బీమాలో స‌హ చెల్లింపులు(కో పే) అంటే ఏమిటి?

అన‌వ‌స‌ర‌మైన క్లెయిమ్‌ల‌ను త‌గ్గించ‌డం ద్వారా ఖ‌ర్చుని త‌గ్గిచ‌డం, మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన‌ పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెట్టడ‌మే దీని ప్రాథ‌మిక ల‌క్ష్యం

Updated : 30 Aug 2022 15:23 IST

వైద్య ఖ‌ర్చుల‌ను మీరు, మీ బీమా సంస్థ క‌లిపి చెల్లించ‌డాన్ని ఆరోగ్య‌బీమా స‌హా చెల్లింపులు అని పిలుస్తారు. అన‌వ‌స‌ర‌మైన క్లెయిమ్‌ల‌ను నిరుత్సాహ‌ప‌ర‌చ‌డం ద్వారా ఖ‌ర్చుని త‌గ్గిచ‌డం, మ‌రింత స‌మ‌ర్థ‌వంత‌మైన‌ పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెట్టడ‌మే దీని ప్రాథ‌మిక ల‌క్ష్యం. ఈ విధానాన్ని అర్ధం చేసుకోవాలంటే, మీ మొత్తం వైద్య ఖ‌ర్చు ఎంత‌? అందులో మీరు సొంతంగా చెల్లించ‌వ‌ల‌సిన‌ భాగం ఎంత? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలి.

ఉదాహ‌ర‌ణ‌కు సురేష్ రూ.3 ల‌క్ష‌ల ఆరోగ్య బీమాను 10 శాతం స‌హా చెల్లింపులతో క‌లిగి ఉన్నారు. అత‌నికి శ‌స్త్ర‌చికిత్స‌లు అవ‌స‌రం ఏర్ప‌డి, మంచి స‌దుపాయాలు ఉన్న ఆసుప‌త్రిలో వైద్యం చేయించుకున్నాడు. అందుకు గాను రూ. 40 వేలు ఖ‌ర్చు అయ్యింది. అందులో 10 శాతం అంటే రూ. 4 వేలు సురేష్ చెల్లించాలి, మిగిలిన‌ది బీమా సంస్థ చెల్లిస్తుంది. అత‌ను ఖ‌రీదైన ఆసుప‌త్రిలో అదే చికిత్స పొందితే అయ్యే ఖ‌ర్చు రూ.1 ల‌క్ష. అందులో సురేష్ రూ.10 వేలు చెల్లించాలి. ఇంతకు మునుపు తెలిపిన ఆసుపత్రి కంటే , అత‌ను రూ.6 వేలు అద‌నంగా చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఈ విధంగా స‌హా చెల్లింపులు బీమా చేసిన వ్య‌క్తిని ఆచరణాత్మక ఎంపిక వైపు మ‌ళ్ళిస్తాయి.

బీమా సంస్థ‌లు, సహ-చెల్లింపుల‌ను ప్రోత్స‌హించే సంద‌ర్భాలు:
వయస్సు సంబంధ సహ-చెల్లింపులు:
పెరుగుతున్న వయస్సుతో ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబ‌ట్టి వృద్ధాప్యంలో ఉన్న వ్య‌క్తుల నుంచి ఎక్కువ క్లెయిమ్‌లు వస్తాయ‌ని బీమా సంస్థ‌లు భావిస్తాయి.
కాబ‌ట్టి ఈ రిస్క్‌ను త‌గ్గించ‌డానికి, బీమా సంస్థ‌లు కొంత వయస్సు పరిమితి తరువాత పాలసీదారులకు సహ-చెల్లింపు నిబంధనను వర్తింపజేస్తాయి.కాబట్టి వీలైనంత తక్కువ సహా చెల్లింపులు ఉన్న పాలసీలను ఎంచుకోవడం మంచిది.

ఆసుప‌త్రుల ర‌కం ఆధారంగా:
కొన్ని బీమా సంస్థ‌లు ఒప్పందం చేసుకున్న ఆసుప‌త్రుల‌లో కాకుండా ఇత‌ర ఆసుప్ర‌తుల‌ను ఎంచుకున్న‌ప్పుడు స‌హ చెల్లింపులను వ‌ర్తింప‌చేస్తారు.

జోన్(ప్రాదేశిక‌) సంబంధ స‌హ చెల్లింపులు:
కొన్ని బీమా సంస్థ‌లు, బీమా చేసిన వ్య‌క్తి నివసిస్తున్న ప్ర‌దేశం ఆధారంగా అధిక ప్రీమియం వసూలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా వంటి నగరాలలో జీవన వ్యయం తోపాటు వైద్య ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి, ప్రీమియం కూడా అధికంగా ఉండవచ్చు. పాలసీ ఒక ప్రాంతం నుంచి తీసుకుని , వైద్య సదుపాయం వేరొక ప్రాంతంలో పొందినా , పాలసీ నియమాల ప్రకారం చెల్లిస్తారు.

ముందుగానే క‌లిగి ఉండే అనారోగ్యానికి:
ముందుగానే వ్యాధితో బాధ ప‌డుతున్న వ్య‌క్తి ఆరోగ్య బీమాను పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు బీమా సంస్థ‌లు సహ చెల్లింపు నిబంధ‌న‌ను వ‌ర్తింప‌చేస్తారు. అటువంటి వ్యాధుల‌కు ఖ‌రీదైన చికిత్స అవసరమవుతుంది, కాబ‌ట్టి స‌హ చెల్లింపుల‌ నిబంధనను పెడుతుంది.

బీమా సంస్థ‌లు రిస్క్ త‌గ్గించుకోవ‌డం, చెల్లింపుల‌ను ఆదా చేసుకోవ‌డానికి మాత్ర‌మే కాకుండా కొన్ని ఇత‌ర కార‌ణాల‌తో కూడా ఈ స‌హా చెల్లింపుల ప‌ద్ద‌తిని ప్ర‌వేశ పెట్టాయి.

ప్రీమియంపై ప్ర‌భావం ఎంత‌?
బీమా చేసిన వ్య‌క్తికి, బీమా సంస్థ‌కు రెండింటికి రిస్క్ ఉంటుంది. అందువ‌ల్ల‌ స‌హ చెల్లింపుల భాగ‌స్వామ్యం ఎక్కువ‌గా ఉంటే ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. బీమా చేసిన వ్య‌క్తి భాగం సాధారణంగా 10 నుంచి 20 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఇది వేరు వేరు బీమా సంస్థ‌ల‌కు మారుతుంటుంది. సాధారణ ఆరోగ్య బీమా పాల‌సీలు వ‌ర్తించ‌ని వ్య‌క్తుల‌కు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు, ముందుగానే అనారోగ్యంతో బాద‌ప‌డుతున్న వారికి ఈ ర‌క‌మైన పాల‌సీలు ర‌క్ష‌ణ‌గా ఉంటాయి. అటువంటి వారు స‌హా చెల్లింపుల నిబంధ‌న‌తో త‌క్కువ ప్రీమియంతో త‌గిన క‌వ‌రేజ్‌ను పొంద‌వ‌చ్చు.

సహ-చెల్లింపు నిబంధనతో పాలసీని ఎంచుకోవడం మంచిదేనా?
మీకు ఎటువంటి తీవ్ర‌మైన అనారోగ్యం లేకుండా శారీరికంగా ధృడంగా వున్న వారైతే స‌హా చెల్లింపుల‌తో కూడిన పాల‌సీని తీసుకోవ‌డం మంచిది. ఈ విధ‌మైన పాల‌సీలో ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఏమైనా జ‌రిగినా బీమా సంస్థ‌ చికిత్సకు అయ్యే ఖ‌ర్చుల‌ను చాలా శాతం భ‌ర్తీ చేస్తుంది.

ఆరోగ్య‌బీమాను కొనుగోలు చేసిన‌ప్పుడు స‌హ చెల్లింపుల‌ను మాత్ర‌మే ప్ర‌మాణికంగా తీసుకోకూడ‌దు. పాల‌సీ క్లెయిమ్ సామ‌ర్ధ్యం, పాల‌సీ మిన‌హాయింపులు మొద‌లైన వాటిని కూడా ప‌రిగ‌ణంలోనికి తీసుకోవాలి.

Deductibles
బీమాలో డిడ‌క్టబుల్ అంటే కొంత మొత్తం వరకు పాలసీదారునికి ఎటువంటి చెల్లింపులు జరగవు. అంటే, మీరు ఎంచుకున్న మొత్తం వరకు బీమా సంస్థ చెల్లింపులు చేయదు. ఆ పైన అయ్యే ఖర్చులకి మాత్రమే బీమా సంస్థ చెల్లిస్తుంది.చిన్న చిన్న మొత్తాలకు కూడా వచ్చే క్లైములను నివారించడానికి ,కొన్ని బీమా కంపెనీలు ఈ షరతు విధిస్తుంటాయి .

ఉదాహ‌ర‌ణ‌కు 30 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తి రూ. 5 ల‌క్ష‌ల‌కు ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్నార‌ని అనుకుందాం. డిడ‌క్ట‌బుల్ అమౌంట్ రూ. 25 వేలు అనుకుందాం . ఒకవేళ క్లెయిమ్ మొత్తం రూ. 25 వేల వరకు అయితే , ఆ మొత్తాన్ని పాలసీదారుడే భరించాలి. అదే క్లెయిమ్ మొత్తం
రూ. 25 వేల కంటే ఎక్కువ అయితే , రూ. 25 వేల కంటే ఫై మొత్తాన్ని మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది, మిగిలింది పాలసీదారుడు సొంతంగా చెల్లించాలి .

ఒకవేళ పాలసీదారుడు ప్రీమియంను తగ్గించుకునే ఉద్దేశం ఉంటె , డిడ‌క్టబుల్ పరిమితిని పెంచుకోవచ్చు. సాధారణంగా చిన్న వయసులో ఉన్నవారు / ఆరోగ్యంగా ఉన్నవారు , ప్రీమియం ను తగ్గించుకుందుకు ఇదొక అవకాశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని