రైతులకు చేరువయ్యేలా ఆవిష్కరణలు

సాంకేతిక రంగంలో వచ్చే ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలని, అవి వారి కష్టాలను తగ్గించేలా ఉండాలని యువ ఇంజినీర్లను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 10 Jun 2023 05:22 IST

విద్యార్థులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ఉద్బోధ

ఈనాడు, అమరావతి: సాంకేతిక రంగంలో వచ్చే ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలని, అవి వారి కష్టాలను తగ్గించేలా ఉండాలని యువ ఇంజినీర్లను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ‘పంటలు కాపాడుకునేందుకు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవటం, సాంకేతిక పద్ధతుల్లో మందుల పిచికారీ విధానాలు, పంట నూర్పిళ్లకు యంత్రాలు వినియోగించేలా సాంకేతిక పద్ధతులను రైతులకు పరిచయం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు నగర శివారు ఆర్వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన 8వ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ‘మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికే కాకుండా దేశానికి, సమాజానికీ ఉపయోగపడేలా విద్యార్థుల డిగ్రీలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. మహిళలు సాంకేతిక విద్యలోనూ అబ్బాయిలతో పోటీగా విద్యనభ్యసించడం శుభపరిణామమన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు సభలో హుందాగా వ్యవహరించాలని, ఈ దిశగా వారికి రాజకీయ పాఠ్యాంశాలు, శిక్షణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ‘బూతులు మాట్లాడే వారికి పోలింగ్‌ బూత్‌లో ఓటుతో బుద్ధి చెప్పండి. బ్యాలెట్‌ అనేది బుల్లెట్‌ కన్నా చాలా శక్తిమంతమైంది. యువతను కార్యోన్ముఖులను చేయడానికి దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నాను’అని అన్నారు. తాను పదవీ విరమణ మాత్రమే చేశానని, పెదవీ విరమణ చేయలేదని మరోసారి పునరుద్ఘాటించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఏఎన్‌యూ ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ మాట్లాడారు. కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ కొల్లా శ్రీనివాస్‌, డాక్టర్‌ గోపాలకృష్ణమూర్తి, జాగర్లమూడి కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని