చింగారీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సల్మాన్‌ ఖాన్‌

టిక్‌టాక్‌ నిషేధంతో ప్రాచుర్యంలోకి వచ్చిన దేశీయ వీడియో షేరింగ్‌ యాప్‌ చింగారీకి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా

Updated : 02 Apr 2021 15:55 IST

దిల్లీ: టిక్‌టాక్‌ నిషేధంతో ప్రాచుర్యంలోకి వచ్చిన దేశీయ వీడియో షేరింగ్‌ యాప్‌ చింగారీకి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే సంస్థలో ఓ వాటాదారుగా బోర్డులోనూ చేరినట్లు చింగారీ వెల్లడించింది. సల్మాన్‌ చేరికపై చింగారీ సహవ్యవస్థాపకులు, సీఈఓ సుమిత్‌ ఘోష్‌ హర్షం వ్యక్తం చేశారు. చింగారీ భారత్‌లోని ప్రతిమూలకు చేరేందుకు సల్మాన్ భాగస్వామ్యం తోడ్పనుందని అభిప్రాయపడ్డారు.

చింగారీ ప్రయాణంలో తానూ భాగస్వామి కావడం సంతోషంగా ఉందని సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు. చింగారీ తన వినియోగదారులకు కొత్త అనుభూతినిచ్చేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. అతి తక్కువ సమయంలో చింగారీకి లభించిన ఆదరణ తనను ఆకట్టుకొందని వివరించారు. పట్టణం నుంచి గ్రామీణం వరకు లక్షల మంది తమ ప్రతిభను వ్యక్తీకరించేందుకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని గుర్తుచేశారు.

చింగారీలో గత ఆరు నెలల కాలంలో అనేక కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌ ఇటీవలే రూ.98.7 కోట్లు సమకూర్చింది. అలాగే రిపబ్లిక్‌ ల్యాబ్స్‌ యూఎస్‌, ఆస్టార్క్‌ వెంచర్స్‌, వైట్‌ స్టార్‌ క్యాపిటల్‌, ఇండియా టీవీ వంటి ప్రముఖ సంస్థలు ఇటీవల పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయి. గత ఏడాది ఏంజిల్‌ లిస్ట్‌, ఐసీడ్‌, విలేజ్‌ గ్లోబల్‌, బ్లూమ్‌ ఫౌండర్స్‌ ఫండ్‌, జస్మిందర్‌ సింగ్‌ గులాటి నుంచి 1.4 మిలియన్ డాలర్ల పెట్టుబడులు చింగారీలోకి వచ్చాయి. తాజా పెట్టుబడులతో చింగారీ వినియోగదారుల సంఖ్య 56 మిలియన్ల నంచి 100 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఆన్‌మొబైల్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని