దేశంలోనే తొలిసారి.. హెల్మెట్‌ కొంటే బీమా పాలసీ ఫ్రీ!

`వేగా` హెల్మెట్ ప్ర‌తి ఆన్‌లైన్ కొనుగోలుపై రూ. ల‌క్ష వ్య‌క్తిగ‌త ప్ర‌మాద పాల‌సీని ఐసీఐసీఐ లొంబార్డ్ ద్వారా వినియోగ‌దారులు పొందుతారు.

Updated : 02 Nov 2021 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న పెంచేందుకు ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్, వేగా హెల్మెట్ కంపెనీతో చేతులు కలిపింది. వేగా హెల్మెట్ ప్ర‌తి ఆన్‌లైన్ కొనుగోలుపై రూ.ల‌క్ష వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీని ఐసీఐసీఐ లాంబార్డ్ ద్వారా వినియోగ‌దారులు పొందనున్నారు. హెల్మెట్ కొన్న‌వారికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డం దేశంలో ఇదే మొద‌టిసారి. ఈ బీమా ర‌క్ష‌ణ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌ర్తిస్తుంది. ఇటీవల బీమాకు ప్రాముఖ్య‌ం పెరిగిన విషయం తెలిసిందే. ప్ర‌మాద బీమా పాలసీ ఉంటే.. అవాంఛ‌నీయ సంఘ‌ట‌నలు జ‌రిగిన‌పుడు పాలసీదారుడి కుటుంబ‌ స‌భ్యుల‌కు ఆర్ధిక భ‌ద్ర‌త‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ కూడా ‘రైడ్ టు సేఫ్టీ’ కింద రహదారి భద్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా హెల్మెట్‌ కొనుగోలుకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది.

‘యుగోవ్’ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆటోమోటివ్ రిపోర్ట్ 2021 ప్ర‌కారం.. ప్రపంచవ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణాను ఉప‌యోగించుకోవడంలో భార‌తీయులకు పెద్దగా ఆసక్తి లేదు. దాదాపు స‌గం (49%) మంది వ్య‌క్తిగ‌త ర‌వాణాను ఉప‌యోగిస్తున్నార‌ని నివేదిక తెలిపింది. మ‌హిళల‌తో పోలిస్తే పురుషుల‌కు వ్య‌క్తిగ‌త వాహ‌న ప్ర‌యాణాల‌పై ఆస‌క్తి బాగా పెరిగింది. దీంతో ద్విచ‌క్ర వాహ‌నాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో ప్ర‌మాదాలు సైతం అధిక సంఖ్య‌లో జ‌రుగుతున్నాయి. వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా ట్రాఫిక్ నియమాల ప్రకారం.. వెనుక కూర్చున్న వారు 4 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు దాటిన వారైతే.. వారు కూడా హెల్మెట్ ధ‌రించాలి. దీంతో హెల్మెట్ల అమ్మ‌కాలు బాగా పెరిగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని