Vizianagaram Train Accident: ఆ సమయంలో ఏం జరిగింది?

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) నేతృత్వంలో విచారణ మొదలైంది.

Updated : 31 Oct 2023 08:01 IST

విద్యుత్తు సరఫరా నిలిచి ఆగిన పలాస రైలు
ఆ వెనుకే 80 కి.మీ.వేగంతో వచ్చిన రాయగడ ప్యాసింజర్‌
రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీఆర్‌ఎస్‌

ఈనాడు, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) నేతృత్వంలో విచారణ మొదలైంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ రైల్వే స్టేషన్ల మధ్య భీమాలి వద్ద ఆగి ఉన్న పలాస రైలును వెనుక నుంచి రాయగడ ప్యాసింజర్‌ ఢీకొన్న నేపథ్యంలో దిల్లీ, భువనేశ్వర్‌ నుంచి నిపుణుల కమిటీ సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీసింది.  కేబుళ్లకు విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో పలాస రైలు ముందుకు కదల్లేదని ప్రాథమిక పరిశీలన అనంతరం గుర్తించినట్లు సమాచారం. ఆ విషయం సమీప స్టేషన్లకు చేరకపోవడంతో అదే ట్రాక్‌పైకి రాయగడ రైలు వెళ్లేందుకు సిగ్నల్‌ ఇవ్వడం ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పలాస రైలును రాయగడ ప్యాసింజర్‌ ఢీకొన్నప్పుడు దాని వేగం 80 కి.మీ. వరకు ఉండొచ్చని, ఒక్కసారిగా అంత వేగాన్ని నియంత్రించడమూ సాధ్యం కాదంటున్నారు. ఈ రెండు రైళ్ల మధ్య ప్రయాణ కాల వ్యత్యాసం  పది నిమిషాలే ఉన్నా..ఆ సమయం ఎక్కువేనని చెబుతున్నారు.

అన్ని కోణాల్లో: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సిగ్నలింగ్‌ ఇలా పలు విభాగాలకు చెందిన నిపుణుల కమిటీ.. అన్ని కోణాల్లో ఈ ఘటనపై విశ్లేషిస్తోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్‌) తనిఖీ చేశారు. రైల్వే ఐజీ, డీఐజీలు ప్రత్యేక బృందాలతో పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి. విద్యుత్తు సరఫరా ఆగిపోవడం వెనుక విద్రోహుల దుశ్చర్య ఏమైనా ఉందా అని విశ్లేషిస్తున్నారు.

కోణార్క్‌కు తప్పిన ముప్పు: విశాఖ నుంచి బయలుదేరిన కోణార్క్‌ కంకటాపల్లికి చేరుకోవడానికి కొద్ది నిమిషాలకు ముందు భీమాలి వద్ద ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలియడంతో సత్వరమే స్పందించి వెంటనే కంకటాపల్లిలో కోణార్క్‌ను నిలిపేశారు. లేకుంటే ఘోర ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు.

గూడ్సు రైళ్లు లేకుంటే: ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్‌ రైళ్లకు రెండు వైపులా గూడ్సు రైళ్లు లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ఆగి ఉన్న గూడ్సును ఢీకొని అక్కడితో ఆగిపోవడంతో ప్రమాదం రెండు, మూడు బోగీలకే పరిమితమైంది.  


ఆదివారం కావడంతో రైళ్లలో తక్కువగా రద్దీ

ఈనాడు-విశాఖపట్నం, ఎస్‌.కోట-న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలిలో ధ్వంసమైన బోగీలను చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతుంది. రైలు బోగీలు ఒకదానిౖకి ఒకటి ఢీకొనడం.. పక్కనే ఉన్న గూడ్సు రైళ్లపైకి దూసుకువెళ్లడంతో ఇనుప బోగీలు సైతం అట్టపెట్టెల్లా నలిగిపోయాయి. ఈ ఘటనలో ఏడు బోగీలు దెబ్బతిన్నాయి. ఆదివారం రాత్రి ప్రమాదం తరవాత చిమ్మచీకటిలో సహాయక చర్యలు అనుకున్నంత వేగంగా సాగలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12మంది మృతదేహాలను సంఘటనా స్థలంలో వెలికితీశారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం ఉదయం ప్రమాదానికి గురైన బోగీలను తొలగిస్తే మరింత ప్రాణ నష్టం ఉండొచ్చని అందరూ అనుకున్నా...మృతుల సంఖ్య 13కు పరిమితం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాణ నష్టం అందుకే తగ్గింది

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తగ్గడానికి పలు కారణాలున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. పలాస ప్యాసింజర్‌ రైల్లో దెబ్బతిన్న మూడు బోగీల్లో ఒకటి గార్డు బోగీ. వెనుక నుంచి పలాస రైలును ఢీకొట్టిన రాయగడ రైల్లో నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి. ఈ రైలుకు ముందు రెండు ఇంజిన్లు ఉండటంతో అవి తొలుత దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఉన్న దివ్యాంగుల బోగీలో ఇద్దరు ముగ్గురే ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి విశాఖ నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే కార్మికులు, ఉద్యోగుల తాకిడి నిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆదివారం కావడంతో రద్దీ చాలా తక్కువగా ఉంది.

మూడు మార్గాలు ధ్వంసం: విశాఖపట్నం నుంచి కొద్ది నిమిషాల తేడాతో విజయనగరం వైపు బయలుదేరిన పలాస, రాయగడ రైళ్లు ఒకే ట్రాక్‌పై ఉన్నాయి. ప్రమాదం జరిగిన భీమాలి వద్ద మూడు రైలు మార్గాలున్నాయి. పలాస, రాయగడ రైళ్లు మధ్య మార్గంలో ఉన్నాయి. ఈ రైళ్ల బోగీలు ప్రమాదం తరువాత...రెండు వైపులా ఆగి ఉన్న గూడ్సు రైళ్లపై పడ్డాయి. దీంతో ఈ మూడు మార్గాలూ దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరా వ్యవస్థ సైతం ధ్వంసమైంది. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత 47 రైళ్లు రద్దు చేసి...24 రైళ్లను దారి మళ్లించారు.

19 గంటల్లో రైళ్ల రాకపోకల పునరుద్ధరణ

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే అధికారులంతా అప్రమత్తమయ్యారు. వెంటనే సిబ్బంది మొత్తం విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. అరగంటలో డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌, ఇతర సాంకేతిక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దివ్యాంగుల బోగీలో మృతదేహాలు ఉండటంతో ట్రాక్‌ పునరుద్ధరణ చర్యల్లో కొంత జాప్యం జరిగింది. మృతదేహాలను బయటకు తీసి తరలించే వరకు బోగీలను ట్రాక్‌పైనే ఉంచారు. ఆ తర్వాత హుటాహుటిన ప్రమాద స్థలంలో రైళ్ల బోగీలను తొలగించి, ట్రాక్‌లను సిద్ధం చేశారు. మొత్తంగా యుద్ధ ప్రాతిపదికన 19 గంటల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. తూర్పు కోస్తా రైల్వే మేనేజర్‌ మనోజ్‌శర్మ, ఇతర సీనియర్‌ అధికారులు పనులన్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. రైళ్ల సేవల పునరుద్ధరణకు దాదాపు వెయ్యి మంది కార్మికులు, వివిధ విభాగాల సూపర్‌వైజర్లు, సిబ్బంది నిర్విరామంగా పని చేశారు.

హావ్‌డా-చెన్నై రైల్వే ప్రధాన మార్గంలో భద్రతపై విస్తృత సమీక్ష జరపాలని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కోరారు. ఈ మేరకు రైల్వేశాఖకు సోమవారం ఆయన లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని