించాల్సిన ఈ నిధుల్ని ఇష్టానుసారం దారి మళ్లించారు. దళితులు, గిరిజనులకు ప్రత్యేక సాయమంటూ లేకుండా చేశారు. అందరికీ ఇచ్చే పథకాలనే వారికి వర్తింపచేస్తూ అదే తాము చేసేదే గొప్ప సాయమనే ప్రచారం చేసుకున్నారు. అణగారిన వర్గాలకు అండ అనేదే లేకుండా చేసి తనను మించిన పెత్తందారు మరొకరు లేరని నిరూపించుకున్నారు.


కేటాయింపుల్లో ప్రతి ఏడాదీ కోతలే...

రాష్ట్రంలో ఎస్సీలు 16.4% ఉన్నారు. ఏటా బడ్జెట్‌లో ఆ మేరకు ఉప  ప్రణాళిక నిధులు కేటాయించాలి. 2019-20లో 11%, 2020-21లో 11.9%, 2021-22లో 13.8%, 2022-23లో 12.1% మేర మాత్రమే కేటాయించారు. అంటే రూ.23 వేల కోట్లు కోతవేశారు. ఎస్టీల జనాభా 5.3% ఉండగా... 2019-20లో 3.7%, 2020-21లో 3.9%, 2021-22లో 4.9%, 2022-23లో 4% కేటాయించారు. అంటే రూ.6,547 కోట్లు కోతపడింది. మొత్తంగా  రూ.29 వేల కోట్లు తగ్గించారు. వాటినీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఇప్పటికీ 2023-24 సంవత్సరానికి సంబంధించిన లెక్కలు వెల్లడించలేదు.


ఉపప్రణాళిక చట్టానికి తూట్లు....

ఉప ప్రణాళిక చట్టంలోని సెక్షన్‌ 11(ఎ), 11(బి) నిబంధనల ప్రకారం 100% నిధుల్ని దళిత, ఆదివాసీ వ్యక్తులు, కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పథకాలకు లేదా వారు నివసిస్తున్న దళితవాడలు, గిరిజన తండాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తే అక్కడి ఎస్సీ, ఎస్టీల జనాభాను బట్టి నిధులను కేటాయించాలి. గత ప్రభుత్వాలు ఈ నిబంధనలకు ప్రాధాన్యమిచ్చి పనులు కేటాయించాయి. కానీ వైకాపా ప్రభుత్వం వీటిని పూర్తిగా పక్కన పెట్టి.. నిధులను ఇష్టారీతిగా ఖర్చు చేసింది.


అంతా ముందస్తు వ్యూహం ప్రకారమే..

ఐదేళ్ల జగన్‌ పాలన తీరులో ఉప ప్రణాళికను అమలు చేసిన తీరును  చూస్తే.. ఆ నిధుల్ని ఇతర వాటికి మళ్లించే నిర్ణయం ఎన్నికలకు ముందే జరిగినట్టుంది. ఉప ప్రణాళికను పారదర్శకంగా అమలు చేస్తామనే హామీని వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు ఉంటే వాటికి నిధుల్ని కేటాయించాల్సి వస్తుంది. అందుకే అధికారం చేపట్టగానే వారి కోసం ఏళ్లుగా అమలవుతున్న పథకాలన్నింటినీ రద్దు చేయడమో, నిలిపేయడమో, నామమాత్రంగా మార్చడమో చేశారు. ఆపైన ఉప ప్రణాళిక నిధులను ఇష్టానుసారంగా వాడారు.


పింఛన్లు ఇప్పుడే కొత్తగా ఇస్తున్నారా?

ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళిక నిధులన్నింటినీ జగన్‌ నవరత్నాలకు మళ్లించారు. పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, జగనన్న గోరుముద్ద,  వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్లు, మధ్యాహ్న భోజనం, ఇతర పథకాల్లోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల సంఖ్య, వారికి కేటాయించిన నిధుల్ని తీసి... ఉపప్రణాళిక నిధుల కింద చూపించారు. ఈ పథకాలను జగన్‌ మాత్రమే కొత్తగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. మరోవైపు దశాబ్దాలుగా ఎస్సీలకు అమలవుతున్న భూమి కొనుగోలు పథకాన్ని ఎత్తేశారు. ప్రతిభావంతులైన దళిత, గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే ‘బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌’ పథకాన్ని నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే స్వయం ఉపాధి రుణాల పథకాలకు మోకాలొడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధికి ప్రోత్సాహం లేకుండా చేశారు.


చట్టం లేకుండా చేసే ఎత్తుగడనా...

ఉపప్రణాళిక చట్టం గడువు పదేళ్లు. అది 2023 జనవరితో ముగియనుందని తెలుసు. దీని అమలుపై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గడువు రాకముందే పొడిగింపుపై నిర్ణయం తీసుకునేది. కానీ, ఆయా సంఘాలు గొంతెత్తి పోరాటం చేశాకనే స్పందించింది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఉప ప్రణాళిక నిధుల్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందనే వివరాల్ని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతోంది. కానీ ప్రభుత్వం ఆ వివరాల్ని ఎక్కడా బహిర్గతం చేయడం లేదు. సామాజిక తనిఖీ లేదు.

ఉప ప్రణాళికని సక్రమంగా అమలు చేయని జగన్‌.. ఎన్నికల ముందు కులగణన పేరిట కొత్త నాటకాన్ని నడిపించారు. గతేడాది అక్టోబరు నుంచి ఎస్సీ, ఎస్టీలు రాష్ట్రంలో ఎందరున్నారో తేలుస్తామంటూ.. సర్వే చేయించారు. ఈ సర్వేతో ఇక ఎస్సీ, ఎస్టీల జీవితాలు ఇట్టే బాగు పడతాయనేలా మాట్లాడారు వైకాపా నేతలు. రాష్ట్రంలోని సమస్త కుటుంబాల సమాచారాన్ని... ఫిబ్రవరి నెలాఖరుకే సేకరించి తమ గుప్పిట పెట్టుకున్నారు. ఆ వివరాలను విడుదల చేయకుండా తమ రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని