అధిక పింఛను ఆశావహులకు ఊరట..!
ఈపీఎఫ్‌వో అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు, పింఛనుదారులు పేరా 26(6)కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయకున్నా, తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
పేరా 26(6) ఉమ్మడి ఆప్షన్‌పై వెనక్కు తగ్గిన ఈపీఎఫ్‌వో
గతంలో దరఖాస్తు చేయకున్నా తాజాగా ఇచ్చేందుకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్‌వో అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు, పింఛనుదారులు పేరా 26(6)కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేయకున్నా, తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు శుక్రవారం ఈపీఎఫ్‌వో జోనల్ కార్యాలయాల అదనపు పీఎఫ్ కమిషనర్లు, ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల్లో ఇచ్చిన వెసులుబాటుపై కొంత స్పష్టత కరవైందని గుర్తించిన కేంద్ర పీఎఫ్ కార్యాలయం ఆవెంటనే సర్క్యులర్‌ను ఈపీఎఫ్‌వో పోర్టల్ నుంచి తొలగించింది. త్వరలోనే మరింత స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇస్తామని తెలిపింది.
ప్రస్తుతం ఏం జరుగుతోంది...?
అధికవేతనంపై చందాకోసం 26(6) కింద చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు. కానీ ఉద్యోగులు, యజమానులూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లిస్తూ వచ్చారు. చందా చెల్లించినప్పుడు ఈపీఎఫ్‌వో అనుమతించింది. ఆ నగదుపై వడ్డీని జమ చేసింది. కానీ అధిక పింఛను దరఖాస్తు సమయంలో పేరా 26 (6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టు ఆధారాన్ని తప్పనిసరి జతచేయాలని ఆదేశించింది. అధిక పింఛను దరఖాస్తులను పరిష్కరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది పేరా26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఆధారం జతచేయలేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన మొదలైనప్పటి నుంచి ఇప్పటికి ఒక్క ఉద్యోగి కూడా అధిక పింఛనుకు అర్హత పొందలేదని ఈపీఎఫ్‌వో సిబ్బంది ఇటీవల కార్మికశాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఈపీఎఫ్‌వో పెట్టిన కఠిన నిబంధనలపై ఉద్యోగులు, పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుంటే, అధిక వేతనంపై ఈపీఎఫ్ చందాను ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. పేరా 26(6) కింద ఆధారాన్ని సాకుగా పేర్కొని అధిక పింఛనుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. అయితే 2015 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛనుకు అనుమతించినప్పుడు అధికవేతనంపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్ చందాను చెల్లించినప్పుడు ఆ వివరాలు ఈపీఎఫ్ వద్ద అప్‌డేట్ అయితే ఉద్యోగి నుంచి పేరా 26(6)కింద ఉమ్మడి ఆప్షన్ అడగడానికి వీల్లేదని 2019లో ఈపీఎఫ్‌వో జారీచేసిన ఆదేశాలను చూపిస్తున్నాయి. దీంతో ఈపీఎఫ్‌వో పేరా 26(6)పై వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇలా..
* రూ.15 వేలకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆ మేరకు ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి. ఈ ఆప్షన్‌ను యజమాని ద్వారా సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి. అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్నపుడు, ఆ మేరకు ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనల మేరకు పరిపాలన ఛార్జీలు చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు యజమాని ధ్రువీకరణ ఇవ్వాలి.
* ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తును ప్రాంతీయ కార్యాలయాల్లో డిజిటల్ రూపంలో పొందుపరచాలి. సహాయ పీఎఫ్ కమిషనర్ ఆపైస్థాయి అధికారులు ఆ దరఖాస్తును అనుమతించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన వారం రోజుల్లో అధికవేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలి.
* ఈపీఎఫ్ పథకంలో కొత్తగా చేరబోయే సభ్యులు, ఇప్పటికే సభ్యులుగా కొనసాగుతూ భవిష్యత్తులో గరిష్ఠ వేతనపరిమితి దాటి వేతనం పొందుతున్నపుడు ఆ మేరకు చందా చెల్లించదలిచిన సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి.
* ప్రస్తుతం అధికవేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ, గతంలో పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని సభ్యులు, తమ యాజమాన్యాల ద్వారా క్లెయిమ్‌ల తుది సెటిల్‌మెంట్ వరకు ఇవ్వవచ్చని తెలిపింది. అయితే క్లెయిమ్ తుదిసెటిల్‌మెంట్ పదంపై ప్రాంతీయ కార్యాలయాల నుంచి వెలువడిన సందేహాల మేరకు ప్రస్తుతం శుక్రవారం వెలువరించిన సర్క్యులర్‌ను పోర్టల్ నుంచి తాత్కాలికంగా తొలగించింది.
ఏమిటీ పేరా 26 (6)?
ఈపీఎఫ్‌వో చట్టం ప్రకారం గరిష్ఠ వేతన పరిమితి 2014 సెప్టెంబరు 1కి ముందు రూ.6500, ఆ తరువాత రూ.15 వేలుగా ఉంది. చట్టంలోని నిబంధనల ప్రకారం గరిష్ఠ వేతన పరిమితికి మించి పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యాజమాన్యాలు వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26 (6) కింద ఈపీఎఫ్‌వో నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. ఉద్యోగి, యజమాని కలిసి అధికవేతనంపై చందా చెల్లించడానికి అంగీకరిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామంటూ సహాయ పీఎఫ్ కమిషనర్‌కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి.
పింఛను లెక్కింపు వేతనం ఖరారు
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛను అర్హత వేతన లెక్కింపు విధానంపై ఈపీఎఫ్‌వో స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-95 నిబంధనల మేరకు పింఛను లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ (పింఛన్లు) అప్రజిత జగ్గీ ఆదేశాలు (పింఛను/ఎస్‌సీ/అధికపింఛను/2022/1357) జారీ చేశారు.
* అధిక పింఛనుకు అర్హత లభిస్తే... 2014 సెప్టెంబరు 1కి కన్నా ముందు నుంచి పింఛను పొందేందుకు అర్హులైన పింఛనుదారులకు పదవీ విరమణ చేసేనాటికి చివరి 12 నెలల వేతన (మూల వేతనం+డీఏ)సగటు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
* 2014 సెప్టెంబరు 1 తరువాత పింఛను పొందేందుకు అర్హత పొందితే.. ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి చివరి 60 నెలల (అయిదేళ్లు) వేతన (మూల వేతనం+డీఏ) సగటు తీసుకుంటామని వెల్లడించింది.
20 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి...
అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు సంబంధిత పీఎఫ్ కార్యాలయాల సహాయకుల లాగిన్‌లోకి వచ్చిన 20 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించింది. ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులపై జోనల్ కార్యాలయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సకాలంలో డిమాండ్ నోటీసులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Flipkart: ‘బిగ్ బిలియన్ డేస్’ యాడ్.. ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌పై కాయిట్ ఫిర్యాదు
-
Bandi Sanjay: ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు?: బండి సంజయ్
-
Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం
-
Newsclick: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్
-
Ravi Teja: టైగర్ Vs టైగర్.. రవితేజ ఏమన్నారంటే?