ప‌ద‌వీ విర‌మ‌ణకు ద‌గ్గ‌ర‌లో ఉన్నారా? అయితే రిస్క్ తీసుకోవ‌డం మంచిది కాదు 

ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు స‌మీపంలో ఉన్న‌ప్పుడు.. అధిక రిస్క్ ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం మంచిది కాదు.

Published : 31 Aug 2021 19:26 IST

రిటైర్ అయ్యాక జీవితం సాఫీగా సాగాలంటే ప‌ద‌వీ విర‌మ‌ణ‌ నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం చాలా ముఖ్యం, ఇందుకోసం సంపాద‌న ప్రారంభ‌మైన నాటి నుంచి ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళ్లాలి. అయితే ప‌దవీ విర‌మ‌ణ నిధి ఏర్పాటు చేసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, దానిని స‌మ‌క్ర‌మంగా వినియోగించుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే  స‌మ‌యానికి ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ని చాలా మంది భావిస్తారు. కానీ అది ఒక అపోహ మాత్ర‌మేన‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నిజానికి ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు నిరంత‌ర ప‌నిఒత్తిడితో చేయ‌లేని ప‌నుల‌ను, విశ్రాంత జీవితంలో చేయాల‌నుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఉదాహ‌ర‌ణ‌కి, సినిమాలు చూడ‌టం, సామాజిక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం, ఇష్ట‌మైన ప్ర‌దేశాల‌కు ప్ర‌యాణించ‌డం మొద‌లైన వాటితో ఖ‌ర్చు పెరుగుతుంది. విశ్రాంత జీవితంలో ప్ర‌జ‌లు వస్త్ర‌దార‌ణ వంటి విష‌యాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త  ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టీ.. వైద్య ఖ‌ర్చుల రూపంలో అద‌న‌పు భారం ప‌డుతుంది.  ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాతి జీవితం మూడు ద‌శ‌ల‌గా ఉంటుంది. ప్రారంభం, మ‌ధ్య‌, తుది ద‌శ‌లు. ఈ మూడు ద‌శ‌ల‌ను విశ్లేషించి త‌ద‌నుగుణంగా ప్ర‌ణాళిక చేసుకోవాలి. 

ప‌దివీ విర‌మ‌ణ ప్రారంభ ద‌శ‌లో చాలా మందికి స‌మ‌య‌పాల‌న క‌ష్టంగా మారుతుంది. ఖాళీగా ఉండ‌కూడ‌ద‌ని వ్యాపారం లేదా వేరే ఏదైనా పెట్టుబ‌డులు పెట్టేందుకు చూస్తుంటారు. ఇందుకోసం ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఖర్చు చేస్తారు. లేదా రుణం తీసుకునేందుకు సిద్ధ ప‌డ‌తారు. అయితే కొంత మంది న‌గ‌దు పెట్టుబ‌డుల‌ను స‌రైన రీతిలో నిర్వ‌హించ‌లేరు. మ‌రికొంత మంది త‌క్ష‌ణ లాభాల‌ను ఆశించి ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ వైపు మ‌ళ్ళిస్తుంటారు. ముఖ్యంగా బుల్ మార్కెట్లో స్వ‌ల్ప కాలంలోనే అధిక లాభాలు వ‌స్తాయ‌ని, త‌ప్పుడు అంచానాల‌తో పెట్టుబ‌డులు పెడుతుంటారు. దీంతో లాభం కంటే న‌ష్ట‌మే అధికంగా ఉంటుంది. 
 
ల‌క్ష్యం చేరుకునేంద‌కు త‌గినంత స‌మ‌యం ఉన్న‌ప్పుడు ఆదాయాన్ని పొంద‌డానికి వీలుగా ఉన్న‌ పెట్టుబ‌డుల‌ను ఆశ్ర‌యించాలి. ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు ఆదాయం ఉంటుంది. ఆ స‌మ‌యంలో రిస్క్ తీసుకుని మ‌దుపు చేయ‌వ‌చ్చు. కానీ  ప‌దివీ విర‌మ‌ణ త‌రువాత రిస్క్ తీసుకోవాల‌నుకోవ‌డం అంత మంచిది కాదు. పెట్టే పెట్టుబ‌డిలో ఎంత ఆదాయం వ‌స్తుందో న‌మ్మ‌కం లేనప్పుడు, దాని నుంచి ఎటువంటి ఆదాయం ఆశించ‌లేము. ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితంలో చేసే పెట్టుబ‌డుల నుంచి ఖ‌చ్చిత‌మైన ఆదాయం ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా అస‌లు మొత్తం రిస్క్‌లో ప‌డ‌కుండా చూసుకోవాలి.

ఏ రంగంలో ప‌నిచేస్తున్న‌, ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందే కావ‌ల‌సిన నిధిని సిద్ధం చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు నిశితంగా ప‌రిశీలిస్తుండాలి. ఏదైనా వెంచ‌ర్‌లో గానీ, వ్యాపారంలో గానీ పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారు, అందులో ఉన్న‌ రిస్క్‌ అంచానా వేయాల్సి ఉంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి ముందుగా రుణం తీసుకోవ‌డం మంచిది కాదు. మీ పొదుపు మొత్తంపై వీలైనంత వ‌ర‌కు రిస్క్‌ శాతాన్ని త‌గ్గించుకోవాలి.  

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత చాలా మంది వారి ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టి రుణం తీసుకుంటారు.  ఈమొత్తంతో వెంచ‌ర్ల‌ను ప్రారంభిస్తారు. రుణం స‌మ‌యానికి తిరిగి చెల్లించ‌లేక‌పోతే  రుణ ఉచ్చులో చిక్కుకు పోయే ప్ర‌మాదం ఉంది. ఇది ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిపై ప్ర‌భావం చూప‌డం మాత్ర‌మే కాకుండా మీ కుటుంబాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. అందువ‌ల్ల, మీకు ఆదాయ మార్గం లేన‌ప్పుడు ఆస్తిని త‌న‌ఖా ఉంచి రుణాలు తీసుకోవ‌డం, క్రెడిట్‌కార్డు రుణాలు వంటి వాటికి దూరంగా ఉండ‌డం మంచింది. ఏదైనా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేప్పుడు దానికి వ‌ర్తించే మిగిలిన చార్జీలు(వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుల వంటివి) కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మీకు ఆస్తి ఉండి, తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు అవ‌కాశం లేక‌పోతే మీ ఆస్తిని రివ‌ర్స్ మోర్ట‌గేజ్ పెట్టేందుకు ఆప్ష‌న్ ఉంటుంది. అయితే తీసుకునే ముందు పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవాలి. ఏదిఏమైన‌ప్ప‌టికీ ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన లేదా స‌మీపంలో ఉన్నా రిస్క్ తీసుకోవ‌డం మంచిది కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని