కొవిడ్‌తో బ్యాంక్‌ డిపాజిట్లు తగ్గాయ్‌

బ్యాంక్‌ డిపాజిట్లు, ప్రజల చేతిలో నగదు (కరెన్సీ హోల్డింగ్‌)పై కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించిందని ఆర్‌బీఐ వ్యాసం వెల్లడించింది.

Published : 17 Jun 2021 02:09 IST

ప్రజల చేతిలో నగదు కూడా: ఆర్‌బీఐ

ముంబయి: బ్యాంక్‌ డిపాజిట్లు, ప్రజల చేతిలో నగదు (కరెన్సీ హోల్డింగ్‌)పై కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించిందని ఆర్‌బీఐ వ్యాసం వెల్లడించింది. తొలి దశతో పోలిస్తే రెండో దశలో మహమ్మారి ధాటికి వైద్య ఖర్చుల కోసం ప్రజలు భారీగా వెచ్చించాల్సి వచ్చిందని పేర్కొంది. గృహస్థుల మొత్తం ఆస్తుల్లో బ్యాంక్‌ డిపాజిట్ల వాటా సుమారు 55 శాతం ఉండగా, 2021 ఏప్రిల్‌ ఆఖరుకు 0.1 శాతం మేర క్షీణత (నెలవారీగా) కనిపించిందని ఆర్‌బీఐ తెలిపింది. 2020 ఏప్రిల్‌లో 1.1 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. బ్యాంక్‌ డిపాజిట్లు తగ్గడంతో పాటు  రుణాలు పెరిగాయని తెలిపింది.
* 2021 ఏప్రిల్‌లో ప్రజల వద్ద కరెన్సీ హోల్డింగ్‌ కూడా గణనీయంగా 1.7 శాతం మేర తగ్గింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అంటే ఎక్కువ మంది ప్రజల చేతుల్లో ఉన్న నగదు నిల్వలు వైద్య అవసరాల కోసం ఖర్చయిపోయినట్లు తెలుస్తోందని ఆర్‌బీఐ వివరించింది.

ఇంటి వద్దకే విడిభాగాల డెలివరీ: టయోటా

దిల్లీ: టయోటా పార్ట్స్‌ కనెక్ట్‌ పథకంలో భాగంగా వినియోగదారుల ఇంటి వద్దకే వాహన విడిభాగాలను డెలివరీ చేసే సదుపాయాన్ని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తీసుకొచ్చింది. విక్రయశాలల నుంచి విడిభాగాలను తీసుకెళ్లడం లేదా ఇంటికే డెలివరీ కోరుకునే సదుపాయాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చని వెల్లడించింది. కార్‌ కేర్‌ ఎస్సెన్షియల్స్‌, ఇంజిన్‌ ఆయిల్‌, టైర్‌, బ్యాటరీ వంటి ఇతర విభాగాలనూ ఇందులో చేర్చాం. ప్రస్తుతం ఈ సేవ 12 నగరాల్లో లభిస్తుంది. ఈ ఏడాది చివరకు మరిన్ని నగరాలకు విస్తరింపజేస్తామ’ని కంపెనీ వివరించింది.  

మార్చి 24 నుంచి 200 కొత్త దివాలా దరఖాస్తులొచ్చాయ్‌: ఐబీబీఐ

దిల్లీ: ఒత్తిడికి గురైన (స్ట్రెస్డ్‌) రుణ ఆస్తుల పరిష్కారం కోసం దివాలా చట్టం కింద సుమారు 200 కొత్త దరఖాస్తులు వచ్చినట్లు ది ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ) వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం కావడంతో దివాలా స్మృతి (ఐబీసీ) కింద కొత్త నమోదును ఏడాది పాటు ఆపేయాలని 2020 మార్చి 25న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు గత మార్చి 24తో ముగిశాక, ఇప్పటివరకు 200 దివాలా దరఖాస్తులు వచ్చినట్లు ఐబీబీఐ ఛైర్‌పర్సన్‌ ఎంఎస్‌ సాహూ వెల్లడించారు. రూ.కోటికి పైగా ఎగవేత ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని పరిమితి విధించడంతో దరఖాస్తుల ప్రవాహం బాగా తగ్గిందని ఆయన తెలిపారు. ఐబీసీని అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన కీలక సంస్థే ఐబీబీఐ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని