
Twitter: ట్విటర్లో పరాగ్ మార్క్.. కీలక మార్పులు!
శాన్ఫ్రాన్సిస్కో: ఇటీవల ట్విటర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్.. సంస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కంపెనీలో కీలక పదవుల్లో ఉన్న కొంత మందిని తొలగించారు. భద్రతా విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్న పీటర్ జట్కో సహా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రింకీ సేథీ సైతం సంస్థను వీడనున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో పరాగ్ వెల్లడించారు.
సంస్థను ఇకపై ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ లేఖలో పరాగ్ పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే, వారి నిష్క్రమణకు సంబంధించిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంతకంటే ఎక్కువ వివరాలు బయటకు వెల్లడించలేకపోతున్నామని పేర్కొనడం గమనార్హం.
ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నుంచి పరాగ్ గత ఏడాది నవంబరులో సీఈఓ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల విషయంలో మార్పులు చేశారు. నాయకత్వ స్థానాలను పునర్వ్యవస్థీకరించారు. చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా ఉన్న డాంట్లీ డేవిస్, ఇంజినీరింగ్ విభాగపు హెడ్ మైకేల్ మోంటానోను ఆ పదవుల నుంచి తప్పించారు.
ప్రస్తుతం ప్రైవసీ ఇంజినీరింగ్ హెడ్‌గా ఉన్న లీ కిస్నర్ తాత్కాలికంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.