కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి వీడలేదు

పోలింగ్‌ రోజు సమీపిస్తున్నా కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మండిపడ్డారు.

Updated : 10 May 2024 06:07 IST

పోలింగ్‌ రోజు సమీపిస్తున్నా వారిది అదే ధోరణి
సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలింగ్‌ రోజు సమీపిస్తున్నా కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనైనా ఉద్యోగులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించకుంటే వారిని ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరుల్లో ఎన్నికలు ముగిసేవరకు రోజూ ఠాణాకు రావాలని పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వందల మందికి నోటిసులిచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడలో సీఎఫ్‌డీ ఆధ్వర్యంలో ‘ఓటు రక్షించుకో-ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకో’ అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రమేశ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

‘రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సుమారు 3లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌కి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఉద్యోగుల పోస్టల్‌ ఓటింగ్‌ను సమర్థంగా నిర్వహించని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆధ్వర్యంలోని యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలను ఎలా సజావుగా జరుపుతుంది? సీఈఓ యంత్రాంగం పూర్తిగా నిద్రావస్థలో ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓటు వేయించే ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బందికే ఈ దుస్థితి రావడంపై సీఈఓ ఏం సమాధానం చెబుతారు’ అని రమేశ్‌కుమార్‌ ప్రశ్నించారు. కొంతమంది ప్రలోభాలకు లోనై ఓటు వేస్తే.. ఓటు వేయకుండా అశ్రద్ధ, బద్ధకం, నిర్లక్ష్యం, నిస్తేజంతో ఉంటే పరమ దుర్మార్గులే పాలకులు అవుతారని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు. నిరుద్యోగం, పేదరికం, అసమానతలు, నిరక్షరాస్యత, అవినీతిని రూపుమాపే శక్తులను గెలిపించాలని సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. ఓటింగ్‌లో పట్టణవాసుల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం వికసిస్తుందని ప్రముఖ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు