Alibaba: ‘మా’ట ఖరీదు.. 344 బిలియన్‌ డాలర్లు..!

కాలు జారితే తీసుకోగలం.. కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం సరికదా దాని పర్యవసనాలు కూడా అనుభవించాల్సిందే..! చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ

Updated : 26 Oct 2021 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలు జారితే తీసుకోగలం.. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం సరికదా దాని పర్యవసనాలు కూడా అనుభవించాల్సిందే..! చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు ఎదురైన పరిస్థితి ఇలాంటిదే. సరిగ్గా ఏడాది క్రితం అనాలోచిత వ్యాఖ్యలు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు జాక్‌ మా. చైనా పాలకుల ఆగ్రహానికి గురై భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. మరి ఆ మాట ఖరీదు ఎంతో తెలుసా.. 344 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 25లక్షల కోట్లకు పైమాటే..!

అది 2020 అక్టోబరు 24.. చైనాలో ‘ది బండ్ సమిట్‌’ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాక్ మా ఓ ప్రసంగం చేశారు. అందులో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. 

అసలే చైనాలో ఉన్నది జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ. అందులోనూ జాక్‌ మా చేసిన వ్యాఖ్యలు నేరుగా జిన్‌పింగ్‌ను తాకాయి. మరి ప్రభుత్వం ఊరికే ఎలా ఉంటుంది. ప్రతీకారం మొదలుపెట్టింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. జాక్‌ స్థాపించిన యాంట్‌ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా షేర్లు కూడా పతనమవుతూ వచ్చాయి. ఇంకేముంది.. అలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా నికర సంపద కూడా హారతికర్పూరంలో కరగడం మొదలుపెట్టింది. 

ఎంతలా అంటే ఏడాది కాలంలో అలీబాబా తన మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. ఒక్క అలీబాబానే కాదు.. దాని అనుబంధ సంస్థల షేర్లు కూడా భారీగానే పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ విలువ కూడా ఒక ఏడాదిలో ఈ స్థాయిలో కరగలేదంటే.. చైనా పాలకుల చర్యలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని