అమెజాన్‌ 4 కోట్ల డాలర్లు అడిగింది

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలంటే 4 కోట్ల డాలర్లు (దాదాపు రూ.290.41 కోట్లు) పరిహారం ఇవ్వాలని అమెజాన్‌ కోరిందని ఫ్యూచర్‌ గ్రూప్‌ తెలిపింది. ఒప్పందం గురించి ముందుగా చెప్పలేదనడం సబబు ...

Published : 16 Feb 2021 01:00 IST

లావాదేవీకి ముందే పరిహారం కోరింది
ఒప్పందం గురించి తెలియదనడం సరికాదు
ఎస్‌ఐఏసీకి ఫ్యూచర్‌ గ్రూప్‌ వెల్లడి

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలంటే 4 కోట్ల డాలర్లు (దాదాపు రూ.290.41 కోట్లు) పరిహారం ఇవ్వాలని అమెజాన్‌ కోరిందని ఫ్యూచర్‌ గ్రూప్‌ తెలిపింది. ఒప్పందం గురించి ముందుగా చెప్పలేదనడం సబబు కాదని సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌(ఎస్‌ఐఏసీ)కు చెందిన అత్యవసర మధ్యవర్తిత్వదారు(ఈఏ)కు దాఖలు చేసి పత్రాల్లో ఫ్యూచర్‌ పేర్కొంది. గతేడాది అక్టోబరులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. అమెజాన్‌కు ఆర్‌ఐఎల్‌తో ఫ్యూచర్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం గురించి ముందే తెలుసు. ఆగస్టు 2020లో కిశోర్‌ బియానీ, రాకేశ్‌ బియానీ, అమెజాన్‌.కామ్‌ ఎన్‌వీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ప్రతినిధి అభిజీత్‌ మజుందార్‌ల మధ్య రెండు ఫోన్‌ కాల్స్‌ జరిగాయి. ఆ సమయంలో రిలయన్స్‌, ఫ్యూచర్‌ మధ్య ఒప్పందానికి పరిహారంగా 4 కోట్ల డాలర్లను కోరార’ని ఆ పత్రం వెల్లడించింది. ‘వివాద్పాద లావాదేవీ గురించి ఎటువంటి సమాచారం తమ వద్ద లేదనడం సరికాదు. ఇ మెయిళ్లు, కాల్స్‌, మెసేజ్‌లను పక్కనపెడితే ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టడానికి ఒక నెల కంటే ముందే లావాదేవీ గురించి ఆ కంపెనీకి తెలుసున’ని పీటీఐకి లభించిన ఆ పత్రం నకలులో ఉంది.
ఖండించిన అమెజాన్‌
కాగా,  అమెజాన్‌ ప్రతినిధి ఫ్యూచర్‌ ఆరోపణలను ఖండించింది. తొలి తిరస్కరణ హక్కును పక్కనపెట్టేందుకు పరిహారం కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన విజ్ఞప్తి విషయంలో ‘తప్పుడు, తప్పుదోవ పట్టించే విధంగా ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాఖ్యానించింద’ని అన్నారు. అమెజాన్‌ సుప్రీం కోర్టులో ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు ప్రశ్నార్ధంగా, ప్రజలను తప్పుదోవ పటించే విధంగా ఉన్నాయని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని