Map My India IPO: ఐపీఓకి రానున్న మ్యాప్‌ మై ఇండియా!

దేశీయ తొలి మ్యాపింగ్‌ కంపెనీ ‘మ్యాప్‌మైఇండియా’ ఐపీఓకి రానుంది. ఈ మేరకు వచ్చే వారం సెబీకి దరఖాస్తు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కంపెనీ విలువను రూ.5,000-6,000 కోట్లుగా లెక్కగట్టారు...

Updated : 30 Aug 2021 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ తొలి మ్యాపింగ్‌ కంపెనీ ‘మ్యాప్‌ మై ఇండియా’ ఐపీఓకి రానుంది. ఈ మేరకు వచ్చే వారం సెబీకి దరఖాస్తు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. కంపెనీ విలువను రూ.5,000-6,000 కోట్లుగా లెక్కగట్టారు. తాజా ఐపీఓలో వాటాల అమ్మకం ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే తొలుత పెట్టుబడి పెట్టిన క్వాల్‌కామ్‌, ఫోన్‌పే, జపాన్‌కు చెందిన మ్యాప్‌మేకర్‌ జెన్రిన్‌ సంస్థలకు కంపెనీ నుంచి నిష్క్రమించే అవకాశం ఇవ్వనున్నారు. మ్యాప్‌మైఇండియాను స్థాపించిన వర్మ ఫ్యామిలీ ప్రమోటర్లుగా కొనసాగనున్నారు.

ప్రభుత్వం కొత్త జియోస్పేషియల్‌ విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్న తరుణంలో మ్యాప్‌మైఇండియా ఐపీఓకి రానుండడం గమనార్హం. మ్యాప్‌ల తయారీ, సంబంధిత సమాచార నిర్వహణకు సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీని వల్ల దేశీయ ప్రైవేటు సంస్థలు అత్యంత కచ్చితత్వంతో కూడిన శాటిలైట్‌ చిత్రాలను ఎలాంటి అనుమతులు లేకుండానే వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. లాజిస్టిక్స్‌, వ్యవసాయం, క్యాబ్‌ సేవలు, ఈ-కామర్స్‌ డెలివరీ రంగాల్లో మ్యాపింగ్‌ సేవలు తప్పనిసరి అవుతున్న తరుణంలో ప్రభుత్వ చొరవ వల్ల రానున్న రోజుల్లో ప్రైవేట్‌ మ్యాపింగ్‌ సంస్థలకు మంచి వృద్ధి ఉండే అవకాశం ఉంది. 2030 నాటికి మ్యాపింగ్‌ పరిశ్రమ 14 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని మ్యాప్‌మైఇండియా సీఈఓ రోహన్‌ వర్మ అంచనా వేశారు.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, కోకాకోలా, ఓలా, ఫోన్‌పే, ప్రభుత్వ విభాగం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ సహా మొత్తం 5000 వ్యాపార సంస్థలు మ్యాప్‌మైఇండియా సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు వ్యాపార సంస్థలకు మాత్రమే సేవల్ని అందించిన ఈ కంపెనీ రానున్న రోజుల్లో సామాన్య ప్రజలకు కూడా చేరువ కావాలని ప్రణాళికలు రచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని