Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌.. గ్రాము ధరెంతంటే?

సార్వభౌమ పసిడి బాండ్ల పథకం మరోసారి అందుబాటులోకి వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో సిరీస్‌ నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది.

Published : 26 Nov 2021 21:08 IST

ముంబయి: సార్వభౌమ పసిడి బాండ్ల పథకం మరోసారి అందుబాటులోకి వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిదో సిరీస్‌ నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు రానుంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ శుక్రవారం గ్రాము బంగారం ధరను రూ.4,791గా నిర్ణయించింది. డిజిటల్‌ రూపంలో కొనుగోలు చేసే వారికి రూ.50 డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. సిరీస్‌ 7లో గ్రాము ధరను రూ.4,761గా నిర్ణయించారు.

భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SHCIL), నిర్దేశిత పోస్టాఫీసులు, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ, బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో వీటిని కొనుగోలు చేయొచ్చు. భౌతిక బంగారం కొనుగోళ్లను నియంత్రించాలన్న ఉద్దేశంతో బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించే వారి కోసం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యక్తులు ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని ఈ బాండ్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

ప్రస్తుతం సావరిన్ బంగారు బాండ్లలో పెట్టుబడి మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకోసారి చందాదారుని బ్యాంక్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది. చివరి ఆరునెలల వడ్డీని మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తంతో కలిపి చెల్లిస్తారు. ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన రాబడిపై పన్ను వర్తించదు. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్‌ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి దాని ప్రకారం చెల్లింపులు చేస్తారు. భౌతికంగా బంగారం కొనుగోలు చేసేవారికి 3 శాతం జీఎస్టీతో పాటు, తయారీ ఛార్జీలు వంటి అదనపు రుసములు వర్తిస్తాయి. అయితే సార్వభౌమ పసిడి బాండ్లపై జీఎస్టీ వర్తించదు. దీని ద్వారా బంగారం దాచిపెట్టడానికి అయ్యే ఖర్చు, అదనపు రిస్క్‌ల‌ను తగ్గించుకోవచ్చు. చందాదారులు కావాలంటే 8 సంవత్సరాల కంటే ముందుగానే పథకం నుంచి నిష్క్రమించే అవకాశం కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని