కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!

భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం.

Published : 10 May 2024 06:43 IST

విద్యుత్‌ కొనుగోలులో డిస్కంల అత్యుత్సాహం ఫలితం
రూ. కోట్లలో నష్టం.. వినియోగదారులపైనే భారం

ఈనాడు, అమరావతి: భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. ఆ తరహాలోనే విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వ్యాపారం చేస్తున్నాయి. చౌకధరకే విద్యుత్‌ను మార్కెట్‌లో అమ్మేస్తున్నాయి. ఇప్పటికే సుమారు రూ.1.14 లక్షల కోట్ల నష్టాల్లో ఉన్న డిస్కంలు చౌకధరకే విద్యుత్‌ అమ్మడం ఏంటి? కారణం ఏంటో తెలిస్తే ఇదా డిస్కంల తీరు అని నవ్వు తెప్పిస్తుంది. ఆ నష్టభారాన్ని విద్యుత్‌ బిల్లుల్లో కలిపి ‘ట్రూఅప్‌’ పేరుతో మనమీదే వేస్తారన్న వాస్తవం తెలిస్తే కంట నీరొస్తుంది.  

డిస్కంల చౌక బేరం ఏంటో చూద్దామా..

జగన్‌ ‘రివర్స్‌’ పాలనను అచ్చుగుద్దినట్లు డిస్కంలూ అందిపుచ్చుకున్నాయి. అధిక ధరకు కొన్న విద్యుత్‌ను రూ.8.27 కోట్ల నష్టానికి మార్కెట్‌లో విక్రయించాయి. అది బుధవారం ఒక్క రోజు నష్టమే. వేసవిలో విద్యుత్‌కు అధిక డిమాండ్‌ ఉంటుందని పోటీపడి మరీ అధిక ధరకు డిస్కంలు విద్యుత్‌ కొన్నాయి. గత ఏడాది సెప్టెంబరులో 3,640 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ కొనేలా స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి. బుధవారం 28.115 ఎంయూలు (యూనిట్‌ రూ.8.369), టర్మ్‌ ఎహెడ్‌ మార్కెట్‌ ద్వారా 4.44 ఎంయూలు (యూనిట్‌ రూ.6.824), డే ఎహెడ్‌ మార్కెట్‌లో (డ్యామ్‌) 5.213 ఎంయూల విద్యుత్‌ (యూనిట్‌ రూ.4.621) కొన్నాయి. కానీ డిమాండు లేకపోవడంతో ఆ విద్యుత్‌ మిగిలిపోతోంది. ప్రస్తుతం ఎక్స్ఛేంజీల్లో యూనిట్‌ ధర రూ.5కు మించడం లేదు. దీంతో అధికధరకు కొన్న విద్యుత్‌ను తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. అలా బుధవారం 22.06 ఎంయూల విద్యుత్‌ యూనిట్‌ రూ.4.621 చొప్పున విక్రయించాయి. ఈ లావాదేవీల ద్వారా రూ.10.19 కోట్లు డిస్కంలకు వచ్చాయి. ఒప్పందం ప్రకారం డిస్కంలు ఆ విద్యుత్‌కు రూ.18.46 కోట్లు చెల్లించాలి. ఇలా జూన్‌ వరకు అధిక ధరకు కొన్న విద్యుత్‌ వల్ల వచ్చే నష్టాన్ని ట్రూఅప్‌ కింద ప్రజలే భరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని