సౌదీలో మరో విమానయాన సంస్థ

చాలా దేశాల విమాన ప్రయాణికులకు అనుసంధాన దేశంగా ఉన్న సౌదీ అరేబియా, ఒక జాతీయ విమానయాన సంస్థను ఏర్పాటు చేయనుంది.

Updated : 03 Jul 2021 01:43 IST

ఎమిరేట్స్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు పోటీ

ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి

చమురు ఆదాయాల క్షీణత నేపథ్యం

చాలా దేశాల విమాన ప్రయాణికులకు అనుసంధాన దేశంగా ఉన్న సౌదీ అరేబియా, ఒక జాతీయ విమానయాన సంస్థను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత గల్ఫ్‌ విమానయాన సంస్థలైన ఎమిరేట్స్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌లకు పోటీగా అంతర్జాతీయ మార్గాల్లో కొత్త సంస్థ విమానాలు సందడి చేయనున్నాయి. అంతర్జాతీయ ట్రాన్సిట్‌ ప్రయాణికుల రద్దీని సద్వినియోగం చేసుకునేలా ఈ సంస్థ కార్యకలాపాలు ఉండాలన్నది సౌదీ ప్రణాళిక. దేశానికి ముడి చమురు ఆదాయాలు పడిపోతుండడంతో, ఆర్థిక వ్యవస్థను విస్తరించడం కోసం సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఒక రవాణా కార్యక్రమాన్ని ఇటీవలే ప్రకటించారు. అంతర్జాతీయంగా విమానయానంలో ఆరో స్థానంలో ఉన్న సౌదీని అయిదో అతిపెద్ద ఎయిర్‌ ట్రాన్సిట్‌ హబ్‌గా మార్చాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. పర్యాటకం, ఇతరత్రా పరిశ్రమల ద్వారా విదేశీ మూలధనాన్ని ఆకర్షించాలని మహమ్మద్‌ భావిస్తున్నారు. 2019లో సౌదీకి 4 కోట్ల మంది పర్యాటకులు రాగా, 2030 నాటికి వీరి సంఖ్యను 10 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. కొత్త సౌదీ విమానయాన సంస్థ రియాద్‌ నుంచి పనిచేయవచ్చని, సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ పీఐఎఫ్‌ ఈ కంపెనీ ఏర్పాటులో సహకరించవచ్చని ఈ విషయాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ తెలిపింది.

* సౌదీ అరేబియాలో ప్రభుత్వ రంగానికి చెందిన సౌదీ అరాబియాతో పాటు దాని అనుబంధ సంస్థ ఫ్లైడీల్‌ విమానయాన సంస్థలు ఉన్నప్పటికీ, ఇవి దేశీయ సేవలకే పరిమితమయ్యాయి. అందుకే కొత్త సంస్థతో అంతర్జాతీయ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకోనున్నారు.


గయానా నుంచి ముడిచమురు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌

దిల్లీ: ముడిచమురు కోసం గల్ఫ్‌ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రత్నామ్నాయాలు అన్వేషించాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) తొలి సారిగా ముడి చమురు కొనుగోలు చేసింది. ‘గయానా నుంచి ఒక సూయిజ్‌మాక్స్‌ పరిమాణంలో లిజా గ్రేడ్‌ చమురును సేకరించాం. 3 మిలియన్‌ టన్నుల అమెరికా చమురుకు ఒక టర్మ్‌ కాంట్రాక్టును సైతం కుదుర్చుకున్నామ’ని ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ ఎం. వైద్య తెలిపారు. ఒడిశాలోని పారాదీప్‌ రిఫైనరీకి గయానా చమురును కంపెనీ తీసుకురానుంది. హెచ్‌పీసీఎల్‌, ఎల్‌.ఎన్‌.మిత్తల్‌ల సంయుక్త సంస్థ హెచ్‌పీసీఎల్‌-మిత్తల్‌ ఎనర్జీ గత మార్చిలో ఒక మిలియన్‌ బారెళ్ల లిజా గ్రేడ్‌ చమురును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని