ఎవరి హయాంలో మన యువత రాణించింది?

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్‌స్క్వేర్‌ మాజీ ఛైర్మన్‌ కొల్లా అశోక్‌ అన్నారు.

Published : 10 May 2024 05:28 IST

ఆ నాయకత్వమే ఇప్పుడు రాష్ట్రానికి అవసరం
ప్రవాసాంధ్రుడు కొల్లా అశోక్‌

ఈనాడు, అమరావతి: ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్‌స్క్వేర్‌ మాజీ ఛైర్మన్‌ కొల్లా అశోక్‌ అన్నారు. విదేశీ చదువులకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసే నాయకులనే ఎన్నుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లావారిపాలెంకు చెందిన ఆయన.. 17 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల కిందట రాష్ట్రానికి వచ్చి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజల భవిష్యత్తుకు మంచి జరుగుతుందో వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 వేలకు పైగా ఇళ్లకు వెళ్లి ప్రచారం చేసినట్లు తెలిపారు. ‘ఒకప్పుడు ఉన్నత విద్యారంగంలో దేశానికే తలమానికంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌.. ఇప్పుడెక్కడుంది? నిరుద్యోగిత 30% చేరడానికి కారణమెవరో విద్యార్థులు, యువత తెలుసుకోవాలి. ఎందుకు శాంతి భద్రతలు లోపించాయి? యువత ఒక్కసారి వీటన్నింటినీ ఆలోచించాలి. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే నాయకుణ్ని ఎన్నుకునేందుకు విద్యార్థులు, యువత నడుం బిగించాలి. గతంలో విదేశీ విద్య ఉండేది. ఎంతోమంది విద్యార్థులు ఆ పథకాన్ని ఉపయోగించుకుని విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. మళ్లీ అలాంటి రోజులు రావాలి. ఎవరి హయాంలో పరిశ్రమలు వచ్చాయి, ఎవరు సీఎంగా ఉన్నప్పుడు విదేశాలకు ఎక్కువ మంది వెళ్లారు.. అనే అంశాలను ఓటేసే ముందు యువత, వారి తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని తెలివైన నిర్ణయం తీసుకోవాలి’ అని అశోక్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చే నాయకత్వమే ఇప్పుడు రాష్ట్రానికి అవసరమని, అలాంటి వారే రేపటి తరానికి మంచి భవిష్యత్తు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని