Published : 02 Apr 2021 01:52 IST

చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్‌ అంగీకారం

ఫ్రాంక్‌ఫర్ట్‌: ఒపెక్‌, అనుబంధ దేశాలు చమురు ఉత్పత్తి పెంపునకు అంగీకరించాయి. రోజుకు 2 మిలియన్‌ బారెళ్లకు ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని గురువారం నిర్ణయించాయి. మే నుంచి జులై దాకా ఈ పెంపును చేపడతాయి. కరోనా నుంచి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న వేగంలోనే అడుగులు వేయాలని అవి భావిస్తున్నాయి. గిరాకీ తగ్గడంతో ధరలకు మద్దతునిచ్చేందు కోసం గతేడాది ఉత్పత్తిలో కోత విధించిన ఒపెక్‌ ఇపుడు తిరిగి ఆ స్థాయికి ఉత్పత్తిని పెంచుతోంది. మేలో రోజుకు 3,50,000 బారెళ్లు; జూన్‌లో 3,50,000; జులైలో 4,00,000 బారెళ్ల చొప్పున జత చేసుకుంటూ వెళతాయి. సౌదీ అరేబియా అదనం మిలియన్‌ బారెళ్లను జత చేస్తుంది.


మార్చిలో పెరిగిన ఎగుమతులు
58% వృద్ధితో 34 బి. డాలర్లకు

దిల్లీ: మార్చి నెలలో దేశ ఎగుమతులు 58.23 శాతం పెరిగి 34 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇంజినీరింగ్‌, రత్నాభరణాలు, ఫార్మాల్లో మంచి వృద్ధి నమోదుకావడం ఇందుకు నేపథ్యమని వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఏప్రిల్‌-మార్చి 2020-21లో ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.4% తగ్గి 290.18 బి. డాలర్లకు పరిమితం అయ్యాయి. దిగుమతులు కూడా 18% క్షీణించి 388.92 బి. డాలర్లకు చేరాయి.


రికార్డు టర్నోవరు సాధించిన బెల్‌

బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బెల్‌) కరోనా నేపథ్యంలోనూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు టర్నోవరు అయిన రూ.13,500 కోట్లను సాధించింది. అంతక్రితం ఏడాది టర్నోవరు రూ.12,608 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌ 1 నాటికి బెల్‌ ఆర్డరు పుస్తకం రూ.53,000 కోట్లుగా ఉంది. 2020-21లో కంపెనీ రూ.15,000 కోట్ల ఆర్డర్లను పొందింది.


పీఎఫ్‌సీ డివిడెండు రూ.1183 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.1182.63 కోట్ల మధ్యంతర డివిడెండును చెల్లించింది. ప్రభుత్వానికి కంపెనీలో ఉన్న 56 శాతం వాటాకు గాను ఈ డివిడెండును ఇచ్చినట్లు పీఎఫ్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 12, 2021 నాటి బోర్డు సమావేశంలో ఈ డివిడెండుకు ఆమోదం లభించింది.


బిగ్‌బజార్‌ తక్షణ డెలివరీ సేవలు
రోజుకు లక్ష ఆర్డర్ల లక్ష్యం

దిల్లీ: తక్షణ హోమ్‌ డెలివరీ సేవల్లోకి అడుగుపెడుతున్నట్లు కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ గొలుసుకట్టు సంస్థ బిగ్‌బజార్‌ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను ఆర్డర్‌చేసిన రెండు గంటల సమయంలో డెలివరీ చేస్తామని కంపెనీ అంటోంది. ఫ్యాషన్‌, ఆహారం, ఎఫ్‌ఎమ్‌సీజీ, గృహ విభాగాల్లోని ఉత్పత్తులను మొబైల్‌ యాప్‌, పోర్టల్‌ ద్వారా చేసే ఆర్డర్లకు సమీప స్టోరు నుంచి సేవలు అందిస్తారు. ప్రస్తుతం ఈ 2 గంటల డెలివరీ సేవలను దిల్లీ, ముంబయి, బెంగళూరులో ప్రారంభించారు. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరిస్తారు. వచ్చే 2-3 నెలల్లో రోజుకు లక్ష ఆర్డర్ల వరకు సేవలందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.


పుణెలో పేటీఎమ్‌ మనీ కేంద్రం
250 ఉద్యోగాల ప్రకటన

దిల్లీ: పేటీఎమ్‌కు చెందిన పేటీఎమ్‌ మనీ పుణెలో సాంకేతిక అభివృద్ధి, వినూత్నత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో 250కి పైగా ఇంజినీర్లు, డేటా సైంటిస్ట్‌లను నియమించుకోనున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది.


ఐసీఏఐ కార్యదర్శిగా ముకేశ్‌ కుమార్‌ జైన్‌

దిల్లీ: ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) కార్యదర్శిగా ముకేశ్‌ కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు. ఈయన అంతక్రితం ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ)కు ఎండీ, సీఈఓగా  పనిచేశారు. 1986లో బ్యాంకింగ్‌ రంగంలో వృత్తిజీవితాన్ని ప్రారంభించిన ఈ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు.


ఫాస్టాగ్స్‌ కోసం ఐసీఐసీఐ, ఫోన్‌పే జట్టు

దిల్లీ: ఫాస్టాగ్‌ల జారీ నిమిత్తం ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫోన్‌పేలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద ఫోన్‌పే యాప్‌లో యూపీఐని వినియోగించి ఫాస్టాగ్‌లను వినియోగదార్లకు జారీ చేస్తారు. ఈ భాగస్వామ్యం వల్ల 28 కోట్ల ఫోన్‌పే వినియోగదార్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫాస్టాగ్‌లను యాప్‌లో ఆర్డరు చేసి ట్రాక్‌ చేయవచ్చు.


ఎన్‌సీసీకి రూ.530 కోట్ల ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంస్థ అయిన ఎన్‌సీసీ లిమిటెడ్‌కు రూ.530 కోట్ల కొత్త ఆర్డర్లు లభించాయి. ఇవి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చాయి. ఇందులో నీటిపారుదల శాఖకు చెందిన ఆర్డర్లు రూ.342 కోట్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని