పదవీ విరమణ నిధి కోసం ఇంతకంటే మంచి పెట్టుబడి పథకం మరొకటి లేదు!

18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు

Updated : 24 Jul 2021 17:23 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం స‌రైన పెట్టుబ‌డి ఆప్ష‌న్‌గా ఎన్‌పీఎస్  అని చెప్పొచ్చు. దీంతో నెల‌వారి పెన్ష‌న్‌తో పాటు ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి ఒకేసారి పెద్ద మొత్తంలో సొమ్మును పొంద‌వ‌చ్చు.  ఇది వ్యాపారులు, ఉద్యోగులు, ఫ్రీలాన్సింగ్ ప‌ని చేసే లాయ‌ర్లు, డాక్ట‌ర్లు, సీఏలు, సంస్థ‌లు, ఆర్కిటెక్ట్‌లు, స్వ‌యం ఉపాధి క‌లిగిన‌వారు.. ఇలా అందిరికీ ఇది మంచి పెట్టుబ‌డి ప‌థ‌కమని నిపుణులు సూచిస్తున్నారు. 18-70 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల  ఏ భార‌తీయ పౌరుడైనా ఇందులో చేర‌వ‌చ్చు.

పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపిక‌, ఆస్తి కేటాయింపు నిర్ణ‌యం చందాదారులకే ఉంటాయి. ఎక్కువ రిస్క్ తీసుకునేవారు ఈక్విటీ ఫండ్ల‌కు 75 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డుల‌ను కేటాయించ‌వ‌చ్చు. అధిక రాబ‌డితో పాటు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉండ‌టంతో ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఎన్‌పీఎస్ మంచి ప‌థ‌కంగా ప్రాధాన్య‌త ఏర్ప‌రుచుకుంది.

ఎన్‌పీఎస్‌తో ఐదు ముఖ్య‌మైన‌ ప్రయోజనాలివే..

1. పెట్టుబ‌డి సౌల‌భ్యం :

పెట్టుబడిదారులు వారికి వీలైన‌ప్పుడు ఎప్పుడైనా ఎన్‌పీఎస్‌లో డిపాజిట్ చేసే స‌దుపాయాన్ని అందిస్తుంది. పెట్టుబ‌డిపై గ‌రిష్ఠ ప‌రిమితి లేదు.

2. భార్యాభర్తలిద్దరూ నమోదు చేసుకోవచ్చు :

స్వయం ఉపాధి క‌లిగిన భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ వేర్వేరు ఎన్‌పీఎస్ ఖాతాల‌ను ప్రారంభించి ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ఎక్కువ‌గా డ‌బ్బు స‌మ‌కూరడంతో పాటు, త‌ర్వాత ఎక్కువ‌ పెన్ష‌న్ కూడా ల‌భిస్తుంది.

3. ఉద్యోగుల‌తో పాటు సంస్థ‌కు లాభం :

సంస్థ‌లు ఉద్యోగుల కోసం ఎన్‌పీఎస్ ఖాతాల‌ను ప్రారంభించి వారి ప‌ట్ల విధేయ‌త‌ను చూప‌వ‌చ్చు. ఇది ఉద్యోగుల భవిష్యత్తును భద్రపరచడమే కాక, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 36 (1) (IVa) ప్రకారం వ్యాపార ఖర్చుల కింద దీనిని యజమాని క్లెయిమ్ చేయవచ్చు.

4. పన్ను మినహాయింపు :

స్వ‌యం ఉపాధి క‌లిగిన ఎన్‌పీఎస్ చందాదారులు వారి స్థూల వార్షిక ఆదాయంలో 20 శాతం వరకు ప‌న్ను మిన‌హాయింపులు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. వేత‌న జీవులు కూడా సెక్షన్ 80 సీసీడీ (2) కింద యజమాని చేసిన ఎన్‌పీఎస్ డిపాజిట్‌పై పన్ను మినహాయింపును పొందవచ్చు. దీంతోపాటు సెక్షన్ 80 సీసీడీ (1 బి) కింద ఎన్‌పీఎస్ పెట్టుబడులపై రూ.50,000 ప్రత్యేక పన్ను మినహాయింపు ల‌భిస్తుంది.

5. వ్యాపారుల‌కు భ‌ద్ర‌త‌ :

వ్యాపారం అనేది ఎప్పుడైనా రిస్క్‌తో కూడుకొని ఉంటుంది. లాభ‌, న‌ష్టాల‌ను అంచ‌నా వేయ‌లేం. కాబ‌ట్టి, ఎన్‌పీఎస్ ఖాతాను ప్రారంభించ‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి నెల‌వారి పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని