Gates Divorce: ఫౌండేషన్‌ నిర్వహణలో కొత్త ట్విస్టు!

దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగా......

Published : 28 May 2021 12:57 IST

న్యూయార్క్‌: దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు కోర్టు మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే వీరివురితో పాటు మరో కుబేరుడు వారెట్‌ బఫెట్‌ ఆధ్వర్యంలో నడిచే బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మనుగడపై సర్వత్రా సందేహం వ్యక్తమైంది. కానీ, ఫౌండేషన్‌ను ఇరువురం కలిసే కొనసాగిస్తామని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థగా పేరుగాంచి అంతర్జాతీయంగా విశేష సేవలందిస్తున్న ఫౌండేషన్‌ మనుగడపై సందేహాలు తొలగిపోయాయి. అయితే, తాజాగా వాల్‌ స్ట్రీట్ జర్నల్‌ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు ఫౌండేషన్‌ నిర్వహణకు సంబంధించిన ఓ కొత్త ట్విస్టును తెరపైకి తీసుకొచ్చింది.

ఫౌండేషన్‌ నిర్మాణంలో కొన్ని మార్పులు తేవాలని బిల్‌, మెలిందా భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇరువురు విడిపోతున్న నేపథ్యంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగే ఓ పాలక వ్యవస్థను ఫౌండేషన్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఓ బోర్డును ఏర్పాటు చేసి బయటి వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. విడాకుల నేపథ్యంలో సంస్థ సుస్థిరతను కాపాడడం కోసమే మెలిందా గేట్స్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు.

సంస్థ సుదీర్ఘకాలం సుస్థిర మనుగడ కొనసాగించేలా బిల్‌, మెలిందాతో చర్చిస్తున్నట్లు ఫౌండేషన్‌ సీఈఓ మార్క్‌ సుజ్‌మన్‌ ఇటీవల ఉద్యోగులకు తెలిపడంతో పై వార్తలకు బలం చేకూరింది. ఫౌండేషన్‌ నిర్వహణకు సంబంధించి వారు ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే సంస్థ కోసం కలిసి పనిచేస్తామని మాత్రం హామీ ఇచ్చారన్నారు.

ప్రస్తుతం బిల్‌, మెలిందా.. ఫౌండేషన్‌ ఛైర్మన్లుగా ఉన్నారు. సుజ్‌మన్‌ రోజువారీ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తుంటారు. ఇక సంస్థకు అతిపెద్ద దాతగా ఉన్న మరో కుబేరుడు వారెన్‌ బఫెట్‌.. బిల్‌, మెలిందాతో కలిసి కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. బిల్‌ గేట్స్‌ తండ్రి దివంగత సీనియర్‌ బిల్‌ గేట్స్‌ సైతం కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు కొత్త వ్యవస్థను తీసుకురావడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బిల్‌, మెలిందాకు ఫౌండేషన్‌తో అనుబంధం పలుచనయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2006 నుంచి ఫౌండేషన్‌ మనుగడ దాదాపు బిల్‌, మెలిందా, బఫెట్‌ విరాళాలపైనే ఆధారపడి ఉంంది. అలాగే భవిష్యత్తులోనూ తమ సహకారం కొనసాగుతుందని గతంలో వీరు హామీ ఇచ్చారు. అయితే, సొంతంగా నడపుతున్న కంపెనీల ద్వారానూ వీరివురు ధార్మిక కార్యక్రమాలు కొనసాగిస్తుండడం గమనార్హం.

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్‌ అనేక దాతృత్వ కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య సంరక్షణా వ్యవస్థల కసం విస్తృతంగా కృషి చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోలియో, మలేరియా నిర్మూలన కోసం విశేషంగా సేవలందించింది. వీటితో పాటు స్వచ్ఛ ఇంధనం, వాతావరణ మార్పులు, వివిధ వ్యాధులకు టీకాల తయారీ, అంకుర సంస్థలకు అండగా నిలవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని