కరోనా టీకా ఉత్పత్తి పెంపునకు కేంద్రం కీలక చర్య!

దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో టీకాల ఉత్పత్తి పెంచేలా కేంద్ర చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తయారీ సంస్థలు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు రుణాలు మంజూరు చేసింది.........

Updated : 19 Apr 2021 17:33 IST

తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు సంస్థలకు రుణం మంజూరు

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో టీకాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్ర చర్యలు చేపట్టింది. టీకా తయారీ సంస్థలు అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు రుణాలు మంజూరు చేసింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు కేంద్రం రూ.3 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే దేశీయంగా కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌కు రూ.1,500 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని అతి త్వరలో ఆయా సంస్థలకు విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇటీవల ఓ సందర్భంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్ పూనావాలా మాట్లాడుతూ.. టీకా ఉత్పత్తి నెలకు 100 మిలియన్లు మించాలంటే తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు సీరం సంస్థకు రూ.3,000 కోట్ల రుణం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రుణం మంజూరు చేసింది. జూన్‌ 2021 నాటికి సీరం తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ బలంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు సైతం భారీ స్థాయిలో రికార్డవుతున్నాయి. దీంతో మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వెలువడుతోంది. అయితే, అనేక రాష్ట్రాల్లో టీకా నిల్వలు పరిమిత సంఖ్యలో ఉండడంతో టీకా కార్యక్రమం కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలోనే టీకా ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్రం ఆయా సంస్థలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని