Amazon: అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఫ్యూచర్‌తో డీల్‌ నిలుపుదల!

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్‌ గ్రూప్‌తో 2019లో కుదిరిన ఒప్పందాన్ని కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిలుపుదల చేసింది.

Updated : 17 Dec 2021 22:20 IST

దిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్‌ గ్రూప్‌తో 2019లో కుదిరిన ఒప్పందానికి గతంలో ఇచ్చిన అనుమతిని కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సస్పెండ్‌ చేసింది. రెగ్యులేటరీ అనుమతి కోరే సమయంలో అమెజాన్‌ కొన్ని వివరాలను దాచిపెట్టిందని సీసీఐ పేర్కొంది. డీల్‌ను మళ్లీ కొత్తగా పరిశీలించాల్సి ఉందని 57 పేజీల లేఖలో పేర్కొంది. అప్పటి వరకు ఈ డీల్‌ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా విధించింది. ఫ్యూచర్ గ్రూప్‌ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టింది.

ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో 2019లో అమెజాన్‌ 200 మిలియన్‌ డాలర్ల మేర (49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. అంటే పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌కు కూడా యాజమాన్య హక్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది. దీంతో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఫ్యూచర్‌ గ్రూప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని