సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?

‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు.

Updated : 06 May 2024 06:28 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో మధ్యతరగతి చిన్న కమతాల వారికి ఇబ్బందే
టీఆర్‌ఓగా ఎవరినైనా నియమించడం చట్టంలో తీవ్రమైన లోపం
భూవివాదాలు స్థానిక సివిల్‌కోర్టుల్లో పరిష్కరించుకునే వీలు లేదు
హైకోర్టును ఆశ్రయించాల్సిందే
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుంటూరు లీగల్‌: ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. భూవివాదాలు వచ్చినప్పుడు స్థానిక సివిల్‌ న్యాయస్థానాల్లో పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడంతో అందరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సామాన్యులు, నిరక్షరాస్యులకు ఈ చట్టం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది’ అని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ చట్టం లోపభూయిష్ఠంగా ఉండడం వల్ల భవిష్యత్తులో సమాజంలో విపరిణామాలు చోటుచేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. ‘టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా (టీఆర్‌వో) ఎవరినైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండడమే చట్టంలో తీవ్రమైన లోపం. నీతి ఆయోగ్‌ సూచించిన విధివిధానాలను పూర్తిగా పొందుపరచకుండా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం వల్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది’ అని ఆయన తెలిపారు.

‘చాలామందికి చిన్న చిన్న కమతాలే ఉన్నందున ఈ చట్టంపై అందరికీ అవగాహన లేక పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. దూరప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నవారికి మరీ ఇబ్బందులు రావచ్చు. ఆస్ట్రేలియాలో అమలవుతున్న ఈ చట్టాన్ని.. ఇక్కడ అమలు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకుని బీమా ద్వారా రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ప్రభుత్వ పరంగా అలాంటి వెసులుబాటును చట్టంలో పేర్కొనలేదు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా ఎవరినైనా ప్రభుత్వం నియమించుకోవచ్చనే నిబంధన మరీ ప్రమాదకరమైంది. దీని ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వారికి అనుకూలమైన వారిని టీఆరోవోగా నియమించుకోవచ్చు. దీనికి ఎలాంటి అర్హతలు, విధానాలు నిర్దేశించలేదు. ఈ అధికారులకు నిర్ణీత కాలపరిమితి కూడా లేదు. ఎవరినైనా నియమించుకోవచ్చనే అంశమే చట్టవిరుద్ధం. దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఈ చట్టంపై బాధితులకు అవగాహన లేకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. టీఆర్‌వో వెలువరించిన నిర్ణయంపై కాలపరిమితి లోపల మేల్కొనకపోతే ఆస్తులు కోల్పోవచ్చు. మధ్యతరగతి, చిన్న చిన్న కమతాలు ఉన్నవారు, గ్రామీణులు ఇబ్బందులు ఎదుర్కొంటారు’ అని విశ్రాంత న్యాయమూర్తి పేర్కొన్నారు.

అధికారుల చేతుల్లోకి చట్టం

‘ఇప్పటికే అమలులో ఉన్న పలు చట్టాలకు ఏపీ భూయాజమాన్య హక్కు చట్టంలో రూపొందించిన నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి. వందేళ్ల క్రితం నుంచి దేశంలో అమలులో ఉన్న సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని నిబంధనలు ఈ చట్టం పరిధిలోకి తీసుకురాలేదు. దీంతో టీఆర్‌వో విధి విధానాలపై స్పష్టత లేదు. ఇప్పటివరకు స్వల్ప స్థాయి భూవివాదాలను స్థానిక కోర్టుల్లోనే పరిష్కరించుకుని బాధితులు ఉపశమనం పొందుతున్నారు. ఈ చట్టం ద్వారా బాధితులు హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలి. దీనివల్ల హైకోర్టులో మరింత పనిభారం పెరిగి వివాదాల పరిష్కారానికి జాప్యం జరగడంతో పాటు బాధితులపై మోయలేని ఆర్థికభారం పడుతుంది. హైకోర్టు దాకా వెళ్లలేని సామాన్యులు నిస్సహాయస్థితిలో వారి ఆస్తులపై హక్కులను వదులుకోక తప్పదు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా నియమితులయ్యే వ్యక్తికి ఎలాంటి అర్హతా నిర్ధారించకపోవడంతో వారికి భూహక్కులు, చట్టాలపై కనీస అవగాహన ఉండే అవకాశం లేదు. దీంతో బాధితులకు న్యాయపరమైన రక్షణ, భరోసా కల్పించే అవకాశం తక్కువ. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం’ అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని