ప‌న్ను త‌గ్గించుకునేందుకు 6 సుల‌భ‌ మార్గాలు 

సెక్ష‌న్ 80సి ప్ర‌కారం అన్నింటిలోనూ క‌లిపి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌చ్చు. 

Updated : 12 Oct 2021 17:18 IST

ప‌న్ను భారం త‌గ్గించుకోవ‌డం ఎలా? అని ప్ర‌తీ ప‌న్ను చెల్లింపుదారుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకు అనేక మార్గాల‌ను అన్వేషిస్తూనే ఉంటాడు. అయితే ఇక్క‌డ ఒక్క‌ విష‌యం గుర్తుపెట్టుకోవాలి. ప‌రిమితికి మించిన ఆదాయం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సిందే. అయితే ప‌న్ను భాద్య‌త‌ను త‌గ్గించుకోవ‌చ్చు. 

ప‌న్ను ఆదా అనేది చెల్లింపుదారుడు చేసే పెట్టుబ‌డులు, ఖ‌ర్చులతో ముడిప‌డి ఉంటుంది. అందువ‌ల్ల ప్ర‌తీ సంవ‌త్స‌రం ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌లో మ‌దుపు చేయ‌డం, ఖ‌ర్చు చేయ‌డం ద్వారా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌చ్చు. 

ప‌న్ను ఆదా కోసం మార్గాలు..
1.ప్లాన్ చేయండి.. పెట్టుబ‌డి పెట్టండి..
ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం నిర్థిష్ట పెట్టుబ‌డుల‌లో పెట్టుబ‌డి పెడితే సెక్ష‌న్ 80సి ప్ర‌కారం రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మినహాయింపు పొంద‌వ‌చ్చు.  పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌, ప‌న్ను ఆదా ఎఫ్‌డీలు ఇందులోకి వ‌స్తాయి.   వీటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం రూ.1.5 ల‌క్ష‌ల వర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.

2. వైద్య బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించండి..
సీనియ‌ర్ సిటిజ‌న్లు అయిన త‌ల్లిదండ్రుల‌కు సంబంధించిన మెడిక‌ల్ రికార్డుల‌ను నిర్వ‌హించడం.. బిల్లుల‌ను ఆన్‌లైన్‌లో చెల్లించ‌డం ద్వారా సెక్ష‌న్ 80డి కింద రూ. 50వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 

3. హెచ్ఆర్ఏ ప్ర‌యోజ‌నం..
మీరు అద్దె ఇంటిలో నివ‌సిస్తున్న‌ట్ల‌యితే అద్దె చెల్లించిన రిసిట్లు, అద్దె ఎగ్రిమెంట్‌ను జాగ్ర‌త్త ప‌ర‌చాలి. హెచ్ఆర్ఏను క్లెయిమ్ చేసుకోవ‌డం ద్వారా ప‌న్ను త‌గ్గించుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు ఏడాదికి రూ. 1ల‌క్ష కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్న‌ట్ల‌యితే ఇంటి య‌జ‌మాని పాన్ నెంబ‌ర్ అవ‌స‌రం అవుతుంది. 

4. ఆరోగ్య బీమా..
మీ, మీ కుటుంబ స‌భ్యుల కోసం ఆరోగ్య బీమా తీసుకుంటే.. వైద్య ఖ‌ర్చుల‌కు ఆర్థిక భ‌ద్ర‌త‌తో పాటు సెక్ష‌న్ 80డి ప్ర‌కారం ప్రీమియంపై మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

5. ప‌న్ను ఆదా మ్యూచువ‌ల్ ఫండ్లు..
వివిధ ప‌న్ను ఆదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా రాబ‌డితో పాటు ప‌న్ను మిన‌హాయింపు  ప్ర‌యోజ‌నం కూడా ల‌భిస్తుంది. ప‌న్ను ఆదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ముఖ్య‌మైన‌ది ఈక్విటీ-లింక్డ్ పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్) ఎక్కువ భాగం ఈక్విటీ సాధ‌నాల్లో పెట్టుబడి పెట్టే వైవిధ్యమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఆదాయ‌ పన్నుచట్టం, 1961 సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.1 లక్ష కంటే ఎక్కువ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తారు. 

6. నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌)..
ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా సెక్ష‌న్ 80సి కింద ల‌భించే మిన‌హాయింపుతో పాటు సెక్ష‌న్ 80సిసిడి(1బి) ప్ర‌కారం రూ.50వేల వ‌ర‌కు అద‌న‌పు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.  దీర్ఘ‌కాలంపాటు పొదుపు అల‌వాటుతో ప్ర‌జ‌లు సంప‌ద సృష్టించుకోవాల‌నే ఉద్దేశ్యంతో భార‌త ప్ర‌భుత్వం నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త‌కు, మార్కెట్ ఆధారిత రాబ‌డుల‌ను ఎన్‌పీఎస్‌ అందించ‌గ‌ల‌దు. పింఛ‌ను నిధి నియంత్ర‌ణ‌, ప్రాధికార‌, అభివృద్ధి సంస్థ‌(పీఎఫ్ఆర్‌డీఏ) ఈ ప‌థ‌కాన్ని నియంత్రిస్తుంది.ఈ ప‌థ‌కంలో 18 నుంచి 65ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులోని వారు చేర‌వ‌చ్చు. 70ఏళ్ల దాకా కొన‌సాగించ‌వ‌చ్చు. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts