Home loan Vs Mortgage loan: హోంలోన్‌ వర్సెస్‌ మోర్టగేజ్ లోన్‌.. ఏది ఉత్తమం?

హోంలోన్‌, మోర్టగేజ్‌ లోన్‌ మధ్య వ్యత్యాసం చాలా మందికి తెలియదు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం..!

Published : 04 Sep 2021 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణంలో చాలా రకాలుంటాయి. హోంలోన్‌, హోంలోన్ రినోవేషన్‌, హోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ లోన్‌, టాప్‌-అప్‌ హోంలోన్‌, ప్రాపర్టీపై లోన్‌, ప్లాట్‌ లోన్‌, కన్‌స్ట్రక్షన్‌ లోన్‌, హోంలోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌, మోర్టగేజ్‌ లోన్‌ ఇలా మన అవసరాన్ని బట్టి వీటిలో ఏదో ఒకదాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని ముందే ఉన్న లోన్‌కు అదనంగా ఇచ్చేవి ఉన్నాయి. చాలా మంది వీటి మధ్య తేడా తెలియక గందగరగోళపడుతూ ఉంటారు. లేదంటే.. బ్యాంకర్లు చెప్పిన సలహాను విని ముందుకు వెళుతుంటారు. ముఖ్యంగా.. హోంలోన్‌, మోర్టగేజ్‌ లోన్‌ మధ్య వ్యత్యాసం చాలా మందికి తెలియదు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం..!

హోం లోన్‌ అంటే..

నిర్మాణం పూర్తయిన ఇళ్లు కొనడానికి లేదా కొత్త ఇంటిని నిర్మించేందుకు మాత్రమే హోం లోన్‌ను మంజూరు చేస్తారు. రుణదాతలు ఆ ఇంటినే తనఖా కింద పెట్టుకుంటారు. ఒకవేళ మనం రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. ఇంటిని స్వాధీనపరచుకొని సొమ్మును రికవరీ చేసుకుంటారు. ఇక్కడ మంజూరైన నగదును ఇంటిని కొనడానికి లేదా నిర్మించడానికి మాత్రమే వినియోగించాలి.

మోర్టగేజ్‌ లోన్‌ అంటే..

తమ పేరు మీద ఉన్న ఏదైనా ఆస్తిని తనఖా పెట్టి రుణం తీసుకుంటే దాన్ని మోర్టగేజ్ లోన్‌ అంటారు. ఇలా మంజూరైన సొమ్మును దేనికైనా వినియోగించుకోవచ్చు. రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించి రుణాన్ని రికవరీ చేసుకుంటారు.

* ఒకరకంగా రెండూ ఒకేలా అనిపించినా.. వీటి మధ్య చాలా వ్యత్యాసమే ఉంటుంది.

హోంలోన్‌ ఫీచర్లు

* హోంలోన్‌ను ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి.

* ఇంటిని నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో ఉన్న మార్కెట్‌ విలువలో 90 శాతం మొత్తాన్ని రుణం రూపంలో పొందవచ్చు.

* మోర్టగేజ్‌ లోన్‌తో పోలిస్తే హోంలోన్‌లో వడ్డీరేటు తక్కువ.

* హోంలోన్‌లో ప్రాసెసింగ్‌ రుసుము 0.8-1.2 శాతం మధ్య ఉంటుంది.

* సుదీర్ఘకాల కాలపరిమితి.. దాదాపు 30 ఏళ్ల వరకు హోంలోన్‌ను తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

మోర్టగేజ్‌ లోన్‌ ఫీచర్లు..

* మోర్టగేజ్‌ లోన్‌ వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు. కావాలంటే రుణగ్రహీత తన వ్యక్తిగత అవసరాలకు కూడా సొమ్మును వాడుకోవచ్చు.

* హోంలోన్‌తో పోలిస్తే మోర్టగేజ్‌లో మంజూరయ్యే రుణం తక్కువగా ఉంటుంది. ఆస్తి విలువలో 60-70 శాతం మాత్రమే రుణ రూపంలో పొందవచ్చు.

* హోంలోన్‌తో పోలిస్తే మోర్టగేజ్‌ లోన్‌పై 1-3 శాతం వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది.

* మోర్టగేజ్‌ లోన్‌లో ప్రాసెసింగ్‌ రుసుము 1.5 శాతం వరకు ఉంటుంది.

* ఈ లోన్‌ తిరిగి చెల్లించడానికి గరిష్ఠంగా 15 ఏళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది.

* ఎలాంటి పేపర్‌ వర్క్‌ లేకుండానే ఉన్న లోన్‌పై టాప్‌-అప్‌ లోన్‌ తీసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.

** ఈ రెండింటిలో ఏది ఉత్తమమనే విషయం పూర్తిగా రుణగ్రహీతల అవసరం మీద ఆధారపడి ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఒక్కో సమయంలో ఒక్కోటి ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని