IPO: అక్టోబరు నాటికి ఐపీఓల్లో రూ.52 వేల కోట్ల సమీకరణ

అక్టోబరు నాటికి దేశంలో 61 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు....

Published : 06 Dec 2021 16:35 IST

లోక్‌సభకు తెలిపిన ఆర్థిక మంత్రి

దిల్లీ: అక్టోబరు నాటికి దేశంలో 61 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. మొత్తం రూ.52,759 కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. గత ఏడాది మొత్తం ఐపీఓల్లో వచ్చిన నిధులతో పోలిస్తే ఇది ఎక్కువని పేర్కొన్నారు. 61 కంపెనీల్లో 34 చిన్న, మధ్య తరహా పరిశ్రమలని వెల్లడించారు. తయారీ, సేవా రంగాల్లోని అనేక కంపెనీలు లిస్టింగ్‌కు వస్తున్నాయని తెలిపారు.

గత ఏడాది 56 కంపెనీలు ఐపీఓకి రాగా.. అవి రూ.31,060 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన 61 కంపెనీల్లో 35 సంస్థలు రూ.100 కోట్లు, 4 కంపెనీలు రూ.100-500 కోట్లు, 22 సంస్థలు రూ.500 కోట్ల కంటే ఎక్కువ నిధులు సమీకరించినట్లు సీతారామన్‌ వెల్లడించారు. వీటిలో 10 కంపెనీలు ఆరోగ్య సంరక్షణకు చెందినవి కాగా.. మరో ఆరు సంస్థలు సిమెంట్‌,  నిర్మాణ రంగానికి చెందినవని పేర్కొన్నారు. ఇటీవల స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయిన పేటీఎం మదుపర్లకు ఏమైనా ఇబ్బందులు కలగజేసిందా అనే ప్రశ్నకు ‘లేదు’ అని మంత్రి సమాధానమిచ్చారు. రూ.18,300 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి వచ్చిన పేటీఎం.. మార్కెట్ల ముందు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు సైబర్‌ భద్రత కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని