ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడి చూశారా?

దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకమైన యాప్‌లతో వినియోగదారులకు చేరువవుతున్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం..

Published : 15 Dec 2020 21:39 IST

స్మార్ట్ ఫోన్ల వాడకం విస్తృత అవకాశాలను అందిస్తోంది. బ్యాంకులు ఈ సాంకేతికతను ఉపయోగించి మొబైల్‌ ఆప్‌లతో వినియోగదారులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొదట్లో బ్యాంకుకు వెళ్లి చేయగలిగే పనులను ఏటీఎమ్‌ల్లో చేసేందుకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా సేవలను మరింత సులభతరం చేశారు. ప్రస్తుతం మొబైల్‌ ఆప్‌లతో బ్యాంకింగ్‌ సేవలన్నింటినీ అరచేతిలో అందిస్తున్నారు. దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకమైన యాప్‌లతో వినియోగదారులకు చేరువవుతున్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

వివిధ బ్యాంకుల మొబైల్‌ ఆప్‌లు- అందుబాటులో ఉన్న సేవలు

ఐసీఐసీఐ ఐమొబైల్‌

ఐసీఐసీఐ బ్యాంక్ ఈ అప్ ద్వారా పొదుపు ఖాతా, క్రెడిట్‌ కార్డు, డీమ్యాట్‌, రుణ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలన్నీ మొబైల్‌లోనే జరిపే వెసులుబాటును అందిస్తోంది.
ప్రీమియంలను చెల్లించడంతో పాటు బిల్లు చెల్లింపులను సైతం యాప్‌ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఖాతాలో నగదు నిల్వ గురించి తెలుసుకోవడం, చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించడం దగ్గరి నుంచి యాప్‌ నుంచే వస్తువుల కోనుగోళ్లకు చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌ సౌకర్యం ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఎస్‌బీఐ ఫ్రీడమ్‌

కాస్త ఆలస్యంగా మార్కెట్లో ప్రవేశించినా దాదాపు అన్ని ఫీచర్లను వినియోగదారులకు అందించేందుకు ఎస్‌బీఐ ఫ్రీడమ్‌ యాప్‌ ప్రయత్నించింది. ఖాతాలో నగదు నిల్వ తెలుసుకోవడం, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, మినీ స్టేట్‌మెంట్‌, మొబైల్‌/డీటీహెచ్‌ రీఛార్జ్‌, కొత్త చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించడం, బిల్లు చెల్లింపులు వంటివన్నీ ఈ యాప్‌ ద్వారా చేసే వీలుంది. ఇవే కాకుండా ప్రయాణ టికెట్లను బుక్‌ చేసుకోవడం, సినిమా టికెట్లను కొనుక్కోవడం కూడా చేయవచ్చు. జావా వాడుతున్న మొబైల్స్‌ అన్నింటికీ, బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్‌(జీపీఆర్‌ఎస్‌ ఉన్నా లేకపోయినా) వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్‌ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎమ్‌కనెక్ట్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎమ్‌కనెక్ట్‌ పేరుతో మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులకు చేరువవుతోంది. ఈ ఆండ్రాయిడ్‌ ఆప్‌తో నగదు నిల్వ తెలుసుకోవడం, లావాదేవీలు జరపడం, మినీ స్టేట్‌మెంట్‌, చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించడం, సినిమా, ప్రయాణ టికెట్ల కొనుగోలు, బిల్లు చెల్లింపులు, రుణం కోసం అభ్యర్థించడం వంటివన్నీ చేయవచ్చు. ఆప్‌లో మన సౌకర్యాలను ఎవరి ప్రత్యేకతలకు అనుగుణంగా రూపొందించుకునేందుకు రెండు ప్రత్యేక సదుపాయాలను అందించారు. మీరు తరచుగా వాడే వాటిని వీటి కింద ఉంచారు.

యాక్సిస్‌ బ్యాంక్‌ ఆప్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు, ఐఫోన్‌, విండోస్‌ ఫోన్‌ వాడే వారికి యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. పొదుపు ఖాతాదారులు, ఎన్‌ఆర్‌ఐలు, కరెంటుఖాతాదారుల్లో కొన్ని రకాల వారికి ఈ యాప్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా అకౌంట్‌లో లాగిన్‌ అవ్వకముందు బ్యాంకు శాఖలు, ఏటీఎమ్‌లు ఉన్న ప్రదేశాలు, యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌,క్రెడిట్‌ కార్డు ఆఫర్లను తెలుసుకునే వీలుంది. లాగిన్‌ అయిన తర్వాత కింది సేవలను పొందవచ్చు.
క్రెడిట్‌ కార్డు, పొదుపు ఖాతా సంబంధిత సమాచారం, మినీ స్టేట్‌మెంట్లు, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, రీఛార్జీ, బిల్లు చెల్లింపులు, చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించడం, అకౌంట్‌ స్టేట్‌మెంట్‌, రివార్డు పాయింట్లు తెలుసుకోవడం వంటివి చేయవచ్చు.

సిటీ బ్యాంక్‌ ఇండియా

ఎక్కడైనా, ఎప్పుడైనా బ్యాంకింగ్‌ సేవలను పొందేందుకు వీలుగా సిటీ బ్యాంక్‌ వారు ‘సిటీ మొబైల్‌’ యాప్‌ను రూపొందించారు. ఆప్‌స్టోర్‌/గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకుని బ్యాంకింగ్‌ సేవలను పొందవచ్చు. గత 2/5 రోజుల లావాదేవీల చరిత్ర, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, చెక్కు చెల్లింపును ఆపాల్సిందిగా కోరడం, చెక్కు పుస్తకం కోసం అభ్యర్థించడం, క్రెడిట్‌ కార్డు లావాదేవీల చరిత్ర, బిల్లు చెల్లింపు, మెయిల్‌కు స్టేట్‌మెంట్‌ వచ్చేలా అభ్యర్థించడం వంటి సదుపాయాలు ఈ యాప్‌లో ఉన్నాయి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నాలుగు విధాలుగా మొబైల్‌ బ్యాంకింగ్‌ను అందిస్తోంది. అందులో యాప్‌ ద్వారా అందించే సేవలు ఒకటి. గూగుల్‌ ప్లేస్టోర్‌లో గానీ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా గానీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ఖాతా సమాచారం, స్టేట్మెంట్‌, బిల్లు చెల్లింపు, ఎఫ్‌డీ తెరవడం, మినీ స్టేట్‌మెంట్‌(ఆన్‌లైన్‌లో), చెక్కు చెల్లింపును ఆపాల్సిందిగా అభ్యర్థించడం, చెక్కు స్టేటస్‌ విచారణ, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్స్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు చెల్లింపులు వంటివి యాప్‌ ద్వారా చేయవచ్చు.

స్టాండర్డ్‌ చార్టడ్‌ బ్యాంక్‌

సమాచార సేవలు: మొబైల్‌పై ఖాతా సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు
అలర్టులు: ఖాతా, క్రెడిట్‌ కార్డుకు సంబంధించిన లావాదేవీల అలర్టులు
ఎమ్‌చెక్‌: మొబైల్‌ ఆధారిత చెల్లింపులు
రీఛార్జీ: మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా ప్రీపెయిడ్‌ మొబైల్‌, డీటీహెచ్‌ రీఛార్జీ
ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌: ఏదైనా స్టాండర్ట్‌ చార్టడ్‌ బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీ

మొబైల్‌ బ్యాంకింగ్‌ చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

భద్రతకై భరోసా

  • మొబైల్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా మాత్రమే యాప్‌లో లాగిన్‌ అవ్వగలరు. ఈ వివరాలను మరొకరికి బహిరంగపరచనంత వరకూ యాప్‌ వాడకం సురక్షితంగా ఉంటుంది.

  • చెల్లింపుదార్ల ఖాతా నంబర్లు, పూర్తి పేరు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొనబడి ఉంటాయి ఎన్క్రిప్షన్‌ చేసిన సమాచారం మాత్రమే బ్యాంక్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది.

  • బ్యాంకుల నుంచి వ్యక్తులకు వచ్చే సమాచారం చాలా గోప్యంగా ఉంటుంది.

  • ఏటీమ్‌ గ్రిడ్‌ కార్డు మీద ఉన్న నంబర్లు నమోదు చేసి చెల్లింపులు చేయడం ద్వారా లావాదేవీలను కాపాడతారు.

జాగ్రత్తలు

  • యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు నియమనిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

  • ఫోన్‌ ద్వారా కానీ మొబైల్‌ ద్వారా కానీ పాస్‌వర్డ్‌ను ఎవరికీ బహిరంగపరచకూడదు.

  • సులువుగా గుర్తించే పాస్‌వర్డ్‌ పెట్టుకోకూడదు.

  • పాస్‌వర్డ్‌లు తరచూ మార్చుకుంటూ ఉండాలి.

  • అనుమానస్పద మెయిల్స్‌ వస్తే స్పందించకూడదు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.

  • ఆన్‌స్క్రీన్‌ కీబోర్డ్‌ ఉపయోగించి మొబైల్‌ బ్యాంకింగ్‌ నిర్వహిస్తే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని