ఉపాధి లెక్కల్లో జగన్మాయ

ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్‌’ మాస్టర్‌ జగన్‌ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్‌లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు.

Published : 10 May 2024 05:28 IST

పరిశ్రమల్లో 1.41 లక్షల ఉద్యోగాలు అంటూ అబద్ధాలు
పెట్టుబడులే పెట్టనిది పరిశ్రమలు ఎలా వచ్చాయి?
ఫలితమివ్వని ‘75 శాతం ఉద్యోగాలు స్థానికులకే’ చట్టం
ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఆగని వలసలు
ఈనాడు, అమరావతి

ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్‌’ మాస్టర్‌ జగన్‌ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్‌లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. పెద్దగా ఎవరికి, ఎలాంటి ఉపాధి కలగకున్నా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చామని పిట్టకథలు చెప్పారు.


రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశాల్లోనే బిల్లును తీసుకొస్తాం. జిల్లాను యూనిట్‌గా తీసుకుని, పరిశ్రమలకు అనుకూలంగా వారికి
అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాం. అందుకు ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తాం

గత ఎన్నికల్లో వైకాపా మ్యానిఫెస్టోలో  ఇచ్చిన హామీ.

మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో రూ.46,280 కోట్ల పెట్టుబడితో 99 భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో 62,541 మందికి ఉద్యోగాలు లభించాయి. మరో 55 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటి ద్వారా 78,792 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి

2022లో అసెంబ్లీలో సీఎం జగన్‌ వెల్లడించిన పారిశ్రామిక గణాంకాలు.


కొండంత రాగం తీసి గోరంత పాడిన చందంలా మారింది కొత్తగా అవతరించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి జగన్‌ తీసుకొచ్చిన పరిశ్రమలు, వాటి ద్వారా నిరుద్యోగులకు కల్పించిన ఉపాధి పరిస్థితి. ఆయన చెప్పిన మహాగొప్ప ఉపాధి లెక్కలు వింటే ‘ఔరా..’ అని నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. జగన్‌ దెబ్బకు పెట్టుబడులతో రావాలంటేనే పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 8.62 లక్షల మందికి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తానంటూ గాల్లో లెక్కలు చెప్పేశారు. లోతుకు వెళ్తే గానీ ఆ ఉపాధి లెక్కల గొడవ, పరిశ్రమల ఏర్పాటులో ‘జగన్మాయ’ అర్థం కాదు. మసిపూసిన మారేడుకాయతో కనికట్టు చేసి జనాలను ఎలా బురిడీ కొట్టించారో ఇట్టే తెలిసిపోతోంది.


పెట్టుబడుల వికర్షణ!

వైకాపా సర్కారు ఐదేళ్లలో పెట్టుబడుల ఆకర్షణ కంటే వికర్షణకు చేసిన ప్రయత్నాలే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో రాష్ట్రం నుంచి తరలిపోయిన పెట్టుబడుల విలువ సుమారు రూ.1.24 లక్షల కోట్లు. రిలయన్స్‌, అదానీ, టెంపుల్టన్‌, లులు, జాకీ, అమరరాజా వంటి భారీ పరిశ్రమలు తమ పెట్టుబడుల ప్రతిపాదనలు పూర్తిగా విరమించుకోవడమో, పరిధిని తగ్గించుకోవడమో చేశాయి. జగన్‌ మాత్రం.. దావోస్‌ వెళ్లి గత ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చానని, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయించానని పిట్టకథలు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా  154 పరిశ్రమల ద్వారా 1,41,333 మందికి ఉపాధి కల్పించనున్నట్లు  అబద్ధాలు దట్టించారు. రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేసుకుని ఏటా సుమారు 2.8 లక్షల మంది పట్టభద్రులు వివిధ విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. జగన్‌ తీసుకొచ్చిన ‘ఏపీ ఎంప్లాయిమెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌’ చట్టం ప్రకారం చూసినా 1.06 లక్షల మందికి ఆ పరిశ్రమల్లో ఉపాధి దొరికి ఉండాలి. ఈ గణాంకాలే నిజమైతే.. రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 30 శాతానికి పైగా ఎందుకు ఉంది? ప్రభుత్వం చెప్పినట్లు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందిస్తే యువతలో ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె తదితర నగరాలకు వలస ఎందుకు వెళ్తుంది? ఈ ప్రశ్నలకు సీఎంగా జగనే సమాధానం చెప్పాలి.


కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో జగన్‌ మోసపూరిత లెక్కలే చెప్పారు. అధిక సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కల్లబొల్లి కబుర్లతో ఐదేళ్లు కాలక్షేపం చేశారు. ‘‘10 ప్రాజెక్టులకు సంబంధించి   రూ.91,129.24 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. వాటి వల్ల 40,500 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.1,06,800 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. వాటి ద్వారా కూడా 72,900 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి’ అని సీఎం జగన్‌ అసెంబ్లీలో రెండేళ్ల క్రితం ప్రకటించారు. జగన్‌ చెప్పిన లెక్కల ప్రకారమే ఈ పెట్టుబడుల ద్వారా 1,13,400 మంది యువతకు రాష్ట్రంలో ఉపాధి లభించాలి. కానీ అంతమందికి ఉపాధి దక్కిన జాడనే లేదు. ఎంఎస్‌ఎంఈల ద్వారా మరో 2.11 లక్షల ఉద్యోగాలు లభించాయంటూ ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అంతకుమించి యువతకు ఉపాధి కల్పించే విషయమై జగన్‌ చేసిన కొత్త ప్రయత్నం అంటూ ఏమీ లేదు.

ఇవి కాకుండా గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో వివిధ సంస్థలతో కుదిరిన రూ.13.12 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాల ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ జగన్‌ గాల్లో లెక్కలు చెప్పారు. ఆ ఒప్పందాలు వాస్తవరూపం దాల్చేది ఎప్పుడు? రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేది ఎన్నడు?


ఉపాధి నిజమైతే.. వలసలు ఎందుకు?

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల ద్వారా లక్షల మందికి ఉపాధి లభించిందని వైకాపా సర్కారు డాంబికాలు పలుకుతోంది. ప్రభుత్వం చెప్పినట్లు స్థానికంగా ఉపాధి లభిస్తే లక్షల మంది గల్ఫ్‌ దేశాలకు వలస పోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి గల్‌్్ఫ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.  రాష్ట్రం నుంచి వలస వెళ్లేవారి సంఖ్య ఏటా సుమారు 5 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.


గొప్పలు మినహా మేలు సున్నా..

రాష్ట్రంలో ఏర్పాటుచేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా ప్రభుత్వం ‘ఏపీ ఎంప్లాయిమెంట్ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్్స ఇన్‌ ది ఇండస్ట్రీస్‌/ఫ్యాక్టరీస్‌ చట్టం-2019’ తీసుకొచ్చింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంతంలో మానవ వనరులు అందుబాటులో లేకుంటే.. మానవ వనరులు ఎంత వ్యవధిలో అవసరమో తెలుసుకుని ప్రభుత్వమే శిక్షణ ఇప్పిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువస్తుంది. కానీ, చట్టం రూపొందించామని జగన్‌.. గొప్పగా చెప్పుకోవడం మినహా దీని వల్ల నిరుద్యోగ యువతకు పెద్దగా మేలు జరిగింది ఏమీ లేదు.


ఆదేశించడం తప్ప.. ఆచరణలో పెట్టలేదు..

పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి కల్పించే చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్లకు హుకుం జారీ చేయడం తప్పించి ఈ ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. పరిశ్రమలు తమ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకున్నాయేగానీ.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.

  • ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసే సంస్థ.. తమకు ఎలాంటి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అవసరం అనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటి వరకు ఏర్పాటైన పరిశ్రమలు ఆ విధానాన్నే పాటించలేదు.. నియామకాలు కూడా చేపట్టలేదు.
  • ప్రస్తుతం ఉన్న సంస్థలు.. తమ దగ్గర ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? వారిలో స్థానికులు 75 శాతం మేరకు ఉన్నారా? అన్న వివరాలను నోడల్‌ ఏజెన్సీకి సమర్పించాలి. పరిశ్రమల శాఖకు సంస్థలు ఆ వివరాలు అందించిన దాఖలాలే లేవు.
  • నియామకాలకు సంబంధించి జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలలకు ఓ సారి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది నిబంధన.  దీన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని