Business News: 2021లో రూ.9 లక్షల కోట్ల సమీకరణ

ఈ ఏడాదిలో కంపెనీలు ఈక్విటీ, డెట్‌ సహా ఇతర మార్గాల ద్వారా ఏకంగా రూ.9 లక్షల కోట్లు  సమీకరించాయి...

Published : 27 Dec 2021 21:27 IST

దిల్లీ: కరోనా సంక్షోభం నుంచి 2021లో చాలా వరకు వ్యాపారాలు పుంజుకున్నాయి. క్షేత్రస్థాయిలో వినియోగ వస్తువులు, సేవలకు డిమాండ్ పెరిగింది. దీంతో పెరిగిన గిరాకీకి అనుగుణంగా కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఇందుకోసం ఈ ఏడాదిలో భారీ ఎత్తున నిధులను సేకరించాయి. ఈక్విటీ, డెట్‌ సహా ఇతర మార్గాల ద్వారా ఏకంగా రూ.9 లక్షల కోట్లు  సమీకరించాయి.

ఒకవేళ ఒమిక్రాన్ లేదా ఇతర కరోనా వేరియంట్లు ఉత్పాతాన్ని సృష్టించకపోతే కొత్త ఏడాదిలోనూ నిధుల సమీకరణ భారీ ఎత్తున జరిగే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా పెట్టుబడులకు కూడా ఎలాంటి కొరత ఉండకపోవచ్చునని తెలిపారు. డెట్‌ మార్గంలో వచ్చిన పెట్టుబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. కానీ, ఈక్విటీ ద్వారా సమకూరిన నిధుల్లో మాత్రం ఎలాంటి తరుగుదల లేకపోవడం విశేషం. పెద్ద మొత్తంలో కంపెనీలు ఐపీఓకి రావడం, స్టాక్‌ మార్కెట్‌ బుల్‌ పరుగులు ఈక్విటీ నిధుల సమీకరణకు దోహదం చేశాయి.

మొత్తం రూ.9.01 లక్షల కోట్ల నిధుల్లో రూ.5.53 లక్షల కోట్లు డెట్‌ మార్కెట్‌ ద్వారా వచ్చాయి. మరో 2.1 లక్షల కోట్లు ఈక్విటీ ద్వారా సమకూరాయి. రూ.30,840 కోట్లు రిట్స్‌-ఇన్విట్స్‌ ద్వారా, రూ.1.06 లక్షల కోట్లు ఓవర్సీస్‌ ఇష్యూ ద్వారా వచ్చాయి. క్రితం ఏడాది మొత్తం రూ.11 లక్షల కోట్లు రాగా.. ఇందులో డెట్‌ మార్కెట్‌ ద్వారా రూ.7.91 లక్షల కోట్లు, ఈక్విటీ ద్వారా రూ.2.12 లక్షల కోట్లు సమకూరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని