ఆర్థిక లక్ష్యం చేరాలంటే...

కష్టపడి డబ్బు సంపాదిస్తాం.. భవిష్యత్తు భద్రత కోసం దాన్ని పెట్టుబడులుగా మారుస్తాం.. కానీ, ఆ పెట్టుబడి పథకాల పనితీరును గమనించడంలో

Updated : 26 Feb 2021 11:28 IST

కష్టపడి డబ్బు సంపాదిస్తాం.. భవిష్యత్తు భద్రత కోసం దాన్ని పెట్టుబడులుగా మారుస్తాం.. కానీ, ఆ పెట్టుబడి పథకాల పనితీరును గమనించడంలో మాత్రం విఫలం అవుతుంటాం. దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించడం ఎప్పుడూ అవసరమే. కానీ, వాటిలో ప్రతిఫలం అంతగా అందించని వాటిని తొందరగా వదిలించుకోవడమూ ముఖ్యమే. పెట్టుబడుల్లో వివిధీకరణ (డైవర్సిఫికేషన్‌) ఉండేలా జాగ్రత్తలు తప్పనిసరి. ఎలాంటి సందర్భం వచ్చినా మన కష్టార్జితాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..


కేటాయింపులు ఇలా..

కరోనా మహమ్మారి తర్వాత.. చాలామంది ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో.. నష్టభయం భరించే సామర్థ్యాల్లోనూ తేడాలు వచ్చాయి. ఎంతోమంది స్థిరాదాయం ఇచ్చే పథకాలవైపే మొగ్గు చూపిస్తున్నారు. మీ నష్టభయం భరించే సామర్థ్యాన్ని బట్టి, పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక రక్షణ కోసం.. దీర్ఘకాలంలో వచ్చే లాభాలను వదులుకోకుండా చూసుకోవాలి. మీ పెట్టుబడుల జాబితాను సమీక్షించుకునేటప్పుడు దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని మనసులో పెట్టుకోవాలి. అన్ని పెట్టుబడి పథకాలు ఒకే సమయంలో ఒకే రీతిలో ప్రవర్తించవు అనేది మర్చిపోకూడదు.


సాధించాల్సిందేమిటి?

కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మీ ఆర్థిక లక్ష్యాలూ అందుకు తగ్గట్టుగా మారి ఉండవచ్చు. ఉదాహరణకు కారు కొనాలనే ఆలోచన ఉందనుకుందాం.. ఇంటి నుంచే పని చేస్తున్న తరుణంలో దాని అవసరం అంతగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మీ స్వల్పకాలిక లక్ష్యాలు మారిపోతాయి. అందుకే, ఒకసారి మీ ఆర్థిక లక్ష్యాలను పూర్తిగా సమీక్షించుకోండి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమిటి? వాటిని సాధించేందుకు అనువైన పెట్టుబడులను ఎంచుకున్నారా చూసుకోండి. మీరు గత ఏడాది విహార యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. కానీ, సాధ్యం కాలేదు. దానికి ఖర్చయ్యే డబ్బును ఎక్కడ మదుపు చేశారు. దాని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వెళ్లడానికి సిద్ధం అయితే, ఆ మొత్తం అందుబాటులో ఉందా? ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టుగా మదుపు పథకాలను ఎంచుకుంటే.. అవసరానికి డబ్బు తీసుకోవడం సులభం అవుతుంది. అందుకే, లక్ష్యాలు.. అందుకు అనువైన పెట్టుబడులు సరిగానే ఉన్నాయా ఒకసారి తనిఖీ చేసుకోండి.


పనితీరు బాగుందా?

ఆర్థిక లక్ష్యాలను సరిచూసుకున్న తర్వాత.. పెట్టుబడులను సమీక్షించుకోవాలి. అవి మీ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాయా లేదా చూసుకోండి. ఆశించిన ప్రతిఫలం ఇవ్వని పథకాల గురించి వివరాలు చూడండి. పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండటంతోపాటు, సమతౌల్యంగానూ ఉండాలి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో అవి సరిగానే పనిచేస్తున్నాయాలాంటివీ చూడాలి. మార్కెట్‌ పరిస్థితులు బాగాలేక.. పెట్టుబడులు కొంచెం ప్రతికూలంగా ఉంటే ఆందోళన చెందనక్కర్లేదు. కొన్ని నిర్మాణాత్మక అంశాల ఆధారంగా వాటిని బేరీజు వేయాలి. ఒకసారి క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే పథకాల్లో మార్పులు చేర్పులు చేయాలి.


వైవిధ్యం ఉంటే చాలదు..

పెట్టుబడి మొత్తాన్ని రెండు మూడు పథకాలకు కేటాయించి, వైవిధ్యం వివిధీకరణ చేశామంటే కుదరదు. ఆయా పథకాలు మన లక్ష్యాలకు తగ్గట్టుగా.. అన్ని రకాల నష్టభయాలను తట్టుకునేలా ఉండాలి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, స్థిరాస్తి ఇలా.. అనేక విధాలుగా మీ పెట్టుబడులను కేటాయించాలి. అప్పుడే వాటి వల్ల వచ్చే ప్రతిఫలాలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మదుపు చేసే పథకాలు.. స్వల్పకాలిక పథకాలు రెండూ వేర్వేరు. వీటిలోనూ మన పెట్టుబడులు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలను స్వల్పకాలానికీ.. డెట్‌ ఫండ్లను దీర్ఘకాలానికి వాడటం పొరపాటే. 


కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలను పూర్తిస్థాయిలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికీ మీరు ఈ దిశగా ప్రయత్నాలు చేయకపోతే.. ఆలస్యం చేయొద్దు. పెట్టుబడుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా.. భవిష్యత్తు భరోసా కోల్పోతాం అనేది గుర్తుంచుకోండి.

ఇవీ చదవండి...
మార్కెట్లకు, ఆర్థిక వ్యవస్థకు లంకె తెగింది

ఐపీఓలు.. దుమ్మురేపాయ్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని