ITR Filing: ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా.. ఈ తప్పులు చేయొద్దు!

ఐటీఆర్‌ ఫైల్‌ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులను నివారించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. అవేంటో చూద్దాం..

Published : 08 Sep 2021 13:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వార్షికాదాయం రూ.2.5 లక్షలు దాటినవారంతా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం(ఐటీఆర్‌ ఫైలింగ్‌) తప్పనిసరి. వృద్ధులైతే రూ.3 లక్షల ఆదాయం దాటితేనే ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి. 75 ఏళ్లు దాటి.. కేవలం పింఛను, వడ్డీలపై మాత్రమే ఆదాయం పొందుతున్న వారు అసలు ఐటీఆర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరం లేదా 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి సెప్టెంబరు 30 ఆఖరు తేదీ. ఐటీఆర్‌ ఫైలింగ్‌ ఏడాదిలో చేయాల్సిన తప్పనిసరి పనుల్లో ఒకటి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే మేలు. అయితే, ఐటీఆర్‌ ఫైల్‌ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులను నివారించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. అవేంటో చూద్దాం..!

సేవింగ్స్ ఖాతా నుంచి వచ్చే వడ్డీని తెలియజేయాలి..

దాదాపు అందరికీ బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉంటుంది. అందులో ఉండే సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంటుంది. అయితే, చాలా మంది ఈ వడ్డీని ఐటీఆర్‌లో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా ఐటీఆర్‌లో చూపించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 టీటీఏ ప్రకారం.. సేవింగ్స్ ఖాతాపై లభించే వడ్డీలో రూ.10,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్స్‌కైతే సెక్షన్‌ 80టీటీబీ కింద ఈ పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై లభించే వడ్డీని చేర్చాలి..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని తప్పనిసరిగా ఐటీఆర్‌లో చూపించాలి.

తప్పుడు ఐటీఆర్‌ ఫారాన్ని దాఖలు చేయడం..

చాలామంది తమ రిటర్నులను దాఖలు చేసేందుకు ఏ ఫారం వినియోగించాలని సందేహిస్తుంటారు. ఏ ఫారం ఎవరికి వర్తిస్తుంది.. ఎవరు ఉపయోగించకూడదో ముందే తెలుసుకోవాలి. రూ.50లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్‌-1ను ఉపయోగించేందుకు వీలుంటుంది. ఐటీఆర్‌ -1 ఫారం వర్తించని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్‌-2ని వినియోగించవచ్చు. ఇలా వివిధ వర్గాలకు వివిధ ఫారాలు ఉన్నాయి. మొత్తం నాలుగు రకాల ఫారాలు ఉంటాయి. మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో తెలుసుకొని అదే ఫారం సమర్పించాలి.

ఈ-వెరిఫికేషన్‌ను మర్చిపోవడం..

ఐటీఆర్‌ దాఖలు చేసిన 120 రోజుల్లో ఈ-వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. లేదంటే రిఫండుల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెట్‌ బ్యాంకింగ్‌, ఆధార్‌ ఓటీపీ ద్వారా ఈ-వెరిఫికేషన్‌ను పూర్తి చేయొచ్చు.

డివిడెండ్‌ ఆదాయాన్నీ చూపించాలి..

ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్ల నుంచి లభించే డివిడెండ్లను గతంలో పన్ను రహిత ఆదాయంగా పరిగణించేవారు. కానీ, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కచ్చితంగా ఐటీఆర్‌ ఫైలింగ్‌లో చూపించాలి.

ఫారం 26ఏఎస్‌ వివరాలతో ఆదాయం, టీడీఎస్‌ సరిపోలాలి..

ఆర్థిక సంవత్సరంలో మీకు లభించిన ఆదాయానికి సంబంధించిన వివరాలన్నీ ఉండేదే ఫారం 26ఏఎస్‌. ఐటీఆర్‌లో పొందుపరిచిన వివరాలన్నీ ఈ ఫారంలోని సమాచారంతో సరిపోలాలి. లేదంటే రిఫండు తగ్గతుంది. లేదా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతాయి.

కొత్త, పాత ప‌న్ను విధానాలను సరిపోల్చుకోవాలి..

ప‌న్ను చెల్లింపుదారుల‌కు రెండు ప‌న్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుని ప‌న్ను దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ఎంపిక‌లో గంద‌ర‌గోళం వద్దు. పాత విధానంలో శ్లాబ్‌ల‌ సంఖ్య త‌క్కువ‌. అయితే కొన్ని మిన‌హాయంపుల‌ను పొందే వీలుంది. కొత్త విధానంలో మిన‌హాయింపులు వ‌ర్తించ‌వు.

కొత్త ప‌న్ను విధానాన్ని 2020 బ‌డ్జెట్‌లో ప్రవేశ‌పెట్టారు. పాత శ్లాబ్‌ల‌తో పోలిస్తే, కొత్త ప‌న్ను విధానంలో శ్లాబ్‌ల సంఖ్య ఎక్కువ‌. ఉదాహ‌ర‌ణ‌కు పాత ప‌న్ను శ్లాబ్ ప్రకారం ఏటా రూ. 10 ల‌క్షల‌కు పైగా ఆదాయం ఉన్న వారు 30శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంలో దీన్ని మూడు శ్లాబ్‌లుగా విభ‌జించారు. ఏడాదిలో రూ.10 ల‌క్షల నుంచి రూ.12.5 ల‌క్షల మ‌ధ్య ఆదాయం ఉన్న వారిని 20 శాతం, రూ. 12.5 ల‌క్షల  నుంచి రూ. 15 ల‌క్షల మ‌ధ్య ఆదాయం ఉన్న వారిని 25 శాతం,  రూ. 15 ల‌క్షలు, ఆపైన ఆదాయం ఉన్న వారిని 30శాతం ప‌న్ను శ్లాబ్ కింద‌కి తీసుకొచ్చారు. అయితే పాత ప‌న్ను విధానంలో మిన‌హాయింపులు, త‌గ్గింపులు ఆప్షన్ అందుబాటులో ఉంటుంది కాబ‌ట్టి, ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధిలోకి వ‌చ్చే పెట్టుబ‌డులు చేసిన వారు పాత పద్ధతిని ఎంచుకోవచ్చు! ఈ ప్రయోజ‌నం కొత్త ప‌న్ను విధానంలో అందుబాటులో లేదు. అందువ‌ల్ల చెల్లింపుదారులు రెండు విధానాల్లోనూ ప‌న్ను లెక్కించి త‌మ‌కు లాభం చేకూర్చే విధానాన్ని ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని